
Nani: మెగాస్టార్ దంపతులతో నాని టీ టైమ్
హైదరాబాద్: ‘శ్యామ్ సింగరాయ్’తో దాదాపు రెండేళ్ల తర్వాత బాక్సాఫీస్ వద్ద సందడి చేశారు హీరో నాని. సూపర్ నేచురల్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాలో నాని ద్విపాత్రాభినయంతో మెప్పించారు. ముఖ్యంగా బెంగాల్ నేపథ్యంలో వచ్చే కథ సినిమాకే ఆయువుపట్టుగా నిలిచింది. అందులో శ్యామ్ సింగరాయ్‌గా నాని, ఆయన సతీమణిగా సాయిపల్లవి నటన హైలైట్‌గా సాగింది. సినిమాని చూసిన ప్రతి ఒక్కరూ నానిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
కాగా, తాజాగా ఆ చిత్రాన్ని వీక్షించిన మెగాస్టార్ చిరంజీవి దంపతులు నానిని మెచ్చుకున్నారు. ప్రత్యేకంగా నానిని తమ ఇంటికి ఆహ్వానించిన చిరు.. పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందించారు. ‘‘నువ్వు దీని కంటే మరెన్నో ప్రశంసలకు అర్హుడివి’’ అని చిరు చెప్పడంతో నాని ధన్యవాదాలు తెలిపాడు. అనంతరం చిరు-సురేఖ దంపతులు నానితో కొంతసేపు ముచ్చటించారు. టీ టైమ్‌ని ఎంజాయ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ‘శ్యామ్ సింగరాయ్’ చిత్ర నిర్మాణ సంస్థ ట్విటర్ వేదికగా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. మరోవైపు ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రం శుక్రవారం నుంచి ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా అలరించనుంది.