విజయనిర్మలను వద్దంటే.. ఎస్వీఆర్‌నే తీసేశారు!!

విజయనిర్మల కోసం ఎస్వీ రంగా రావునే సినిమాలోంచి తీసేసిన సంఘటనను ఊహించగలమా. కానీ, అప్పట్లో జరిగింది.

Published : 01 Nov 2022 14:30 IST

విజయనిర్మల కోసం ఎస్వీ రంగా రావునే సినిమాలోంచి తీసేసిన సంఘటనను ఊహించగలమా. కానీ, అప్పట్లో జరిగింది. తెలుగులో విజయం సాధించిన ‘షావుకారు’ చిత్రాన్ని తమిళంలో ‘ఎంగవీటి పెన్‌’గా తీశారు. ఇందులో ఎస్వీఆర్‌ కోడలి పాత్ర విజయనిర్మలకు దక్కింది. విజయ నిర్మలను చూసి ‘ఈ అమ్మాయి ఏంటి ఇంత సన్నగా ఉంది... వద్దు మార్చండి’ అన్నారట ఎస్వీఆర్‌. ‘ఇంత మంచి సంస్థలో అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిపోయింది’ అనుకుంటూ ఏడుస్తూ తన గదికి వెళ్లిపోయారట విజయ నిర్మల. రేపు తనను షూటింగ్‌కు పిలవరు అనుకున్నారట. కానీ తర్వాత రోజు ఆమె కోసం చిత్ర నిర్మాత నాగిరెడ్డి కారు పంపించారట. తీరా సెట్‌కి వెళ్లి చూస్తే రంగారావు స్థానంలో ఎస్వీ సుబ్బయ్యగారు ఉన్నారట. ‘‘ఈ అమ్మాయి ఇంత బాగుంటే ఈయన వద్దంటున్నాడు ఏమిటి.. ఆయన్నే మారిస్తే పోతుంది’ అని నాగిరెడ్డి అనుకొని ఉంటారు. అప్పట్లో నిర్మాతలకు సినిమాపైనా, నటీ నటుల ప్రతిభ పైనా అంత పట్టు ఉండేది’’ అని ఓ సందర్భంలో విజయ నిర్మల ఈ విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత ఓ వేడుకలో ఎస్వీ రంగారావు, విజయనిర్మల కలుసుకున్నప్పుడు ‘చూడండి నన్ను వద్దన్నారు...ఎప్పటికైనా మీతో నటిస్తా’’ అన్నారట విజయ నిర్మల. అన్నట్టుగానే ఎస్వీఆర్‌తో కలసి ‘మామకు తగ్గ కోడలు’లో నటించారామె.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని