oscars 2023: ‘డు యూ నో నాటు’.. ఆస్కార్‌ వేదికపై పాటను పరిచయం చేసిన దీపిక

‘‘నాటు అంటే మీకు తెలుసా..? తెలియకపోతే ఇప్పుడు తెలుస్తుంది’’ అంటూ ఆస్కార్‌ వేదికపై ఈ పాటను పరిచయం చేశారు నటి దీపికా పదుకొణె. ప్రతిష్ఠాత్మక సినీ వేడుకలో ఈ పాట మార్మోగడంతో యావత్ భారతావని గర్వంతో ఉప్పొంగిపోతోంది.

Updated : 13 Mar 2023 11:02 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారతీయ సినీ రంగంలో సువర్ణాధ్యాయాన్ని లిఖిస్తూ తెలుగు పాట ‘నాటు నాటు’ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఉత్తమ ఒరిజినల్‌ స్కోర్‌ విభాగంలో ఆస్కార్‌ (oscars 2023) పురస్కారాన్ని అందుకుంది. దీంతో లాస్‌ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌ ‘నాటు నాటు (Naatu Naatu)’తో దద్దరిల్లింది. ఈ అవార్డు ప్రకటనకు ముందు ఈ పాటను ప్రముఖ బాలీవుడ్‌ నటి దీపికా పదుకొణె (Deepika Padukone) పరిచయం చేయగా.. ఆ తర్వాత గాయకులు రాహుల్‌ సిప్లిగంజ్‌, కాలభైరవ లైవ్‌లో పాడారు. ఈ సందర్భంగా పాట నేపథ్యం గురించి అవార్డుల వేడుకకు హాజరైన వారికి దీపిక ప్రత్యేకంగా వివరించడం విశేషం.

‘‘తిరుగులేని గానబృందం.. ఉర్రూతలూగించే బీట్స్‌.. అదరహో అనిపించిన స్టెప్పులు ఈ పాటను ప్రపంచ సంచలనంగా మార్చేశాయి. విప్లవకారులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్‌ మధ్య స్నేహాన్ని చాటిచెప్పిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌ (RRR)’ సినిమాలోని కీలక సన్నివేశంలో వచ్చే పాట ఇది. దీన్ని తెలుగులో పాడటంతో పాటు వలసవాద వ్యతిరేక ఇతివృత్తాన్ని సజీవంగా ప్రదర్శించడంతో ఇది సంచలనం సృష్టించింది. యూట్యూబ్‌, టిక్‌టాక్‌లలో కోట్లాది వీక్షణలను సొంతం చేసుకోవడమే గాక.. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో థియేటర్లలో ప్రేక్షకుల చేత స్టెప్పులు వేయించింది. అంతేనా.. భారత సినీ ఇండస్ట్రీ నుంచి ఆస్కార్‌కు నామినేట్‌ అయిన తొలి పాటగా ఘనత సాధించింది. ‘డు యూ నో నాటు?’ తెలియకపోతే ఇప్పుడు తెలుసుకుంటారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం నుంచి ‘నాటు నాటు (Naatu Naatu)’ ఇదే..’ అంటూ దీపిక ఈ పాటను పరిచయం చేయడంతో అక్కడున్నవారంతా చప్పట్లతో స్వాగతం పలికారు.

డాల్బీ థియేటర్‌లో అరుదైన ఘనత..

దీపిక (Deepika Padukone) పరిచయం తర్వాత గాయకులు కాలభైరవ, రాహుల్‌ సిప్లిగంజ్‌ లైవ్‌లో పాడగా.. వెస్ట్రన్‌ డ్యాన్సర్లు తమ డ్యాన్స్‌తో అలరించారు. ఈ పాట ప్రదర్శన సమయంలో ఆస్కార్‌ వేడుకకు వేదికైన డాల్బీ థియేటర్‌ మొత్తం కరతాళ ధ్వనులతో మార్మోగిపోయింది. ప్రదర్శన పూర్తయిన తర్వాత వేదికలో పాల్గొన్నవారంతా లేచి నిల్చుని చప్పట్లతో అభినందించడం విశేషం.

సగర్వ క్షణాలు..

ఆస్కార్‌లో దీపిక ‘నాటు నాటు (Naatu Naatu)’ను పరిచయం చేసిన వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ప్రతి భారతీయుడు గర్వపడే క్షణాలివి అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ వేడుకలో దీపిక ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రముఖ డిజైనర్‌ లూయిస్‌ విట్టన్‌ రూపొందించిన నలుపు రంగు క్లాసిక్‌ గౌను ధరించిన నటి.. మెడలో కార్టియర్‌ నెక్‌పీస్‌లో హుందాగా కన్పించింది. ఆ ఫొటోలను దీపిక ఇన్‌స్టాలో పోస్ట్ చేయగా ప్రస్తుతం అవి వైరల్‌ అయ్యాయి. ఆమె క్వీన్‌ అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు