Pawan Kalyan: ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌: పవన్‌-హరీశ్‌ శంకర్‌ మూవీ కోసం మరో సీనియర్‌ డైరెక్టర్‌

పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా స్క్రిప్ట్‌ వర్క్‌లో సీనియర్‌ డైరెక్టర్‌ దశరథ్‌ పనిచేస్తున్నట్లు హరీశ్ శంకర్‌ తెలిపారు.

Updated : 09 Dec 2022 17:29 IST

హైదరాబాద్‌: పవన్‌కల్యాణ్‌ (pawan kalyan) కథానాయకుడిగా హరీశ్‌ శంకర్‌ (harish shankar) దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ‘భవదీయుడు భగత్‌సింగ్‌’ అంటూ ఇప్పటికే టైటిల్‌తో పాటు, పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. అయితే, ఇప్పటివరకూ ఈ సినిమా  గురించి అటు దర్శకుడు హరీశ్‌ శంకర్‌, ఇటు పవన్‌కల్యాణ్‌, ఆఖరికి చిత్ర నిర్మాణసంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ కూడా ఎక్కడా స్పందించలేదు. తాజాగా ‘లవ్‌ యు రామ్‌’ చిత్ర ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న దర్శకుడు హరీశ్‌ శంకర్‌ తన సినిమా గురించి ఓ అప్‌డేట్‌ ఇచ్చారు. పవన్‌కల్యాణ్‌తో తీయబోయే సినిమా కోసం సీనియర్‌ దర్శకుడు దశరథ్‌ (Dasaradh) పనిచేస్తున్నట్లు చెప్పారు.

‘‘నేను దుర్గా ఆర్ట్స్‌లో అసిస్టెంట్‌గా చేరినప్పుడు దశరథ్‌ అన్నయ్య ‘సంతోషం’తో హిట్‌ కొట్టారు. ఆ తర్వాత నేను దిల్‌రాజ్‌ నిర్మాణ సంస్థకు వెళ్తున్న సమయంలో ‘మిస్టర్‌ పర్‌ఫెక్ట్’తో మరో బ్లాక్‌బస్టర్‌ కొట్టారు. ఆయన డైరెక్షన్‌, రైటింగ్‌ నాకు చాలా ఇష్టం. ఇప్పుడు పవన్‌తో నేను చేస్తున్న సినిమాకు స్క్రిప్ట్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్నారు. అందుకు దశరథ్‌ అన్నయ్యకు ధన్యవాదాలు. ‘లవ్‌ యూ రామ్‌’ నేను చూశాను. చాలా బాగుంది. సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా’’ అని హరీశ్‌ శంకర్‌ తెలిపారు. అయితే, దశరథ్‌ ‘భవదీయుడు భగత్‌సింగ్’ కోసం పనిచేస్తున్నారా? లేదా ఏదైనా రీమేక్‌పై పనిచేస్తున్నారా? అన్న విషయాన్ని మాత్రం హరీశ్‌ శంకర్‌ చెప్పలేదు.

మరోవైపు పవన్‌-హరీశ్‌ కాంబినేషన్‌లో రానున్నది తమిళ చిత్రం ‘తెరి’ రీమేక్‌ అని ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో హరీష్‌శంకర్‌ తన సినిమా గురించి ట్వీట్‌ చేయగానే, ‘రీమేక్‌ వద్దు’ అంటూ అభిమానులు పెద్దఎత్తున ప్రతిస్పందించారు. ‘మాకు తెరి రీమేక్‌ వద్దు’ అనే ట్యాగ్‌ ట్రెండింగ్‌ కూడా అయ్యింది. పవన్‌కల్యాణ్‌ కోసం హరీష్‌ శంకర్‌ కొత్త కథనే సిద్ధం చేస్తున్నట్టు  సమాచారం. ఈ నెలలోనే సినిమాని ప్రారంభించనున్నట్టు తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని