NTR: ఘనంగా ఎన్టీఆర్‌ శత జయంతి వేడుకలు.. హాజరైన సినీ, రాజకీయ ప్రముఖులు

నందమూరి తారకరామారావు (NTR) శత జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.

Updated : 20 May 2023 20:46 IST

హైదరాబాద్‌: విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు (NTR) శత జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్‌లోని కైత్లాపూర్‌ మైదానంలో శనివారం ఏర్పాటు చేసిన ఈ వేడుకల్లో నందమూరి కుటుంబసభ్యులు, సినీ, రాజకీయ ప్రముఖులు, హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ హాజరయ్యారు. నారా చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ, పురందేశ్వరి, భువనేశ్వరి, లోకేశ్వరి, వసుంధర, బ్రహ్మాణి, దేవాన్ష్‌.. నందమూరి కుటుంబ సభ్యులతోపాటు రాజకీయ ప్రముఖులు సీతారాం ఏచూరి, డి.రాజా,  సినీ ప్రముఖులు వెంకటేశ్‌, జయప్రద, జయసుధ, మురళీ మోహన్‌, రామ్‌ చరణ్‌, బాబు మోహన్‌, విజయేంద్ర ప్రసాద్‌, అల్లు అరవింద్‌, అశ్వినీదత్‌, ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, అనిల్‌ రావిపూడి, శ్రీలీలతోపాటు కన్నడ నటుడు శివరాజ్‌కుమార్‌, నాగచైతన్య, సుమంత్‌, సిద్ధు జొన్నలగడ్డ, అడివిశేష్‌ వంటి పలువురు సినీ తారలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మురళీ మోహన్‌ మాట్లాడుతూ.. ‘‘ఎన్టీఆర్ మన అందరి అభిమాన నటుడు. ప్రపంచంలో తెలుగువారు ఉన్న ప్రతిచోట ఆయన శత జయంతి వేడుకలు జరుగుతున్నాయి. నటనలో ఆయనకి ఆయనే సాటి. అప్పట్లో అందరూ నన్ను ఎన్టీఆర్ తమ్ముడిగా పిలిచేవారు. ఆయనకు భారతరత్న ఇవ్వకపోవడం బాధాకరం. ఇప్పుడైనా కేంద్రం ఎన్టీఆర్‌కు భారతరత్న ప్రకటించాలని కోరుతున్నాను’’ అని తెలిపారు.

🔴 ‘‘ఎన్టీఆర్‌తో కలిసి ఎన్నో సినిమాల్లో నటించాను. క్రమశిక్షణ ఆయన దగ్గరే నేర్చుకున్నా. ఎన్టీఆర్ ఆఖరిచిత్రంలోనూ నటించడం ఓ గొప్ప అనుభూతి’’ - జయసుధ 

🔴  నాగచైతన్య మాట్లాడుతూ.. ‘‘ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉంది. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ఎన్టీఆర్ ఒక మూలస్తంభం. ఆయన అందం, క్రమ శిక్షణ, వాక్చాతుర్యం గురించి అందరికీ తెలుసు. రాముడు, కృష్ణుడు అంటే నాకు గుర్తుకువచ్చేది ఆయనే. ఎన్టీఆర్‌ గురించి తాతయ్య గౌరవంగా మాట్లాడేవారు. వాళ్ల స్నేహం గురించి విని నేను స్ఫూర్తి పొందాను. తెలుగు దేశం పార్టీని స్థాపించి.. ప్రజల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. కళకు, భాషకు ఆయన ఎంతో ప్రాముఖ్యత ఇచ్చారు’’ అని పేర్కొన్నారు.

🔴 ‘‘నేను చూసిన మొదటి తెలుగు సినిమా ‘మిస్సమ్మ’. ఆ సినిమా చూసి నటుడిని కావాలనుకున్నా. ఈరోజు ఆయన శత జయంతి వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉంది.  ఎన్టీఆర్‌ సినిమాలు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమే. ఆయనకు ఉన్న కోట్ల మంది భక్తుల్లో నేనూ ఒకడిని’’ - అడివి శేష్‌ 

🔴 ‘‘ఎన్టీఆర్ సినీ పరిశ్రమకు చేసిన సేవ గురించి మాట్లాడాలి అంటే అర్హత ఉండాలి. శత  జయంతి వేడుకల్లో ఆ మహనీయుడిని తలచుకునే అదృష్టం రావడం గొప్ప విషయం. భౌతికంగా మన మధ్యలేక పోయినా ఆయన ప్రజల గుండెల్లో ఉన్నారు. నాది తెలుగు భాష అని చెప్పినప్పుడు ఉండే గర్వం పేరే ఎన్టీఆర్. ఒక జాతి కథే ఆయన చరిత్ర. ఆయనతో నటించలేకపోవడం బాధాకరం’’ - వెంకటేశ్‌

🔴 ‘‘రాముడు, కృష్ణుడి గురించి మాట్లాడలేము.. వారిని అనుభూతి చెందాలి. తెలుగుకి ఒక గుర్తింపు తెచ్చిన వ్యక్తి ఎన్టీఆర్‌. ఒకే ఒక్కసారి ఎన్టీఆర్‌ని కలిశాను. ఆయనే నాకు ప్రత్యేకంగా బ్రేక్‌ ఫాస్ట్‌ వడ్డించారు. తెలుగు ఇండస్ట్రీ ఉన్నంతకాలం ఎన్టీఆర్‌ పేరు ఉంటుంది. తెలుగు వారి పవర్ ఇప్పుడు కాదు అప్పట్లోనే  ప్రపంచానికి చాటారు’’ - రామ్‌ చరణ్‌
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని