Maruthi: ఆ చిత్రానికి సీక్వెల్‌ తప్పకుండా చేస్తా: మారుతి

కొన్ని కాంబినేషన్‌లకు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్‌ ఏర్పడుతుంది. ఆయా దర్శకనటులు మళ్లీ మళ్లీ కలిసి పనిచేస్తే చూడాలనే ఆసక్తి ఎప్పుడూ ఉంటుంది. ఒక్కోసారి అవి సీక్వెల్స్‌ అయినా కావొచ్చు, కొన్నిసార్లు ఇతర కథలైనా అవ్వొచ్చు.

Updated : 06 Jul 2022 19:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొన్ని కాంబినేషన్‌లకు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్‌ ఏర్పడుతుంది. ఆయా దర్శక,నటులు మళ్లీ మళ్లీ కలిసి పనిచేస్తే చూడాలనే ఆసక్తి ఎప్పుడూ ఉంటుంది. ఒక్కోసారి అవి సీక్వెల్స్‌ అయినా కావొచ్చు, కొన్నిసార్లు ఇతర కథలైనా అవ్వొచ్చు. అలా తెలుగు ప్రేక్షకులను మెప్పించిన ఓ కాంబో దర్శకుడు మారుతి (Maruthi), హీరో నాని (Nani). ఈ ఇద్దరు కలిసి సృష్టించిన నవ్వుల ప్రపంచం ‘భలే భలే మగాడివోయ్‌’ (Bhale Bhale Magadivoy). ఈ చిత్రంలో మతిమరుపు ఉన్న వ్యక్తిగా నాని మంచి కామెడీ పంచి, ఎమోషన్‌తో హృదయాల్ని హత్తుకున్నారు. దాంతో ‘ఈ సినిమాకి సీక్వెల్‌ వస్తే బాగుంటుంది’ అని చాలామంది ఎదురుచూశారు, ఇంకా చూస్తూనే ఉన్నారు. ఇప్పటికే ఎన్నోసార్లు మారుతికి ఈ ప్రశ్న ఎదురవగా ఓ సందర్భంలో ‘‘భలే భలే మగాడివోయ్‌’కి సీక్వెల్‌ చేయాలనే ఆలోచన అప్పట్లో వచ్చింది. కానీ, కొనసాగింపు కథ కాకుండా ఏదైనా కొత్తగా చేయడమే మేలనే భావనే నన్ను మళ్లీ ఆ కథ గురించి ఆలోచించనీయలేదు’’ అని చెప్పారు.

ఇప్పుడు.. తప్పకుండా ఆ సీక్వెల్‌ చేస్తానని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఈసారి యాక్షన్‌ నేపథ్యంలో సినిమాను తీయాలనుందన్నారు. ఇంకా కథా చర్చలు ప్రారంభించలేదని పేర్కొన్నారు. నాని అభిమానులు సోషల్‌ మీడియాలో సంబంధిత వీడియోను పెడుతూ ఆనందం వ్యక్తం చేశారు. ‘త్వరగా తీయండి’ అని కామెంట్ల రూపంలో మారుతిని కోరారు. గోపీచంద్‌ హీరోగా మారుతి తెరకెక్కించిన ‘పక్కా కమర్షియల్‌’ (Pakka Commercial) చిత్రం ఇటీవల విడుదలై, సందడి చేస్తోంది. కోర్టురూమ్‌ నేపథ్యంలో యాక్షన్‌కామెడీగా రూపొందిన ఈ సినిమాలో గోపీచంద్‌ (Gopichand), రాశీఖన్నా (Raashi Khanna) లాయర్లుగా కనిపించి, ఆకట్టుకుంటున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని