ఇదే నాకు అతి పెద్ద అవార్డు: శేఖర్‌ కమ్ముల

తమకు పాలు, మజ్జిగ పంపిణీ చేసిన దర్శకుడు శేఖర్‌ కమ్ములకు పారిశుద్ధ్య కార్మికులు వినూత్నంగా కృతజ్ఞతలు తెలిపారు. ‘థాంక్యూ శేఖర్‌ కమ్ముల గారు’ అంటూ ఇంగ్లిషులో రాసిన ప్లకార్డులను చేతిలో పట్టుకున్నారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోను శేఖర్‌ కమ్ముల ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.....

Published : 13 May 2020 19:11 IST

హైదరాబాద్‌: తమకు పాలు, మజ్జిగ పంపిణీ చేసిన దర్శకుడు శేఖర్‌ కమ్ములకు పారిశుద్ధ్య కార్మికులు వినూత్నంగా కృతజ్ఞతలు తెలిపారు. ‘థాంక్యూ శేఖర్‌ కమ్ముల గారు’ అంటూ ఇంగ్లిషులో రాసిన ప్లకార్డులను చేతిలో పట్టుకున్నారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోను శేఖర్‌ కమ్ముల ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. వారి మనసులో చోటు సంపాదించుకోవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు. ‘గాంధీ ఆసుపత్రి జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య కార్మికులు నాపై ప్రేమను చూపించిన తీరు అమూల్యం. ఇది నాకు లభించిన అతి పెద్ద అవార్డు. నా పని మీ హృదయాల్ని తాకడం అమితమైన ఆనందాన్ని ఇచ్చింది. కానీ మీరు మా కోసం నిరంతరం శ్రమిస్తున్న దాని ముందు ఇది చాలా చిన్నది’ అని ఆయన పోస్ట్‌ చేశారు.

కరోనా వైరస్‌ విజృంభిస్తున్న ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ ప్రజాశ్రేయస్సు కోసం బాధ్యతలు నిర్వర్తిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు తన వంతు సాయం చేయడానికి శేఖర్‌ కమ్ముల ముందుకొచ్చారు. ఒక నెల రోజుల పాటు నార్త్ జోన్ పరిధిలో పనిచేస్తున్న వెయ్యిమంది సిబ్బందికి పాలు, మజ్జిగ అందించారు. ఈ నేపథ్యంలో ఆయనకు కార్మికులు ధన్యవాదాలు తెలిపారు. ఆయన ప్రస్తుతం ‘లవ్‌స్టోరీ’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన ఈ సినిమాను ఏప్రిల్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేశారు. కానీ లాక్‌డౌన్‌ వల్ల సినిమా వాయిదా పడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని