దూరంగా ఉండి జ్యూసులివ్వడం బాధగా ఉంది!

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు యువ కథానాయకుడు విజయ్‌ దేవరకొండ. ఇటీవల

Updated : 16 Apr 2020 20:36 IST

హైదరాబాద్‌: కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు యువ కథానాయకుడు విజయ్‌ దేవరకొండ. ఇటీవల వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పోలీసులతో మాట్లాడిన ఆయన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. తాజాగా విధుల్లో ఉన్న పోలీసులను నేరుగా కలిసి, వారికి ఫ్రూట్‌ జ్యూస్‌లు ఇచ్చారు. పోలీసులకు ధైర్యం ఇచ్చేందుకు తన వంతు కృషిగా ముందుకు వచ్చినట్లు తెలిపారు. 

ఈ సందర్భంగా విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ..‘‘ ప్రపంచంలోని 90శాతానికి పైగా దేశాలు లాక్‌డౌన్‌లో ఉన్నాయి. నా జీవితంలో ఇలాంటి పరిస్థితి చూడలేదు. మొదటి, రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అందరూ ఇళ్లలోనే ఉండేవారని విన్నాను. ఇది కూడా ఒక యుద్ధమే. మనందరం కలిసి పోరాడుతున్నాం. దీన్ని తేలికగా తీసుకోవద్దు. ఈ యుద్ధంలో వైద్యులు, పోలీసులు, ప్రభుత్వం ముందుండి పోరాడుతోంది. ఈ విషయంలో మనం వాళ్లకు సంపూర్ణ మద్దతివ్వాలి. నేను బయటకు వచ్చి మాట్లాడటానికి రెండు కారణాలు ఉన్నాయి. మొన్న వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతుంటే పబ్లిక్‌లో వచ్చి మాట్లాడితే బాగుంటుందని చాలా మంది పోలీసులు సూచించారు. దీంతో పాటు, ఎంతో నిబద్ధతతో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు ధన్యవాదాలు చెప్పేందుకు నేను పబ్లిక్‌లోకి వచ్చా.  నేను వస్తుంటే మా అమ్మానాన్న బయటకు వద్దని చెప్పారు. కానీ, వాళ్లతో గొడవపడి పోలీసులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు ఇక్కడకు వచ్చా. నేను ఒక్కరోజు వస్తేనే మా ఇంట్లో ఒప్పుకోవడం లేదు. అలాంటిది, మీరు మీ కుటుంబాలను వదలి బయట విధులు నిర్వహిస్తున్నారు. మీకూ, వైద్య సిబ్బంది కుటుంబాలకు కృతజ్ఞతలు చెబుతున్నా. మే 3వ తేదీ వరకూ మీరు మరింత జాగ్రత్తగా పనిచేయాలని కోరుకుంటున్నా’’

‘‘పోలీసులు వారి విధులు చక్కగా నిర్వహిస్తారు. కానీ, మనం కూడా మన బాధ్యతలు నెరవేర్చాలి. పోలీసు సోదరులకు దూరం నుంచి ఫ్రూట్‌ జ్యూస్‌ ఇస్తుంటే చాలా బాధగా ఉంది. కానీ, తప్పడం లేదు. ఇక్కడకు వచ్చిన వారందరికీ నాతో ఫొటో దిగాలని ఉంది. కానీ, ఏం చేయలేం. మనందరం ఇంట్లో ఉండాలని పీఎంగారు, సీఎంగారు, కమిషనర్‌గారు అందరూ చెబుతున్నారు. కానీ, ఇంకొందరు చెబితే వింటారనే ఉద్దేశంతో నన్ను పిలిపించారు. వాళ్లకు మనం సహకరించాలి. ఇంట్లో ఉండి ఏం చేయాలి? అనుకోవద్దు. క్షేమంగా ఉంటే చాలు. ఇప్పుడు లాక్‌డౌన్‌కు ఎంత సపోర్ట్‌ చేస్తే, అంత త్వరగా మనం ఈ పరిస్థితుల నుంచి బయట పడతాం. తొలుత లాక్‌డౌన్‌15రోజులు అన్నారు. కానీ, పరిస్థితులు మారిపోయాయి. లాక్‌డౌన్‌ పెరిగింది. కొందరు వ్యక్తులు ఏమీ కాదులే అని బయటకు వస్తున్నారు. అలా చేస్తే, లాక్‌డౌన్‌ ఇంకా పొడిగించే అవకాశం కూడా ఉంది. ఎవరి ఇంట్లో వాళ్లు పోలీసులా ఉండాలి. పిల్లలకు బైక్‌లు ఇవ్వొద్దని తల్లిదండ్రులను కోరుతున్నా. కుల,మత భేదాలు లేకుండా కరోనా అందరికీ సోకుతుంది. దయ చేసి మీకు కరోనా లక్షణాలు ఉన్నాయనిపిస్తే హెల్ప్‌లైన్‌ నంబర్లకు ఫోన్‌చేయండి. మే 3వ తేదీ వరకూ అందరూ ఇళ్లలోనే ఉంటే, కరోనా బాధ నుంచి మనం తప్పించుకోవచ్చు.’’ అని ప్రజలను కోరారు

సీపీ అంజన్‌కుమార్‌ మాట్లాడుతూ.. ‘గత నాలుగైదు రోజులుగా పోలీసుల్లో మరింత స్ఫూర్తినింపేందుకు విజయ్‌ దేవరకొండ పనిచేస్తున్నారు. అందుకు ఆయనకు కృతజ్ఞతలు. మేము అడగ్గానే వచ్చేందుకు వెంటనే ఒప్పుకొన్నారు. మూడు రోజుల కిందట జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో 65 పోలీస్‌స్టేషన్లలోని పోలీసులతో విజయ్‌ ముచ్చటించారు. ప్రస్తుత పరిస్థితుల్లో వైద్యరంగానికి చెందిన వారు, పోలీసులు అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌ నగరంలో దాదాపు 10వేలమంది పోలీసులు నిబద్ధతతో పనిచేస్తున్నారు. తమని తాము రక్షించుకుంటూనే విధుల్లో పాల్గొంటున్నారు. ప్రతి కానిస్టేబుల్‌కు మాత్రమే కాదు, అతని కుటుంబానికీ కూడా నేను సెల్యూట్‌ చేస్తున్నా. వారిలో స్ఫూర్తినింపేందుకు విజయ్‌గారు మరికొన్ని రోజులు మాతో ఉండాలని కోరుతున్నా’’ అని చెప్పారు.

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని