Year Ender 2023: ‘డీప్’ ట్రబుల్స్.. ‘ఫేక్’ వీడియోస్.. 2023లో కలవరపెట్టిన డీప్‌ఫేక్‌..

2023లో సెలబ్రిటీలను డీప్‌ఫేక్‌ (Deepfake) వీడియోలు కలవరపెట్టాయి. దీని బారిన పడిన ప్రముఖులెవరో చూద్దాం.

Published : 30 Dec 2023 14:28 IST

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో డీప్‌ఫేక్‌ (Deepfake) టెక్నాలజీ సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ అందరిలోనూ కలవరం కలిగిస్తోంది (Year Ender 2023). 2023లో సినీ, రాజకీయ ప్రముఖులు దీని బారిన పడటం హాట్‌టాపిక్‌గా మారింది. ఏకంగా దేశ ప్రధాని మోదీ కూడా దీని గురించి మాట్లాడి అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. కృత్రిమ మేధతో రూపొందిస్తున్న డీప్‌ఫేక్ వీడియోల పట్ల జాగ్రత్తగా ఉండాలని.. ఆ వీడియోలు, ఫొటోలను నిజమేనని నమ్మే ముందు వాటి ప్రామాణికతను సరిచూసుకోవాలని మోదీ కోరారు. ఈ ఏడాది దీని బారిన పడిన సెలబ్రిటీలు.. వాళ్ల స్పందనలు ఒకసారి చూద్దాం..

రష్మికతో మొదలు..

గతంలో కేవలం ఫొటోలకే పరిమితమైన డీప్‌ఫేక్‌ టెక్నాలజీ ఏకంగా వీడియోల రూపంలోనూ సెలబ్రిటీలను తిప్పలు పెట్టింది. కథానాయిక రష్మికకు (Rashmika) సంబంధించిన ఓ డీప్‌ఫేక్‌ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అందరూ షాకయ్యారు. జరా పటేల్‌ అనే ఇన్‌ఫ్లూయెన్సర్‌ వీడియోను కొందరు రష్మికలా మార్ఫింగ్‌ చేశారు. దీనిపై ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చర్య తనని తీవ్రంగా బాధించిందని, సాంకేతికతను ఇలా దుర్వినియోగం చేస్తారనుకోలేదన్నారు. తనలాంటి ఎందరో ఈ ఏఐ బారిన పడుతున్నారంటూ పోస్ట్ పెట్టారు. రష్మిక వీడియోపై స్పందించిన పలువురు సెలబ్రిటీలు ఈ ఘటనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, నాగచైతన్య, సాయి ధరమ్ తేజ్, చిన్మయి తదితరులు ఈ చర్యను ఖండించారు. సాంకేతికతను ఇలా దుర్వినియోగం చేస్తుంటే భయమేస్తోందని పేర్కొన్నారు.

దీని బారిన పడిన మరికొందరు సినీ తారలు..

రష్మిక డీప్‌ఫేక్‌ వ్యవహారం పూర్తిగా మరవక ముందే మరికొంత మంది సినీ తారలు దీని బారిన పడ్డారు. బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ డ్రెస్ ఛేంజింగ్ వీడియో అంటూ ఓ డీప్‌ఫేక్‌ కలవరపెట్టింది. ఆ తర్వాత అలియాభట్‌ను (Alia bhatt) టార్గెట్‌ చేస్తూ కొందరు ఆకతాయిలు వీడియో సృష్టించారు. అసభ్యకరంగా ఉన్న మహిళ వీడియోకు అలియా ముఖాన్ని జత చేసి ఫేక్‌ వీడియో రూపొందించారు. మరో బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ కూడా దీని బారిన పడ్డారు. ఆమె నటించిన ‘టైగర్3’లోని టవల్ ఫైట్‌లో ముఖాన్ని మార్ఫింగ్ చేశారు. అలాగే, ప్రియాంక చోప్రా (Priyanka Chopra) వాయిస్‌నూ సైబర్ నేరగాళ్లు వదల్లేదు. గతంలో ఆమె మాట్లాడిన ఓ వీడియోలో ఆమె ముఖం మార్చకుండా అందులోని వాయిస్‌ను మార్చారు. ఆమె ఓ నకిలీ బ్రాండ్‌ను ప్రమోట్‌ చేస్తున్నట్లు లిప్‌సింక్‌ చేశారు. తన వార్షిక ఆదాయాన్ని వెల్లడించిన్నట్లు ఆ వీడియోను రూపొందించారు. ఒక బ్రాండ్‌ కారణంగా 2023లో తన వార్షిక ఆదాయం భారీగా పెరిగిందని.. అందరూ దాన్ని ఉపయోగించాలని ప్రియాంక చెప్పినట్లు క్రియేట్‌ చేశారు. ఈ వీడియోలన్నీ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఫైర్ అయ్యారు.

సినీ ప్రముఖులకే పరిమితం కాలేదు..

ఈ డీప్‌ఫేక్‌ కేవలం సినీ తారలకే పరిమితం కాలేదు. క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ కుమార్తె సారా తెందూల్కర్‌ కూడా దీని బారిన పడినట్లు ఆమె స్వయంగా వెల్లడించారు. క్రికెటర్‌ శుభ్‌మన్‌ గిల్‌తో సారా తెందూల్కర్‌ ఉన్నట్లు మార్ఫింగ్ చేసిన ఫొటోలను ఆకతాయిలు సోషల్ మీడియాలో షేర్‌ చేశారు. దీనిపై స్పందించిన సారా.. తన డీప్‌ఫేక్‌ వీడియోలు కూడా నెట్టింట వైరల్‌ అయినట్లు తెలిపారు. ఇక, ‘ఎక్స్‌ (ట్విటర్‌)’లో తన పేరుతో కొంతమంది నకిలీ ఖాతాలు తెరిచారని వెల్లడించారు. ఈ మేరకు ఇన్‌స్టాలో పోస్ట్‌ పెట్టారు. వాస్తవాలను పణంగా పెట్టి వినోదం పంచకూడదని సారా అన్నారు. విశ్వసనీయత, వాస్తవికత ఉండే కమ్యూనికేషన్‌ను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు.

స్పందించిన కేంద్రం..

ఈ డీప్‌ఫేక్‌ వీడియోలు వైరల్ కావడంతో సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేశారు. సైబర్ నేరగాళ్ల నుంచి మహిళలకు భద్రత కల్పించేందుకు ప్రత్యేక పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. డీప్‌ఫేక్‌ వీడియోలు రూపొందించడం దారుణమని సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ఐటీ శాఖ సహాయమంత్రి రాజు చంద్రశేఖర్.. మార్ఫింగ్ ఓ ప్రమాద చర్యగా అభివర్ణించారు. ఇలాంటి వీడియోల అరికట్టే బాధ్యత సోషల్ మీడియా సంస్థలదేనని ట్వీట్ చేశారాయన. డీప్‌ఫేక్‌ వంటి వీడియోలు క్రియేషన్‌, సర్క్యులేషన్‌కు సంబంధించిన పెనాల్టీలు, నిబంధనలు గుర్తు చేస్తూ కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, కమ్యూనికేషన్‌ మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఆయా సోషల్‌మీడియా సంస్థలకు అడ్వయిజరీని పంపించింది. ఎవరైనా, ఏదైనా కమ్యూనికేషన్ పరికరం లేదా కంప్యూటర్ రిసోర్స్ వినియోగించి వ్యక్తులను మోసం చేస్తే మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష, లక్ష రూపాయల వరకు జరిమానా పడుతుందని సోషల్‌మీడియా ప్లాట్‌ఫాంలకు కేంద్రం గుర్తుచేసింది.

గుర్తించడమెలా..?

సాంకేతికత మాటున జరుగుతున్న ఇలాంటి దుర్మార్గాలను అడ్డుకోవడానికి ఇప్పుడిప్పుడే టూల్స్‌ అందుబాటులోకి వస్తున్నాయి. సామాన్య వ్యక్తుల స్థాయిలోనూ వీటిని గుర్తించొచ్చు. ఇలాంటి వీడియోల్లో ముఖ కవళికలు, చూసే తీరులో తేడాలను గుర్తించొచ్చు. ఆడియో విషయంలో లిప్‌ సింక్‌ను తీక్షణంగా గమనిస్తే గుర్తు పట్టొచ్చు. కనిపించే వీడియో బ్యాగ్రౌండ్‌ కూడా భిన్నంగా, కృత్రిమంగా సృష్టించినట్లు కనిపిస్తుంది. ఏదేమైనా సోషల్‌ మీడియాలో కనిపించే వీడియోల పట్ల అప్రమత్తంగా ఉండండి. రెచ్చగొట్టే, మోసపూరిత వీడియోలను ధ్రువీకరించుకోకుండా ఇతరులకు షేర్‌ చేయడం ఎంతమాత్రం శ్రేయస్కరం కాదు. ఒకవేళ సాంకేతికత పట్ల అవగాహన ఉంటే ఆన్‌లైన్‌ టూల్స్‌ అందుబాటులో ఉన్నాయి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని