Nelson: ‘బీస్ట్‌’ విడుదల తర్వాత కమల్‌ హాసన్‌ను కలిశా: ‘జైలర్‌’ దర్శకుడు

‘బీస్ట్‌’ విడుదల తర్వాత అగ్ర నటుడు కమల్‌ హాసన్‌ను కలిశానని దర్శకుడు నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ అన్నారు. ‘జైలర్‌’ విజయోత్సవలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

Published : 18 Aug 2023 01:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘జైలర్’ (Jailer) సినిమా విజయంతో అటు కోలీవుడ్‌, ఇటు టాలీవుడ్‌ దృష్టిని బాగా ఆకర్షించిన దర్శకుడు నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ (Nelson Dilip Kumar). రజనీకాంత్‌ (Rajinikanth) హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం విడుదలైన అన్ని కేంద్రాల్లో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా నెల్సన్‌ కోలీవుడ్‌ మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఒక్కో ఇంటర్వ్యూలో ఒక్కో ఆసక్తికర పాయింట్‌ చెబుతున్నారు. గతంలో తాను దర్శకత్వం వహించిన ‘బీస్ట్‌’ (Beast) విడుదలైన తర్వాత హీరో కమల్‌ హాసన్‌ను కలిశానని, ఓ సినిమా చేసే ప్రయత్నం జరిగిందని తాజాగా పాల్గొన్న ముఖాముఖిలో తెలిపారు. కథ సిద్ధమైతే తమ కాంబినేషన్‌లో సినిమా ఉంటుందన్నారు. ‘జైలర్‌’ విడుదలయ్యాక కమల్‌ హాసన్‌ ఫోన్‌ చేసి, అభినందించారని పేర్కొన్నారు. తాను టెలివిజన్‌కు పనిచేస్తున్న సమయం నుంచే కమల్‌ హాసన్‌ తెలుసన్నారు.

‘జైలర్‌’లో బాలకృష్ణను అనుకున్నా కానీ: నెల్సన్‌

విజయ్‌ హీరోగా తెరకెక్కిన చిత్రమే ‘బీస్ట్‌’. ఇది నెల్సన్‌కు మూడో సినిమా. దీని తర్వాతే రజనీకాంత్‌ హీరోగా ‘జైలర్‌’ను తెరకెక్కించారు. యాక్షన్‌ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో మలయాళ నటుడు మోహన్‌లాల్‌, కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్‌, బాలీవుడ్‌ నటుడు జాకీష్రాఫ్‌తోపాటు రమ్యకృష్ణ, తమన్నా, సునీల్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ నెల 10న విడుదలైన ఈ సినిమా ఇప్పటి వరకు రూ. 375 కోట్లకు (గ్రాస్‌)పైగా వసూళ్లు చేసిందని నిర్మాణ సంస్థ సన్‌ పిక్చర్స్‌ ప్రకటించింది. వారంలో ఇంత మొత్తంలో కలెక్షన్స్‌ చేసిన తమిళ చిత్రమిదేనని తెలిపింది. నెల్సన్‌.. ‘జైలర్‌’కు సీక్వెల్‌ను సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ఆ సీక్వెల్‌లో విజయ్‌తో కీలక పాత్ర చేయించాలని ఆయన అనుకుంటున్నారట. ‘బీస్ట్‌’, ‘జైలర్‌’తోపాటు నెల్సన్‌ దర్శకత్వంలో రూపొందిన ‘కొలమావు కోకిల’, ‘డాక్టర్‌’ కూడా తెలుగులో విడుదలై మంచి విజయం అందుకున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని