Avatar: అప్పుడు ప్రేమకథ.. ఇప్పుడు ఫ్యామిలీ డ్రామా.. ‘అవతార్‌’ కథలివి

దర్శకుడు జేమ్స్‌ కామెరూన్‌ తెరకెక్కించిన తాజా చిత్రం ‘అవతార్‌ 2: ది వే ఆఫ్‌ వాటర్‌’. 13 ఏళ్ల క్రితం వచ్చిన ‘అవతార్‌’కు సీక్వెల్‌గా రూపొందింది.

Published : 16 Dec 2022 01:49 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘అవతార్‌ 2’ (Avatar 2: The Way of Water) సినిమాను చూసేందుకు సిద్ధమయ్యారా? ఇప్పటికే టికెట్‌ బుక్‌ చేసుకొని, కొత్త ప్రపంచాన్ని చూసేందుకు ఉవ్విళ్లూరుతున్నారా? ‘అవతార్‌’ (Avatar) 13 ఏళ్ల క్రితం విడుదలైంది. ఇన్నేళ్ల తర్వాత దాని సీక్వెల్‌ రిలీజ్‌ అవుతోంది. మరి, పాత అవతార్‌లో ఏం జరిగిందో గుర్తు చేసుకుని, కొత్త అవతార్‌లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా..

‘టైటానిక్‌’ (Titanic) తర్వాత హాలీవుడ్‌ దిగ్గజ దర్శకుడు జేమ్స్‌ కామెరూన్‌ (James Cameron) సృష్టించిన విజువల్‌ వండర్‌ ‘అవతార్‌’. ఈ సినిమా 2009 డిసెంబరు 18న విడుదలైంది. సామ్‌ వర్తింగ్‌టన్‌, జో సాల్డానా, స్టీఫెన్‌లాంగ్‌, సిగర్నీ వీవర్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. సీక్వెల్‌లో వీరితోపాటు ‘టైటానిక్‌’ హీరోయిన్‌ కేట్‌ విన్‌స్లెట్‌ కనిపించనున్నారు. ‘అవతార్‌ 2’.. 2022 డిసెంబరు 16న రిలీజ్‌ కానుంది.

అవతార్ కథ ఇది

అవతార్‌ కోసం జేమ్స్‌ కామెరూన్‌ సాంకేతికత సాయంతో ‘పండోరా’ అనే  ప్రపంచాన్ని సృష్టించారు. అక్కడ ‘నావీ’ అనే అటవీ తెగ జీవిస్తుంటుంది. ప్రకృతే ప్రాణంగా జీవించే ఆ వింత ప్రాణులకు, అభివృద్ధే లక్ష్యంగా దూసుకెళ్లే మానవులకు మధ్య జరిగే పోరాటమే ‘అవతార్’ థీమ్‌. అయితే, ఇందులో యాక్షన్‌కు మించిన లవ్‌స్టోరి దాగుంది. ఆ ప్రేమకథ ఎన్నో హృదయాలను హత్తుకుంది. జేక్‌ సల్లీ (సామ్‌ వర్తింగ్‌టన్‌) నావికాదళంలో బాధ్యతలు నిర్వహిస్తూ ప్రమాదానికి గురై, కాళ్లు పోగొట్టుకుంటాడు. పండోరాలోని విలువైన సంపదను తీసుకొచ్చేందుకు రిసోర్సెస్‌ డెవలెప్‌మెంట్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఆర్‌.డి.ఎ) అధికారులు చేపట్టిన అవతార్‌ ప్రోగ్రామ్‌లో పాల్గొంటే నడవగలిగే స్థితికి వస్తానని తెలుసుకున్న జేక్‌ అందుకు సిద్ధపడతాడు. ప్రోగ్రామ్‌ హెడ్‌ డాక్టర్‌ గ్రేస్‌ అగస్టిన్‌ (సిగర్నీ వీవర్‌) ముందుగా జేక్‌ను వద్దన్నా మరోదారి లేక ఓకే అంటుంది. పరీక్షలు విజయవంతంగా పూర్తి చేసుకున్న జేక్‌.. అవతార్‌ శరీరంలోకి ప్రవేశిస్తాడు. పండోరాలోని విలువైన ఓ చెట్టు రహస్యాన్ని చెబితే భూమ్మీదకు పంపించి, కాళ్లు వచ్చే ఏర్పాట్లు చేయిస్తానని జేక్‌కు ఓ అధికారి ఆఫర్ ఇస్తాడు. గ్రేస్‌ బృందంతో కలిసి జేక్‌ పండోరా ప్రపంచంలో అడుగుపెడతాడు. ఓ క్రూర జంతువు దాడి చేసే క్రమంలో మిగిలిన వారంతా తిరిగి వెళ్లపోగా జేక్‌ అక్కడే ఉండిపోతాడు. ఇక అతను బతికుండడం కష్టమే అని అంతా అనుకుంటారు.

కట్‌ చేస్తే, నైత్రి అనే నావీ తెగ అమ్మాయి జేక్‌ను రక్షిస్తుంది. కుటుంబ సభ్యులకు పరిచయం చేస్తుంది. నావీ వారు అంత సులభంగా ఇతరులను నమ్మరు కాబట్టి ఓ పరీక్ష పెడతారు. అందులో విజయం అందుకున్న జేక్‌కు తమలో ఒకడిగా ఉండేందుకు తగిన శిక్షణ ఇవ్వమని నేత్రి తల్లి ఆమెను ఆదేశిస్తుంది. ఆ ప్రయాణంలో నేత్రి.. జేక్‌ ప్రేమలో పడుతుంది. ఓ రోజు ఆర్‌.డి.ఎ. ఆఫీసర్లు పండోరాలోని చెట్టును తొలగించేందుకు ప్రయత్నిస్తుండగా జేక్‌ అడ్డుపడతాడు. ఇంతకాలం తమకు సపోర్ట్‌గా ఉన్న జేక్‌ అలా చేయడంతో ఆర్‌.డి.ఎ బృందం షాక్‌ అవుతుంది. దాంతో, ఓ అధికారి జేక్‌ అవతార్‌ని తొలగిస్తాడు. ఆ తర్వాత జేక్‌, గ్రేస్‌ వెళ్లి నావీ వారికి జరిగినదాన్ని వివరించే ప్రయత్నం చేస్తారు. కానీ, వారు వినిపించుకోరు పైగా జేక్‌ తనను మోసం చేశాడని నేత్రి భావిస్తుంది. మరోవైపు, ఆర్‌.డి.ఎ. పండోరాని నాశనం చేస్తుంది. మళ్లీ అవతార్‌గా మారిన జేక్‌ పండోరా వెళ్లి నావీ వారికి స్ఫూర్తిగా నిలుస్తాడు. మానవులు, నావీ వారి మధ్య యుద్ధం మొదలవుతుంది. నావీ టీమ్‌కు కెప్టెగా మారిన జేక్‌ పండోరాను ధ్వంసం చేయాలనుకున్న మానవులను భూమ్మీదకు పంపిస్తాడు. అవతార్‌ రూపంలోనే శాశ్వతంగా ఉండాలని నిర్ణయించుకున్న హీరో ‘నేను మళ్లీ ఈ ల్యాబ్‌కు రాను. నా పేరు జేక్‌ మళ్లీ కలుద్దాం’ అని చెప్పే సంభాషణతో సినిమా ముగుస్తుంది.

అవతార్‌ 2 ఇలా ఉండనుంది

పార్ట్‌ 1లో ప్రేమికులుగా కనిపించిన జేక్‌, నేత్రి పార్ట్‌ 2లో తల్లీదండ్రులుగా కనిపిస్తారు. తొలి భాగంలో పండోరా ప్రపంచంలో ప్రేక్షకులను విహరించేలా చేసిన జేమ్స్‌ రెండో భాగంతో మరో ప్రపంచాన్ని పరిచయం చేయనున్నారు. సముద్రానికి సంబంధించిన ఎన్నో విశేషాలను ఆయన చూపించనున్నారు. మరి, అక్కడ ఎలాంటి పోరాటం జరిగింది? అన్నది తెరపై చూస్తేనే బాగుంటుంది. జేక్‌ సల్లీ కొడుకుకు ఓ ప్రేమకథ ఉందని ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది. మరి, ఈ లవ్‌స్టోరీ ఎలా ఉంటుంది? జేక్‌ ఫ్యామిలీ చేసిన సాహసాలేంటి? సమాధానం మరికొన్ని గంటల్లోనే తెలుస్తుంది. ‘అవతార్‌’కు సంబంధించిన మరో మూడు సీక్వెల్స్‌ తెరకెక్కనున్నాయి. ‘అవతార్‌ 3’కి జేమ్స్‌ దర్శకత్వం వహించనుండగా మిగిలిన రెండింటికీ ఆయన మరొకరికి బాధ్యతలు అప్పగించనున్నారు. ‘అవతార్‌2’ నిర్మాణ విలువ రూ.3000 కోట్లపైనే. ఆ తరవాత తీయబోయే ‘అవతార్‌’ (Avatar) సీక్వెల్స్‌కూ కేటాయించిన బడ్జెట్‌ను కూడా లెక్కిస్తే దాదాపు రూ.11,300 కోట్లు. ప్రపంచ సినిమా చరిత్రలో ఇంత ఖరీదైన మూవీ సిరీస్‌ మరేదీ లేదు. అడ్వాన్స్‌ బుకింగ్స్‌ విషయంలో ‘అవతార్‌ 2’ సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ సినిమా తెలుగు వెర్షన్‌కు నటుడు, దర్శకుడు శ్రీనివాస్‌ అవసరాల సంభాషణలు రాశారు.

* తమ ఉనికి కోసం మానవులు ప్రకృతిని నాశనం చేయడానికి ఎంతకైనా సిద్ధపడతారనే అంశాన్ని స్పృశిస్తూ దానికి అద్భుత విజువల్స్‌ జోడించి భావోద్వేగభరితంగా జేమ్స్‌ కామెరూన్‌ తెరకెక్కించిన ‘అవతార్‌’కు రీరిలీజ్‌లోనూ మంచి ఆదరణ దక్కింది. మీరు అప్పుడూ మిస్‌ అయి ఉంటే.. ఈ సినిమా ఓటీటీ ‘డిస్నీ+ హాట్‌స్టార్‌’లో హిందీ, ఇంగ్లిష్‌ భాషల్లో అందుబాటులో ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని