Chandra Mohan: తెనాలి రామకృష్ణుడు.. ఆవారా కొడుక్కి తండ్రీ అన్నీ ఆయనే! మిమిక్రీ ఆర్టిస్టుకి దొరకని సహజ నటుడు..

Updated : 11 Nov 2023 18:32 IST

చిత్ర పరిశ్రమలో ఒక వాదన ఉంది.. ‘హీరోలందరూ నటులు కాలేరు. కానీ, నటులు హీరోలు కావచ్చు’ ఎందుకంటే కథకు హీరో అయితే ఆ కథే అతడికి పేరు తీసుకొస్తుంది. కానీ, అదే కథకు నటుడు దొరికితే అది అద్భుత చిత్రమవుతుంది. ఈ రెండింటికీ సరిపోయే అతి కొద్ది మంది నటుల్లో చంద్రమోహన్‌ ఒకరు. ఆయన ఒక హీరో.. ఒక కమెడియన్‌.. ఒక క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌.. పిల్లలకు తండ్రి... ఇలా చెప్పుకొంటూ పోతే చంద్రమోహన్‌ ఒక సహజ నటుడు. నీరు ఏ పాత్రలో పోస్తే, దాని ఆకారాన్ని సంతరించుకున్నట్లు చంద్రమోహన్‌ కూడా ఆ పాత్రలో ఇమిడిపోతారు.. కలిసిపోతారు.. అందులో మమేకమై మన హృదయాలకు దగ్గరవుతారు.

హీరో అయితే ఫైట్లే చేయాలా ఏంటి?

చలం, పద్మనాభం, రాజబాబు కమెడియన్లుగానే కాక కథానాయకులుగానూ రాణించారు. కానీ, హీరోయిజంతోపాటు కామెడీ కూడా చేయగల నటుడిగా తనని తాను నిరూపించుకున్నారు చంద్రమోహన్‌. ‘కొంటె కాపురం’, ‘సీతాపతి సంసారం’, ‘గోపాలరావుగారి అమ్మాయి’, ‘పక్కింటి అమ్మాయి’, ‘ఇంటింటి రామాయణం’, ‘రాధాకల్యాణం’ తదితర చిత్రాలు చూస్తే, చంద్రమోహన్‌ చక్కటి హాస్యాన్ని పండిస్తూనే తన స్థాయి తగిన హీరోయిజాన్ని ఆయా పాత్రల్లో చూపించారు.  ఇక ‘16ఏళ్ల వయసు’లో అవిటి వ్యక్తిగా, కాస్త తింగరతనం కలగలిసిన గోపాలకృష్ణ పాత్రలో చంద్రమోహన్‌ (Chandra Mohan)  నటన తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. తాను ఇష్టపడే మల్లి మరొకరిని ఇష్టపడుతోందని తెలిసిన తర్వాత  చంద్రమోహన్‌ పలికించే హావభావాలు సినిమాలో లీనమైన ప్రతి ప్రేక్షకుడిని కన్నీళ్లు పెట్టిస్తాయి. తమిళంలో ఇదే పాత్రను చేసిన కమల్‌హాసన్‌ చంద్రమోహన్‌ నటనకు ఫిదా అయిపోయారంటే అర్థం చేసుకోవచ్చు.

చంద్రమోహన్‌ ఏదైనా చేస్తారు!

చిత్ర పరిశ్రమలో నటుడిగా ప్రయాణం మొదలు పెట్టిన తర్వాత చాలా మంది ఏదో ఒక విషయంలో ప్రతిభను కనబరుస్తారు. అంటే యాక్షన్‌ హీరో, ఫ్యామిలీ స్టార్‌, కమెడియన్‌ ఇలా ఏదో ఒక దానిలో ఇమిడిపోతారు. ‘చంద్రమోహన్‌ ఇలాంటి పాత్రలే చేస్తాడు’ అని కాకుండా ‘ఎలాంటి పాత్ర అయినా చేస్తాడు’ అని అనిపించుకున్నారు. ‘అన్ని పాత్రలకు సరిపోతున్నావు. ఏదోక రోజు మంచి అవకాశాలు వస్తాయి. అప్పటివరకూ వచ్చిన ప్రతి అవకాశాన్ని వదలకు’ అని శోభన్‌బాబు ఇచ్చిన సలహానే ‘సిరిసిరి మువ్వ’లో సాంబయ్యగా కనిపించినా, ‘కురుక్షేత్రం’లో అభిమన్యుడిగా వీరవిహారం చేసినా, ‘ప్రాణం ఖరీదు’లో మూగవాడిగా అద్భుత నటన కనబరిచినా మనకు ఆ పాత్రలే కనపడతాయి తప్ప చంద్రమోహన్‌ కనిపించరు.  ‘రామ్‌ రాబర్ట్‌ రహీమ్‌’లో కృష్ణ, రజనీకాంత్‌ యాక్షన్‌తో అదరగొడితే, చంద్రమోహన్‌ తన డిక్షన్‌తో అలరించారు. ‘పక్కంటి అమ్మాయి’ మనసు దోచేందుకు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో కలిసి చంద్రమోహన్‌ చేసే హంగామా ఎంత సహజంగా ఉంటుందో మాటల్లో చెప్పలేం.

అందరిలో ఒకడు.. కానీ, గుర్తుండిపోతాడు!

చంద్రమోహన్‌ (Chandra Mohan) తన కెరీర్‌లో ఫలానా పాత్రల కోసమేనని గిరిగీసుకుని కూర్చొలేదు. అగ్ర కథానాయకుడు ఏయన్నార్‌, కృష్ణ వంటి హీరోల చిత్రాల్లో నటిస్తూనే, మరోవైపు అప్పుడు చిత్ర పరిశ్రమలో స్టార్‌లుగా ఎదుగుతున్న చిరంజీవి, నాగార్జున, వెంకటేష్‌, బాలకృష్ణ వంటి హీరోల చిత్రాల్లో వారి స్నేహితుడి పాత్రల్లోనూ మెప్పించారు. దర్శక-రచయితలు ఆయనకు రాసిన పాత్రలకు వందశాతం న్యాయం చేసేవారు. ‘ప్రతి ఘటన’లో లాయర్‌ గోపాలకృష్ణగా, ‘శ్రీ షిర్డీ సాయిబాబా’లో నన్వలిగా, ‘ఆదిత్య 369’లో ‘తెనాలి రామకృష్ణగా’ చంద్రమోహన్‌ను తప్ప మరొకరిని ఊహించుకోలేం. ‘పెద్దరికం’లో తన తండ్రికి తెలియకుండా పెళ్లి చేసుకుని జగపతిబాబుకు దొరికిపోయినప్పుడు చంద్రమోహన్‌ పలికించే హావభావాలు ఎంతగానే అలరిస్తాయి.

కాలంతో మారిన చంద్రమోహన్‌

కాలంతో పాటు ప్రతి మనిషీ మారాల్సిందే. అందుకు నటీనటులు ఏమీ అతీతులు కాదు. చంద్రమోహన్‌కు ఆ విషయం బాగా తెలుసు. అందుకే  50 ఏళ్ల పాటు ఇండస్ట్రీలో నటుడిగా కొనసాగారు. వయసుకు తగిన పాత్రలను ఎంపిక చేసుకోవాల్సిన సమయం వచ్చిందని అర్థం చేసుకున్నారు. 90వ దశకం నాటికి హీరో, కమెడియన్‌ పాత్రలకు నెమ్మదిగా స్వస్తి పలికి, తండ్రి పాత్రలు చేయడం మొదలు పెట్టారు. ‘కలికాలం’తో మొదలైన ఆ ప్రవాహం.. చివరి వరకూ కొనసాగింది. ‘గులాబీ’లో కొడుకు అతడి స్నేహితులతో కలిసిపోయే తండ్రిగా ఎంతగా అలరించారో, ‘ఆమె’లో ఇద్దరు కూతుళ్లకు తండ్రిగా, పరిస్థితులకు తలవంచే మధ్యతరగతి ఉద్యోగిగా  అంతే భావోద్వేగాలను పంచారు. ‘నిన్నే పెళ్లాడతా’లో  ఆయిల్‌ పుల్లింగ్‌ చేసినా, ‘ప్రేమించుకుందాం రా’లో పేపర్‌ వేసే వాడితో గొడవ పడినా ఆయనకే చెల్లింది. ‘తమ్ముడు’, ‘మనసంతా నువ్వే’, ‘నువ్వు నాకు నచ్చావ్‌’, ‘నువ్వే నువ్వే’, ‘సంతోషం’ ఇలా చెప్పుకొంటూ పోతే, ఒక కుటుంబరావు, ఒక శేఖరం, ఒక చంద్రం కనిపిస్తారు.

ఆవారా కొడుకు.. ఆవేదన పడే తండ్రి..

‘7/జీ బృందావనకాలనీ’ 2004లో యువ హృదయాలను కట్టిపడేసిన చిత్రం. ఇందులో రవి తండ్రి పాత్రలో చంద్రమోహన్‌ను (Chandra Mohan) తప్ప మరొకరిని ఊహించుకోలేం. అటు చదువు చదవకుండా, ఇటు పని చేయకుండా బాధ్యత లేకుండా తిరిగే కొడుకు పట్ల ఒక సగటు తండ్రి పడే ఆవేదన చంద్రమోహన్‌ తన నటనతో ఆవిష్కరించిన తీరు నభూతో.. ఎందుకంటే, ఇప్పటికీ మీమర్స్‌కు ఆ పాత్ర ఒక అసెట్‌. కొడుక్కి ఉద్యోగం వచ్చిన తర్వాత తన భార్యతో ‘ఇంకొకసారి నా కొడుకుని ఎవరైనా పనికిమాలినవాడు అంటే ఊరుకోను’ అంటూ ఆయన పలికే సంభాషణలు ప్రతి యువకుడితోనూ కన్నీళ్లు పెట్టించాయి. ఇక ‘రణం’, ‘ఢీ’, ‘కృష్ణ’, ‘లౌక్యం’ తదితర చిత్రాల్లో కొడుకు వల్ల ఇబ్బందులు పడే సగటు తండ్రి పాత్రలో నవ్వులు పంచారు.

మిమిక్రీ ఆర్టిస్టుకి దొరకని సహజ నటుడు

ఒకరి నటనను, వారి వాయిస్‌ను అనుకరించడం మనం చూస్తూనే ఉంటాం. చాలా తక్కువ మంది నటులను మాత్రమే ఎవరూ అనుకరించలేరు. ఒక నటుడిని అనుకరించాలంటే అతడిలోని నటనాపరమైన ఒక మేనరిజం పట్టుకోవాలి. అలాంటి మేనరిజాలేమీ లేకుండా పాత్రకు తగ్గట్టు మారిపోతుంటే ఆర్టిస్ట్‌ను ఇమిటేట్‌ చేయడం కష్టం. అలా మిమిక్రీ ఆర్టిస్ట్‌కు కూడా దొరకని నటుడే చంద్రమోహన్. అందుకే ఆయన సహజ నటుడు అయ్యారు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని