రివ్యూ:  ఓ పిట్టక‌థ‌

సినిమాల్లో చిన్న పెద్ద అనే తేడాలు ఎప్పుడో  చెరిగిపోయాయి. న‌వ‌త‌రం ద‌ర్శ‌కులు ఆలోచ‌న‌లే వేరుగా ఉంటున్నాయి. కొన్నేళ్లుగా కొత్త క‌థ‌లతో  అద్భుతాలు సృష్టిస్తున్నారు. దాంతో ఏ సినిమా బాక్సాఫీసు ముందుకొచ్చినా దాన్ని ప్ర‌త్యేక‌దృష్టితోనే చూడాల్సిందే. ఇక ప్ర‌చార చిత్రాల‌తో ఆక‌ట్టుకున్న సినిమాల‌పై మ‌రిన్ని అంచ‌నాలు

Updated : 06 Mar 2020 15:04 IST

రివ్యూ: ఓ పిట్టక‌థ‌

నటీనటులు: విశ్వంత్‌ దుద్దుంపూడి, సంజయ్‌రావు, నిత్యాశెట్టి, బ్రహ్మాజీ, బాలరాజు, శ్రీనివాస్‌ భోగిరెడ్డి, భద్రాజీ, రమణ చల్కపల్లి, సిరిశ్రీ, సూర్య ఆకొండి తదితరులు.

పాటలు: శ్రీజో

క‌ళ‌: వివేక్‌ అన్నామలై

కూర్పు: డి.వెంకటప్రభు

ఛాయాగ్ర‌హ‌ణం:  సునీల్‌ కుమార్‌ యన్

సంగీతం:  ప్రవీణ్‌ లక్కరాజు

నిర్మాత:  వి.ఆనంద ప్రసాద్‌

కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం:  చెందు ముద్దు.

విడుద‌ల‌ తేదీ: 06-03-2020

సినిమాల్లో చిన్న పెద్ద అనే తేడాలు ఎప్పుడో చెరిగిపోయాయి. న‌వ‌త‌రం ద‌ర్శ‌కుల ఆలోచ‌న‌లే వేరుగా ఉంటున్నాయి. కొన్నేళ్లుగా కొత్త క‌థ‌లతో అద్భుతాలు సృష్టిస్తున్నారు. దాంతో ఏ సినిమా బాక్సాఫీసు ముందుకొచ్చినా దాన్ని ప్ర‌త్యేక‌ దృష్టితో చూడాల్సిందే. ఇక ప్ర‌చార చిత్రాల‌తో ఆక‌ట్టుకున్న సినిమాల‌పై మ‌రిన్ని అంచ‌నాలు పెరిగిపోతుంటాయి. అలా ‘ఓ పిట్ట‌క‌థ‌’  విడుద‌ల‌కి ముందే మంచి ప్ర‌చారంతో ప్రేక్ష‌కుల దృష్టిని ఆకర్షించింది. మ‌రి ఈ పిట్ట‌క‌థ ఎలా ఉంది?  దీని వెన‌క ఉన్న క‌థేమిటి? 

క‌థేంటంటే: వెంక‌ట‌ల‌క్ష్మి (నిత్యాశెట్టి), క్రిష్ (విశ్వంత్ దుద్దుంపూడి) బావ మ‌ర‌ద‌ళ్లు.  చైనా నుంచి వ‌చ్చిన క్రిష్ త‌న మేనమామ‌ని ఒప్పించేసి ఆయ‌న కూతురైన వెంక‌టల‌క్ష్మిని పెళ్లి చేసుకోవాల‌నుకుంటాడు. అందుకు క్రిష్ మామ కూడా ఒప్పుకొంటాడు. ఇంత‌లో ప‌రీక్ష‌లు పూర్త‌వ్వ‌డంతో స్నేహితుల‌తో క‌లిసి అర‌కు వెళ్లాల‌నుకుంటుంది వెంక‌ట‌ల‌క్ష్మి. అలా కారులో వెళ్లిన ఆమె మ‌ళ్లీ తిరిగి రాదు. దాంతో  క్రిష్‌, ఆయ‌న మామ వెళ్లి పోలీసుల‌కి ఫిర్యాదు చేస్తారు. పోలీసు ప‌రిశోధ‌న మొద‌ల‌వుతుంది. అందులో వెంక‌ట‌ల‌క్ష్మిని క్రిష్‌యే కిడ్నాప్ చేసి హ‌త్య చేసిన‌ట్టుగా ఓ వీడియో దొరుకుతుంది.  నిజంగా ఆ హ‌త్య‌ని అత‌నే చేశాడా? వెంక‌ట‌ల‌క్ష్మి తండ్రి న‌డుపుతున్న సినిమా టాకీస్‌లో పనిచేస్తున్న ప్ర‌భు (సంజ‌య్ రావు)కి ఈ హ‌త్య‌తో సంబంధ‌మేమైనా ఉందా? అస‌లు వెంక‌ట‌ల‌క్ష్మిని చంపాల్సిన అవ‌స‌రం ఎవ‌రికొచ్చింది? త‌దిత‌ర విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే: పేరుకే పిట్ట‌క‌థ కానీ... దీని ఉప‌శీర్షిక‌లో చెప్పినట్టుగా ఇది చాలా పెద్ద క‌థ‌. ఒక ప‌ల్లెటూరి ప్రేమ‌క‌థ‌కి థ్రిల్ల‌ర్ అంశాల్ని, నేర నేప‌థ్యాన్ని జోడించారు.  దాంతో ఊహించ‌ని మ‌లుపుల‌తో ఓ సుదీర్ఘ‌మైన సినిమా చూసిన అనుభ‌వం క‌లుగుతుంది. అర‌కులో వెంక‌ట‌ల‌క్ష్మి కిడ్నాప్‌, వాళ్ల నాన్న‌, బావ క్రిష్ ఫిర్యాదుతోనే సినిమా మొద‌ల‌వుతుంది. పోలీస్ ఇన్వెస్టిగేష‌న్‌లో భాగంగా అస‌లు క‌థ మొద‌ల‌వుతుంది.  బావా మ‌ర‌ద‌లుగా క్రిష్‌, వెంక‌ట‌ల‌క్ష్మి మ‌ధ్య స‌న్నివేశాలతో సినిమా స‌ర‌దాగా సాగుతుంది. సాయిభ‌క్తురాలిగా వెంక‌ట‌ల‌క్ష్మి చేసే సంద‌డి, ఆమె పాత్ర‌లోని అమాయ‌క‌త్వంతో అక్క‌డ‌క్క‌డా న‌వ్విస్తూ కాల‌క్షేపం చేయిస్తుంది. ఎప్పుడైతే క్రిష్ వీడియో బ‌య‌టికొచ్చిందో అప్ప‌ట్నుంచి అస‌లు క‌థలో మ‌లుపు. ఆ వెంట‌నే ప్ర‌భు పాత్రపై అనుమానాలు. ఒక ప‌క్క వీడియో సాక్ష్యం, మ‌రోప‌క్క ప్ర‌భుపై అనుమానం.. దాంతో ఈ హ‌త్య ఎవ‌రు చేశార‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది.

అలా ద్వితీయార్ధం సినిమాకి కీల‌కంగా మారింది. అయితే అక్క‌డ ఎవ‌రూ ఊహించ‌ని మ‌లుపులు ఉంటాయి. ప్ర‌థ‌మార్ధంలో రేకెత్తిన ప్ర‌శ్న‌ల‌న్నింటికీ జ‌వాబులు చెప్పే క్ర‌మంలో ద‌ర్శ‌కుడు చూపించిన స‌న్నివేశాల్నే మ‌ళ్లీ మ‌ళ్లీ చూపించారు. దాంతో  సినిమా కాస్త సాగ‌దీత‌గా మారిపోయింది. ప‌తాక స‌న్నివేశాల్లో లెక్క‌కు మించి మ‌లుపులు ఉండ‌టంతో కొన్ని స‌న్నివేశాలు గంద‌ర‌గోళంగా అనిపిస్తాయి. అందుకేనేమో ద‌ర్శ‌కుడు చివ‌ర్లో క‌థ క‌న్‌ఫ్యూజ‌న్‌, స్క్రీన్‌ప్లే కన్‌ఫ్యూజ‌న్ అంటూ తెర‌పై రాసి మ‌రీ త‌న పేరు వేసుకున్నాడు. నిజానికి ఈ క‌థ‌లో కొత్త‌ద‌నం ఉంది. దాన్ని సినిమాకి త‌గ్గట్టుగా మ‌ల‌చ‌డంలో తడబడ్డాడు. సినిమాకి రివ్యూ చెప్పించ‌డం, రాహుల్ ద్ర‌విడ్ యాడ్ నేప‌థ్యంలో వ‌చ్చే స‌న్నివేశాలతోపాటు... ఇందులో  కొన్ని సంభాష‌ణ‌లు బాగా న‌వ్విస్తాయి. కొన్ని సంభాష‌ణ‌లు మాత్రం ఆటో పంచ్‌ల్ని గుర్తు చేస్తాయి. నిడివి త‌క్కువే అయినా... ఎడిటింగ్ ప‌రంగా మ‌రిన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సిందేమో అనిపిస్తుంది.

ఎవ‌రెలా చేశారంటే: విశ్వంత్‌, సంజ‌య్ రావు, నిత్యాశెట్టి ఈ ముగ్గురి మ‌ధ్యే సింహ భాగం స‌న్నివేశాలు సాగుతాయి. బ్ర‌హ్మాజీ త‌న‌యుడు సంజ‌య్‌కి ఇది తొలి చిత్రం. ప్ర‌భు పాత్ర‌లో ప‌ర్వాలేద‌నిపించాడు. విశ్వంత్ న‌ట‌న‌లో భిన్న కోణాలు క‌నిపిస్తాయి. నిత్యాశెట్టి అభిన‌యం మెప్పిస్తుంది. బ్ర‌హ్మాజీ,  క‌థానాయిక‌కి తండ్రిగా క‌నిపించిన న‌టుడు, సంజ‌య్ ప‌క్కన క‌నిపించే స్నేహితుడు.. మంచి న‌ట‌న‌ని ప్ర‌ద‌ర్శించారు.

సాంకేతిక విభాగం చ‌క్క‌టి ప‌నితీరుని ప్ర‌ద‌ర్శించింది. సునీల్ కెమెరా ప‌నిత‌నం, ప్ర‌వీణ్ ల‌క్క‌రాజు సంగీతం చిత్రానికి ప్ర‌ధానబ‌లం. సునీల్ కెమెరా ప‌ల్లెటూరి అందాల్ని చాలా బాగా చూపించింది. ప్ర‌వీణ్ పాట‌లతోపాటు, నేప‌థ్య సంగీతం కూడా సినిమాపై చ‌క్క‌టి ప్ర‌భావం చూపించింది. ద‌ర్శ‌కుడు చెందు ముద్దు ఆలోచ‌న బాగున్నా, దాన్ని తెర‌పైకి తీసుకు రావ‌డంలో అనుభ‌వ లేమి క‌నిపిస్తుంది. కొన్ని సంభాష‌ణ‌లు మెప్పిస్తాయి. నిర్మాణ విలువ‌లు ఉన్న‌తంగా ఉన్నాయి.

బ‌లాలు బ‌ల‌హీన‌త‌లు
+ క‌థ‌లో మ‌లుపులు - సాగ‌దీతగా సాగే స‌న్నివేశాలు
కొన్ని స‌న్నివేశాల్లో హాస్యం - ద్వితీయార్ధంలో గంద‌ర‌గోళం

చివ‌రిగా: మలుపులతో సా...గిన ‘ఓ పిట్ట‌క‌థ’

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని