‘ఒక్కడు’ తిప్పిన మలుపు.. ‘పోకిరి’ ఇచ్చిన గెలుపు

బాల నటుడిగా కెరీర్‌ ప్రారంభించి సూపర్‌స్టార్‌గా ఎదిగిన కథానాయకుడు మహేశ్‌బాబు. తండ్రి నట వారసత్వాన్ని కొనసాగిస్తూ తెలుగు చిత్ర పరిశ్రమపై చెరగని

Updated : 06 Jan 2020 11:42 IST

మహేశ్‌బాబు కెరీర్‌ను మలుపు తిప్పిన సినిమాలివే!

బాల నటుడిగా కెరీర్‌ ప్రారంభించి సూపర్‌ స్టార్‌గా ఎదిగిన కథానాయకుడు మహేశ్‌బాబు. తండ్రి నట వారసత్వాన్ని కొనసాగిస్తూ తెలుగు చిత్ర పరిశ్రమపై చెరగని ముద్ర వేశారు. అంతేకాదు, ప్రతి సినిమాకు ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇప్పుడు టాలీవుడ్‌లో అగ్ర కథానాయకుల్లో ఒకరిగా నిలిచారు. ఈ సంక్రాంతికి ‘సరిలేరు నీకెవ్వరు’ అంటూ పలకరించబోతున్నారు. ప్రతి నటుడి కెరీర్‌లో కొన్ని టర్నింగ్‌ పాయింట్‌లుంటాయి. అవి వారి నట జీవితాన్నే మలుపు తిప్పుతాయి. మహేశ్‌బాబు జీవితంలో అలాంటివి ఉన్నాయి. మరి ఆ ‘టర్నింగ్‌ పాయింట్‌లు ఏవో చూద్దామా!

టాలీవుడ్‌ రాజకుమారుడు

హేశ్‌బాబుకు కెమెరా కొత్తేమీ కాదు. కథానాయకుడిగా వెండితెరకు పరిచయం కాకముందే బాల నటుడిగా తండ్రితో కలిసి సినిమాల్లో నటించారు. ‘నీడ’తో వెండితెరకు పరిచయమైన మహేశ్‌ ‘రాజకుమారుడు’ చిత్రంలో కథానాయకుడిగా మారారు. 1999లో రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ప్రీతిజింటా అందాలు, మణిశర్మ సంగీతం సినిమాకు అదనపు బలాన్ని ఇచ్చాయి. కథానాయకుడిగా తొలి చిత్రంతోనే మహేశ్‌ ఇండస్ట్రీలో తనదైన ముద్రవేశారు. 

బ్రేక్‌ ఇచ్చిన ‘ఒక్కడు’

తొలి చిత్రం తర్వాత మహేశ్‌ సినిమాలేవీ సరైన విజయం అందుకోలేదు. దీంతో బ్రేక్‌ కోసం మహేశ్‌ 2003 వరకు వేచి చూడాల్సి వచ్చింది. మధ్యలో ‘మురారి’, ‘టక్కరి దొంగ’ ఫర్వాలేదనిపించాయి. అయితే, గుణశేఖర్‌ దర్శకత్వంలో వచ్చిన ‘ఒక్కడు’ మహేశ్‌ కెరీర్‌లో ది బెస్ట్‌గా నిలిచి రికార్డు సృష్టించింది. అంతేకాదు, ఆయనకు మాస్‌లో ఒక ఇమేజ్‌ను తెచ్చిపెట్టింది కూడా. ఈ సినిమా కోసం అప్పట్లో వేసిన చార్మినార్‌ సెట్‌ హాట్‌ టాపిక్‌గా నిలిచింది. తొలుత సినిమాకు ‘అతడే ఆమె సైన్యం’ అనే పేరును అనుకున్నారు. అయితే, అప్పటికే ఆ పేరు రిజిస్టర్‌ అయి ఉండటంతో ‘ఒక్కడు’గా ఖరారు చేశారు. అంతకుముందు కబడ్డీ ఆడిన అనుభవం కూడా లేని మహేశ్‌ నిజమైన ప్లేయర్‌లా కనిపించేందుకు ఎంతో కష్టపడ్డారు. సాధనలో ఎన్నో దెబ్బలు కూడా తిన్నారు. 2003 జనవరి 15న విడుదలైన ఈ చిత్రం ఘన విజయాన్ని అందుకుంది. 

విజయం దక్కలేదు.. కానీ నంది వచ్చింది!

ప్పటికే సంచలన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న తేజతో మహేశ్‌బాబు ‘నిజం’ చేశారు. అయితే, ఇది అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. ‘ఒక్కడు’తో వచ్చిన ఇమేజ్‌ కారణంగా మాస్‌ హీరోయిజం ఎలిమెంట్స్‌ లేని ‘నిజం’ బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన స్థాయిలో ఆడలేదు. కానీ, మహేశ్‌ ఉత్తమ నటుడిగా ఈ సినిమాతో తొలిసారి నంది అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత ‘నాని’ పరాజయం పాలైతే, ‘అర్జున్‌’ ఫర్వాలేదనిపించింది. ఇక త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వచ్చిన ‘అతడు’ మహేశ్‌కు మంచి విజయాన్ని అందించింది. కుటుంబ ప్రేక్షకులను అలరించేలా త్రివిక్రమ్‌ ఈ సినిమాను తీర్చిదిద్దారు. ఇప్పటికీ టీవీలో ఈ సినిమా వస్తుంటే, కొద్దిసేపైనా చూడకుండా ఎవరూ ఉండలేరు. 

రికార్డుల బద్దలు కొట్టిన ‘పోకిరి’

‘అతడు’తో విజయాన్ని అందుకున్నా, ఎక్కడో వెలితి. సగటు మహేశ్‌ అభిమాని ఇంకేదో కోరుకుంటున్నాడు. ప్రిన్స్‌ను మరో కోణంలో చూడాలి. యాక్టింగ్‌ ఇరగదీయాలి.. డైలాగ్‌లు అదిరి పోవాలి.. ఫైట్స్‌ దడదడలాడిపోవాలి. ఇదీ సగటు మహేశ్‌ అభిమానుల కోరిక. సరిగ్గా అప్పుడు పూరి జగన్నాథ్‌ ఎంటర్‌ సీన్‌లోకి ఎంటర్‌ అయ్యారు. ఆయన ‘సూపర్‌’ ఫ్లాప్‌తో కసితో రగలిపోతున్నారు. కానీ, మహేశ్‌కు ఆయనపై నమ్మకం ఉంది. ఎందుకంటే గతంలో ‘ఒక్కడు’కు ముందు గుణశేఖర్‌కు ‘మృగరాజు’ పరాజయంతో దెబ్బతిన్న పులిలా ఉన్నారు. ఇక్కడా అదే పరిస్థితి. పూరీ.. పండుగాడిని బయటకు తీసుకొచ్చాడు. వాడు కొట్టిన దెబ్బకు బాక్సాఫీస్‌ కలెక్షన్లకు దిమ్మతిరిగి మైండ్‌ బ్లాంక్‌ అయిపోయి కాసుల వర్షం కురిసింది. ఎంతలా అంటే, ఎక్కడ విన్నా ‘పోకిరి’ పాటలే. ఎవరి నోట విన్నా పండుగాడి డైలాగులే. ఇలియానా, ముమైత్‌ ఖాన్‌ తమ అందాలతో యువతకు మత్తెక్కించారు. ఇక క్లైమాక్స్‌ ట్విస్ట్‌కు థియేటర్లు విజిల్స్‌తో మార్మోగిపోయాయి. 200 సెంటర్లలో 100 రోజులు ఆడేసింది. కర్నూలులోని ఒక థియేటర్‌లో ఏకంగా ఏడాది పాటు ఆడి రికార్డులు సృష్టించింది. ‘పోకిరి’ విజయంతో మహేశ్‌ స్టార్‌ హీరోగా మారిపోయారు. 

స్టార్‌డమ్‌ తెచ్చిన ‘దూకుడు’

‘ఒక్కడు’ తర్వాత ఎలాంటి పరిస్థితి ఎదురైందో.. ‘పోకిరి’ తర్వాత అదే సీన్‌ రిపీట్‌ అయింది. ‘సైనికుడు’, ‘అతిథి’, ‘ఖలేజా’ పెద్దగా మెప్పించలేకపోయాయి. కానీ, త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వచ్చి ‘ఖలేజా’లో ప్రేక్షకులు సరికొత్త మహేశ్‌ను చూశారు. చక్కని ఎనర్జీతో, పంచ్‌లతో, కామెడీ టైమింగ్‌తో  వెండితెరపై  మహేశ్‌ చెలరేగిపోయారు. అయితే, ఆ సమయంలో మహేశ్‌బాబు నుంచి ‘ఒక్కడు’, ‘పోకిరి’లా గుర్తుండిపోయే సినిమాను అభిమానులు కోరుకున్నారు. ఆ సమయంలో మహేశ్‌ చూపు శ్రీను వైట్ల మీద పడింది. ‘కింగ్‌’, ‘నమో వెంకటేశ’తో ఫర్వాలేదనిపించిన ఆయన కూడా మంచి హిట్‌ కొట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రమే ‘దూకుడు’. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. మహేశ్‌ డైలాగ్‌లు, బ్రహ్మానందం, ఎం.ఎస్‌.నారాయణ కామెడీ, తమన్‌ పాటలు ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. దాదాపు రూ.100 కోట్లు వసూలు చేసిన చిత్రంగా ‘దూకుడు’ నిలిచి మహేశ్‌కు స్టార్‌డమ్‌ను తెచ్చింది. 

మల్టీస్టారర్‌తో మెప్పించారు..

హేశ్‌బాబు సినీ కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచిన చిత్రం ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’. వెంకటేశ్‌తో కలిసి ఆయన నటించిన ఈ మల్టీస్టారర్‌కు శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహించారు. మల్టీస్టారర్‌లు అంటే వెనకడుగు వేస్తున్న సమయంలో మహేశ్‌ ధైర్యంగా ముందడుగు వేశారు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాలనూ ఆకట్టుకుంది. చిన్నోడిగా మహేశ్‌ నటన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 

ఇప్పుడు హ్యాట్రిక్‌ కోసం వెయిటింగ్‌..

‘దూకుడు’ తర్వాత మహేశ్‌కు ఆ స్థాయి విజయాన్ని తెచ్చిన చిత్రం ‘శ్రీమంతుడు’. దీని కన్నా ముందు ‘వన్‌: నేనొక్కడినే’ ప్రయోగాత్మక చిత్రంగా నిలిచినా అభిమానులను నిరాశ పరిచింది. ఆ తర్వాత వచ్చిన ‘ఆగడు’ అన్ని కమర్షియల్‌ హంగులు ఉన్నా, ఆకట్టుకోలేకపోయింది. అయితే, ఈసారి మహేశ్‌ రాంగ్‌ స్టెప్‌ వేయలేదు. కొరటాల శివ దర్శకత్వంలో గ్రామాల దత్తత ఇతివృత్తంతో తీసిన ‘శ్రీమంతుడు’ బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. ‘లైఫ్‌ ఈజ్‌ ఏ సర్కిల్‌’ అన్నట్లు మళ్లీ ‘బ్రహ్మోత్సవం’, ‘స్పైడర్‌’ చిత్రాలు నిరాశ పరిచాయి. దీంతో ‘శ్రీమంతుడు’తో హిట్‌ ఇచ్చిన కొరటాలతో కలిసి ‘భరత్‌ అనే నేను’లో సీఎంగా కనిపించి మహేశ్‌ మెప్పించారు. ఈ సినిమాకు కూడా బాక్సాఫీస్‌ వద్ద సందడి చేసింది. ఆ తర్వాత వంశీ పైడిపల్లితో కలిసి సందేశానిస్తూ రూపొందించిన ‘మహర్షి’ మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సంక్రాంతికి (జనవరి 11న) ‘సరిలేరు నీకెవ్వరు’తో హ్యాట్రిక్‌ కొట్టేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌ సినిమాపై అంచనాలు పెంచింది. మహేశ్‌ను మరో సరికొత్త కోణంలో అనిల్‌ రావిపూడి ఆవిష్కరించినట్లు అర్థమవుతోంది. అంతేకాదు, దాదాపు 13ఏళ్ల తర్వాత విజయశాంతి మళ్లీ నటిస్తుండటంతో ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

-ఇంటర్నెట్‌ డెస్క్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని