రోగుల్ని పరిశీలించి... నటన పండించి...

భిన్నమైన పాత్రలు ధరించాల్సి వస్తే, ఆ నటులు అలాంటి వ్యక్తుల్ని పరిశీలిస్తారు. వాళ్ల మాట తీరు చూపులు, ప్రవర్తన అన్నీ పరిశీలించి గ్రహిస్తారు.

Updated : 11 Dec 2023 17:27 IST

భిన్నమైన పాత్రలు ధరించాల్సి వస్తే, ఆ నటులు అలాంటి వ్యక్తుల్ని పరిశీలిస్తారు. వాళ్ల మాట తీరు చూపులు, ప్రవర్తన అన్నీ పరిశీలించి గ్రహిస్తారు. సుప్రసిద్ధ తమిళ నటుడు ఎమ్‌.ఆర్‌.రాధా ‘రక్తకన్నీరు’ నాటకంలో కుష్ఠురోగ పాత్రధారి. ఆ పాత్రని ధరించే ముందు ఆయన ఎందరో కుష్ఠురోగుల్ని పరిశీలించారు. కుష్ఠు రోగులున్న ఆసుపత్రులకి వెళ్లి అక్కడ కూర్చొనేవారు. వారి చేష్టలు, ప్రవర్తనా రీతులు గ్రహించి, రాధా తన నటనతో ఆ పాత్రని రక్తి కట్టించారు. ఆ నాటకం సినిమాగా వచ్చింది. అదీ విజయం పొందింది. అదే నాటకాన్ని మన నాగభూషణం ‘రక్తకన్నీరు’ పేరుతోనే వందలాది ప్రదర్శనలు ఇచ్చారు. కొంతవరకూ రాధా నటనను పరిశీలించినా, ఆయన కూడా కొందరు కుష్ఠురోగుల్ని పరిశీలించారు.

👉 Follow EENADU WhatsApp Channel

‘అమావాస్య చంద్రుడు’లో కమల్‌హాసన్‌ది (Kamal Haasan) అంధుడి పాత్ర. ఆ పాత్ర ధరించడానికి ముందు కమల్‌హాసన్‌ మద్రాసులో ఉన్న ‘మూగ బధిర పాఠశాల’కి వెళ్లి, ఆ స్కూలుకి కొంత విరాళమిచ్చి, అక్కడ ఉన్న అంధుల ప్రవర్తన పరిశీలించారు. వాళ్ల చూపులు, భావప్రవర్తన, నడక అన్నీ పరిశీలించి గ్రహించిన తర్వాతనే సినిమాలో పాత్ర ధారణచేసి, మెప్పించారు. ‘షాపుకారు’లో రౌడీ రంగడు పాత్ర చేసినపుడు యస్‌.వి.రంగారావు ఒక రిక్షాలాగేవాడిని పరిశీలించి, వాడు బీడి కాల్చడం, వాడు కూర్చొనే విధానం గ్రహించారు. ‘షావుకారు’లోని రౌడీపాత్ర భిన్నంగా ఉంటుంది. ఇప్పుడున్న అగ్ర కథానాయకులు కూడా క్యారెక్టర్‌ బట్టి, నిజ జీవితంలో ఆయా వ్యక్తులను కలిసి వారి హావభావాలను పరిశీలించి నటిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని