Chiranjeevi: ‘సలార్‌’పై రివ్యూ ఇచ్చిన చిరంజీవి.. అద్భుతమంటూ ప్రశంసలు

‘సలార్‌’పై (Salaar) సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా ఈ సినిమాపై చిరంజీవి ట్వీట్‌ చేశారు.

Published : 23 Dec 2023 13:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్: తాజాగా విడుదలైన ‘సలార్‌’ భారీ విజయాన్ని అందుకుంది. ప్రశాంత్‌ నీల్ దర్శకత్వంలో ప్రభాస్‌ (Prabhas) హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ప్రశంసలు పొందుతోంది. ఇప్పటికే దీనిపై పలువురు సినీ ప్రముఖులు రివ్యూ ఇవ్వగా.. తాజాగా చిరంజీవి ‘సలార్‌’పై ప్రశంసలు కురిపించారు. ఈ సినిమాపై సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టారు. నటీనటులతో పాటు చిత్రబృందాన్ని అభినందించారు.

‘‘దేవా పాత్రతో ఆకట్టుకున్న ప్రభాస్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు. ‘సలార్‌: సీజ్ ఫైర్‌’ బాక్సాఫీస్‌ వద్ద అదరగొడుతోంది. ఇంత గొప్ప సినిమాను అందించిన ప్రశాంత్‌ నీల్‌కు అభినందనలు. ఆయన సినీరంగంలో మరింత రాణిస్తారు. ఇక ఇందులో వ‌ర‌ద రాజమ‌న్నార్‌గా పృథ్వీరాజ్ సుకుమార‌న్‌, ఆద్యగా శ్రుతిహాస‌న్, అలాగే క‌ర్త రాజ మ‌న్నార్ పాత్రలో జ‌గ‌ప‌తిబాబు అద్భుతంగా నటించారు. టెక్నికల్‌ టీమ్‌ పనితీరు కూడా ప్రశంసనీయంగా ఉంది. ఇంత పెద్ద విజయం సాధించినందుకు అందరికీ అభినందనలు’’ అని చిరంజీవి (Chiranjeevi) రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ను ప్రభాస్‌ అభిమానులు తెగ షేర్‌ చేస్తున్నారు. అలాగే, సినీ పరిశ్రమకు చెందిన మరికొందరు కూడా ‘సలార్‌’పై పోస్ట్‌లు పెట్టారు.

అదరగొట్టిన ‘సలార్‌’.. మొదటి రోజు కలెక్షన్స్‌ ఎంతంటే!

* వింటేజ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ యాక్షన్‌ మోడ్‌లో అదరగొట్టాడు. ఈ మాస్‌ అనుభూతి నుంచి బయటకు రావాలంటే చాలా రోజులు పడుతుంది. దర్శకుడితో పాటు చిత్రబృందానికి నా అభినందనలు - దర్శకుడు మారుతి.

* ప్రభాస్‌ను అభిమానులు కోరుకున్న విధంగా ప్రశాంత్ నీల్‌ చూపించారు. వారంతా ఎంతో సంతోషంగా ఉన్నారు. భారీ విజయాన్ని సాధించినందుకు ‘సలార్‌’లో భాగమైన అందరికీ అభినందనలు. రెండో భాగం కోసం ఎదురుచూస్తున్నా  - నటుడు గోపిచంద్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని