నా జీవితమే ఓ అద్భుతం: రజనీకాంత్‌

ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ గొప్పతనమంటే అతిశయోక్తి కాదు. ఎల్లలులేని కథానాయకుడిగా కోట్లాది అభిమానుల ఆదరణ పొందుతున్నప్పటికీ ఓ సామాన్యుడిలా ప్రవర్తిస్తుంటారు. నటుడిగా తనకు వచ్చిన ఈ ఖ్యాతిని ఎలా స్వీకరిస్తారని సాహసవీరుడు బేర్‌ గ్రిల్స్‌ .......

Updated : 17 Oct 2022 16:12 IST

‘మ్యాన్‌ వర్సెస్‌ వైల్డ్‌’ షోలో తలైవా.. ప్రోమో విడుదల

చెన్నై: ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ గొప్పతనమంటే అతిశయోక్తి కాదు. ఎల్లలులేని కథానాయకుడిగా కోట్లాది అభిమానుల ఆదరణ పొందుతున్నప్పటికీ ఓ సామాన్యుడిలా ఉంటారు. నటుడిగా తనకు వచ్చిన ఈ ఖ్యాతిని ఎలా స్వీకరిస్తారని సాహసవీరుడు బేర్‌ గ్రిల్స్‌ అడగగా తలైవా జవాబు చెప్పారు. ‘ఓసారి కట్‌ చెప్పి షూటింగ్‌ పూర్తి చేసుకున్న తర్వాత నేను రజనీకాంత్‌ అనే విషయాన్ని మర్చిపోతా. శివాజీ రావు (హీరో కావడానికి ముందు రజనీ పేరు)గా మారిపోతా. రజనీకాంత్‌ అనేది నా వృత్తి జీవితం మాత్రమే. ఎవరైనా ‘‘మీరు రజనీకాంత్‌’ అని గుర్తు చేస్తే.. ‘హో అవును.. నేను రజనీకాంత్‌’ అనుకుంటా’’ అని తెలిపారు. ఇదే సందర్భంగా రజనీ జీవితం గురించి కూడా బేర్‌ గ్రిల్స్‌ పలు ప్రశ్నలు అడిగారు. 18 ఏళ్ల వయసులో బస్సు కండెక్టర్‌గా పనిచేశానని, ఆపై మద్రాసు ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చేరానని రజనీ చెప్పారు. ప్రముఖ దర్శకుడు కె. బాలచందర్‌ తనకు తొలి అవకాశం ఇచ్చారని వివరించారు.

డిస్కవరీ ఛానల్‌లో ప్రసారమయ్యే ‘మ్యాన్‌ వర్సెస్‌ వైల్డ్‌’ షోలో రజనీ కనిపించబోతున్నారు. మార్చి 23న రాత్రి 8 గంటలకు ఇది ప్రసారం కాబోతోంది. ఈ షో కోసం బేర్‌ గ్రిల్స్‌తో కలిసి రజనీ అటవీ ప్రాంతంలో సాహసాలు చేశారు. కర్ణాటకలోని బందిపొరా టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌లో చిత్రీకరణ జరిగింది. రజనీ తొలిసారి బుల్లితెర షోలో కనిపించబోతుండటంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ షోకు సంబంధించిన కొత్త ప్రోమోను విడుదల చేశారు. అందులో రజనీ, బేర్‌ గ్రిల్స్‌కు మధ్య సంభాషణ జరిగింది. ‘నా పూర్తి జీవితమే ఓ అద్భుతం. ఉదాహరణకు.. ‘మ్యాన్‌ వర్సెస్‌ వైల్డ్‌’ షోను తీసుకోండి. ఓ రోజు నేనిలా ఈ షోలో పాల్గొంటానని కలలో కూడా అనుకోలేదు’ అని ఇదే సందర్భంగా రజనీ చెప్పారు.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని