
shyam Singha Roy: ‘శ్యామ్.. ప్రేమకు ఎంతో విలువనిచ్చారో ఈ వీడియోనే సాక్ష్యం’
హైదరాబాద్: నాని ద్విపాత్రాభినయంలో నటించి మెప్పించిన చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. ఇంటెన్స్, పవర్ఫుల్ ప్రేమకథతో తెరకెక్కిన ఈ చిత్రానికి రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించారు. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో హిట్ టాక్ అందుకున్న ఈ సినిమా తాజాగా ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శుక్రవారం నెట్‌ఫ్లిక్స్ వేదికగా అందుబాటులోకి వచ్చిన ఈ చిత్రానికి ఓటీటీలోనూ మంచి ఆదరణే లభించింది. ఈ నేపథ్యంలో ప్రేక్షకుల దృష్టిని మరింత ఆకర్షించడానికి ‘శ్యామ్ సింగరాయ్’ టీమ్ సిద్ధమైంది.
నిడివి, ఇతర కారణాల వల్ల సినిమా నుంచి తొలగించిన పలు సన్నివేశాలను ఇప్పుడు ఒక్కొక్కటిగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. ఇందులో భాగంగా శనివారం ‘శ్యామ్ సింగరాయ్’ మొదటి డిలీట్ సీన్‌ని నెట్టింట్లో షేర్ చేసింది. శ్యామ్సింగరాయ్కు సంబంధించిన సన్నివేశంతో ఈ వీడియో సాగింది. వేశ్య గృహంలో పలువురు మహిళల మధ్యలో కూర్చొన్న నాని తన ఆవేశపూరితమైన కవిత్వంతో అక్కడివారి మన్ననలు అందుకోవడం.. ఇంతలో ఓ మహిళ.. ‘‘ఇంత తెలిసిన వాడిని నన్ను పెళ్లి చేసుకుంటావా?’’ అని కొంటెగా కోరగా.. ‘‘కచ్చితంగా చేసుకుంటా.. నిన్ను ప్రేమించిన రోజు’’ అని నవ్వుతూ సమాధానమిస్తారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.