మతిస్థిమితం కోల్పోయిన హీరోయిన్‌!

భారత చలనచిత్ర రంగంలో తొలి డ్రీమ్‌గర్ల్‌ కాంచనమాల. శ్రీశ్రీ వంటి విప్లవ కవి ‘రాక్సీలో నార్మా షేరర్‌.. బ్రాడ్వేలో కాంచనమాల’ అంటూ

Published : 14 Mar 2020 14:49 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత చలనచిత్ర రంగంలో తొలి డ్రీమ్‌గర్ల్‌ కాంచనమాల. శ్రీశ్రీ వంటి విప్లవ కవి ‘రాక్సీలో నార్మా షేరర్‌.. బ్రాడ్వేలో కాంచనమాల’ అంటూ హాలీవుడ్‌ సుందరితో కాంచనమాల అందాలను వర్ణించారంటే ఆమె సౌందర్యం ఎంత గొప్పదో ఊహించుకోవచ్చు. కాంచనమాల తన కెరీర్‌లో నటించింది కేవలం 11 సినిమాలే అయినా నటిగా తనదైన ముద్రవేశారు. కెమెరా ముందు పనికిరాదన్న దర్శకుడు గూడవల్లి రామబ్రహ్మం తన మాటను వెనక్కి తీసుకుని ‘మాల పిల్ల’లో హీరోయిన్‌గా అవకాశం ఇచ్చారు. గొంతు బాగాలేదన్న సంగీత దర్శకుడు భీమవరపు నరసింహారావు ఆమెతోనే పాడించారు. అలా ప్రతి అంశంలో తనదైన ముద్రవేసిన కాంచనమాల చివరకు సినీ రంగపు కుట్రలకు, కుతంత్రాలకు బలవుతుందని ఎవరూ ఊహించి ఉండరు.

జెమినీ సంస్థలో తప్ప ఇతర సంస్థల్లో సినిమాలు చేయనంటూ ‘బాలనాగమ్మ’ సందర్భంగా ఒప్పంద పత్రంపై సంతకం చేయడం ఆమె కెరీర్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఆ తర్వాత జెమినీ సంస్థతో విభేదాలు ఏర్పడ్డాయి. ఒప్పందానికి కట్టుబడి మరో సంస్థలో సినిమాలు చేయలేని పరిస్థితి. ఆ సమయంలో ఆమె చుట్టూ జరిగిన కుట్రల కారణంగా తీవ్రంగా కుంగిపోయి, డిప్రెషన్‌లోకి వెళ్లిపోయి మతి స్థిమితం కోల్పోయింది. కొన్నాళ్లు మద్రాసులో, మరికొన్ని రోజులు తెనాలిలో జీవితాన్ని వెళ్లదీశారు కాంచనమాల. ఎవరితోనూ మాట్లాడేవారు కాదు. చిన్నప్పటి నుంచి తనకు అండగా ఉన్న వెంకయ్యను వివాహం చేసుకున్నారు. కొద్దిరోజులకే ఆయన క్షయ వ్యాధితో కన్నుమూయడం కాంచనమాల మరింత కుంగిపోయారు. ఎప్పుడూ చెట్టుకింద కూర్చొని ఆకాశంలోకి చూస్తుండేవారు. ఆమెను ఎలాగైనా తిరిగి మామూలు మనిషిని చేయాలని కొందరు ప్రయత్నించారు.

రాజ్యం పిక్చర్స్‌ వారు ‘నర్తనశాల’ (1963) తీస్తున్నప్పుడు ఒక ఘట్టంలో ధర్మరాజు తీర్పు చెప్పాలి. ఇద్దరు స్త్రీలు పసిపాపను తెచ్చి ‘ఈ పాపకు నేను తల్లిని అంటే నేను తల్లిని’ అని పోట్లాడుకుంటారు. ఇద్దరిలోనూ నిజమైన తల్లి ఎవరో కంకుభట్టు రూపంలో ఉన్న ధర్మరాజు తీర్పు ఇస్తాడన్నమాట. ఆ ఇద్దరు స్త్రీలలో ఒకరు గయ్యాళి, ఒకరు నిజమైన తల్లి. గయ్యాళి వేషానికి అతిథి నటిగా సూర్యంకాంతాన్ని అడిగితే, ఆమె ఒప్పుకొన్నారు. రెండో పాత్రకి ఎవరు? అనుకుంటుండగా కాంచనమాల పేరు చెప్పారు లక్ష్మీరాజ్యం. వాళ్లిద్దరూ బంధువులు. కాంచనమాలకి మతి చలించి అప్పటికి చాలా ఏళ్లయింది. ఏవో చికిత్సలు చేస్తే ఏదో కొంత దారికొచ్చింది. కానీ, మనుషులెవరూ గుర్తులేరు. ఈ సినిమా పరిసరాలు, షూటింగు చూస్తే, మళ్లీ కోలుకోవచ్చునేమోనన్న ఆశతో లక్ష్మీరాజ్యం కాంచనమాలని వేషం వెయ్యాలని అడిగారు. ‘మనం చెప్పినవి వింటోంది. చెప్పింది తిరిగి చెబుతోంది. పర్వాలేదు, డైలాగులు ఎక్కువలేవు. ఎలా చెప్పమంటే అలా చెప్పేస్తుంది’ కదా అని షూటింగ్‌కి తీసుకొచ్చారు. మేకప్‌ వేశారు. ఆమె ముఖంలో ఏ చలనమూలేదు. వద్దననూలేదు. కావాలని అననూ లేదు. సెట్టుకి వెళ్తే నాటి కాంచనమాల చిత్రాలు చూసి, అభిమానులైన వాళ్లు షూటింగ్‌ చూడ్డానికి వచ్చారు.

సెట్టుకి రాగానే, దర్శకుడు కమలాకర కామేశ్వరరావు, సముద్రాల రాఘవాచార్య కాంచనమాలని పలకరించారు. ‘గృహలక్ష్మి’, ‘వందేమాతరం’ చిత్రాలకు సముద్రాల రచయిత. కామేశ్వరరావు సహాయ దర్శకుడు. ఇద్దరూ తాము ‘ఫలానా’ అనీ, ‘గుర్తుపట్టారా’ అని రెట్టించి అడిగారు. ఆమెకేమీ గుర్తులేదు. ‘‘నేను రాఘవాచార్యని. డైలాగులు మీకు వినిపించి, చెప్పించాను. గుర్తులేదా?’’ అని, సముద్రాలవారు.. ‘దృశ్యం వివరించి సందర్భం వివరించేవాడిని’ అని కామేశ్వరరావు ఎంత జ్ఞాపకం చేసినా ఆమె ఏమీ మాట్లాడేవారు కాదు. మనిషి కళ్లలో జీవం లేదు. వయసు మీరిపోయి ఉంది. ఆనాటి ‘మాలపిల్ల’, ‘బాలనాగమ్మ’, ‘ఇల్లాలు’, ‘మళ్లీ పెళ్లి’ చిత్రాల కాంచనమాలకీ ఈ కాంచనమాలకీ ఏ పోలికా లేదని అక్కడి వారు నిరాశపడ్డారు. ఆమెను చూసి ‘అయ్యో పాపం’ అని జాలి పడ్డారు. ‘అసలు ఎందుకీ వేషం వేయించారు?’ అని కొందరు అసహనం చూపించారు. ఉన్న నాలుగు డైలాగులూ ఏదోలా, ఎలాగో చెప్పించారు. ముఖంలో భావం లేదు, భయం, బాధా ఏమీలేవు. ఒకనాటి సౌందర్యవతి, కళా విహీనమయిపోయిన తర్వాత అది ప్రేక్షకుల్ని నిరాశ పరిచిందా? ‘పోనీ చాలాకాలం తర్వాత తిరిగి తెరమీద చూడగలిగాం’ అని తృప్తి పరిచిందా? ఏమో ఏమైనా బాధాకరమే!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని