sankranthi movies: ఈ సంక్రాంతికి బాక్సాఫీస్‌ బద్దలయ్యేలా వస్తున్న చిత్రాలివే!

telugu movies: ఈ వారం థియేటర్‌/ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే!

Updated : 09 Jan 2023 11:59 IST

కాకి డేగ, కాకి నెమలి, డేగ, హంస, పర్ల, మైల, కొక్కిరాయి కత్తులు కట్టుకుని బరిలో దిగుతున్నాయి. ఇంతకీ ఇవన్నీ ఏంటనుకుంటున్నారా? తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి బరిలో పోటీ పడే కోడి పుంజుల పేర్లు. వీటి మధ్య పోటీ భలే రసవత్తరంగా ఉంటుంది. తెలుగువారి లోగిళ్లలో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. మరో రెండు రోజుల్లో బాక్సాఫీస్‌ సందడి కూడా షురూ కానుంది. కరోనా తర్వాత వరుసగా అగ్ర కథానాయకులు చిత్రాలు వస్తున్న అసలైన సంక్రాంతి ఇదే! దీంతో బాక్సాఫీస్‌ ఫైట్‌లో దిగుతున్న పందెం కోళ్లు ఏవి? ఏయే చిత్రాలతో పోటీ పడుతున్నాయి? అలాగే ఓటీటీలో సందడి చేసే చిత్రాలేంటో కూడా చూసేయండి.

ఆ ‘తెగింపు’ ఎందుకు చేయాల్సి వచ్చింది!

తమిళంతో పాటు, తెలుగులోనూ మంచి గుర్తింపు ఉన్న నటుడు అజిత్‌ (Ajith Kumar). ఆయన నటించిన ప్రతి చిత్రం ఇక్కడ కూడా సందడి చేస్తోంది. హెచ్‌.వినోద్‌ దర్శకత్వంలో ఆయన నటించిన యాక్షన్‌ మూవీ ‘తునివు’ (Thunivu). తెలుగులో ‘తెగింపు’ (Tegimpu) టైటిల్‌తో విడుదల చేస్తున్నారు. బ్యాంకు దోపిడీ నేపథ్యంతో పాటు, హైవోల్టేజ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా వినోద్‌ దీన్ని తీర్చిదిద్దారు. ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్‌ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. యాక్షన్‌ ప్రియులను మరింత అలరించడం ఖాయం. ఈ సినిమా కూడా విజయ్‌ ‘వారిసు’తో కలిసి జనవరి 11న తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదల చేస్తున్నారు. మంజు వారియర్‌, సముద్రఖని కీలక పాత్రలు పోషించారు.


జై బాలయ్య’.. మార్మోగనున్న థియేటర్లు

సంక్రాంతి కలిసొచ్చిన కథానాయకుల్లో బాలకృష్ణ (Balakrishna) ఒకరు. గతంలో ఆయన నటించిన అనేక చిత్రాలు ఇలాగే సంక్రాంతికి వచ్చి సందడి చేశాయి. ఇప్పుడు ‘వీరసింహారెడ్డి’ (Veera Simha Reddy)గా ప్రేక్షకులను ఆయన పలకరించబోతున్నారు. గోపిచంద్‌ మలినేని దర్శకత్వంలో ఆయన నటించిన యాక్షన్‌ డ్రామా మూవీ ఇది. శ్రుతిహాసన్‌ (Shruti Haasan) కథానాయిక. జనవరి 12న ఈ చిత్రం థియేటర్‌లో విడుదల కానుంది. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలను పెంచుతోంది. బాలకృష్ణను ఫుల్‌ యాక్షన్‌ మోడ్‌లో గోపిచంద్‌ చూపించారు. దునియా విజయ్‌, వరలక్ష్మి శరత్‌కుమార్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.


‘వీరయ్య’ లోకల్‌.. మాస్‌ అనే పదం ఇంటర్నేషనల్‌

‘రికార్డ్స్‌లో నా పేరు ఉండటం కాదు.. నా పేరు మీదే రికార్డులు ఉంటాయి’ అంటున్నారు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi). ఆయన కథానాయకుడిగా నటించి మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya).  శ్రుతిహాసన్‌ (Shruti Haasan) కథానాయిక. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. రవితేజ కీలక పాత్రలో నటిస్తున్న ఈ మూవీ ప్రచార చూస్తే, దర్శకుడు బాబీ దీన్నొక మాస్‌ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దినట్లు అర్థమవుతోంది.


‘వారసుడు’ వస్తున్నాడు..!

ఈ సంక్రాంతికి తమిళ, తెలుగు ప్రేక్షకులను పలకరించడానికి వస్తున్న మరో నటుడు విజయ్‌ (Vijay). వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఆయన కథానాయకుడిగా నటించిన తమిళ చిత్రం ‘వారిసు’ (Varisu). రష్మిక మందన (Rashmika Mandanna) కథానాయిక. తెలుగులో ‘వారసుడు’ (Varasudu) పేరుతో విడుదల చేస్తున్నారు. భారీ బడ్జెట్‌తో దిల్‌రాజు ఈ సినిమాను నిర్మించారు. తొలుత ఈ సినిమా రెండు భాషల్లో ఒకేసారి విడుదల చేయాలనుకున్నారు. కానీ, సాంకేతిక కారణాల వల్ల జనవరి 11న తమిళంలో, 14న తెలుగు భాషలో థియేటర్‌లో విడుదల కానుంది. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు, పాటలు విజయ్‌ అభిమానులతో పాటు, యువతను అలరిస్తున్నాయి.


భారీ చిత్రాల మధ్య చిన్న చిత్రం

ప్రతి సంక్రాంతికి అగ్ర కథానాయకులు సినిమాలు విడుదలైనా, ఒక చిన్న చిత్రం కచ్చితంగా సందడి చేస్తూ వస్తోంది. ఈసారి ఆ అవకాశాన్ని ‘కళ్యాణం కమనీయం’ అందిపుచ్చుకుంది. సంతోష్‌ శోభన్‌ (Santosh Sobhan), ప్రియాభవానీ శంకర్‌ జంటగా అనిల్‌ కుమార్‌ ఆళ్ల తెరకెక్కించిన చిత్రమిది. పెళ్లి నేపథ్యంలో సాగే ఈ రొమాంటిక్‌ కామెడీ సినిమా జనవరి 14న థియేటర్‌లలో ప్రేక్షకుల ముందుకురానుంది.


ఈ వారం ఓటీటీలో రాబోతున్న చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

* హంటర్స్‌ (వెబ్‌ సిరీస్‌) జనవరి 13

* దృశ్యం-2 (హిందీ)జనవరి 13


జీ5

* హెడ్‌ బుష్‌ (తెలుగు డబ్బింగ్‌) జనవరి 13

* తట్టస్సెరి కూట్టం (మలయాళం) జనవరి 13


డిస్నీ+హాట్‌స్టార్‌

* చేజింగ్‌ వేవ్స్‌ (వెబ్‌సిరీస్‌) జనవరి 11

* ముకుందన్‌ ఉన్ని అసోయేషన్స్‌ (మలయాళం) జనవరి 13


నెట్‌ఫ్లిక్స్‌

* సెక్సిఫై (వెబ్‌సిరీస్‌ సీజన్‌-2) జనవరి 11

* వైకింగ్స్‌ :వల్హల్లా (వెబ్‌సిరీస్‌) జనవరి 12

* బ్రేక్‌ పాయింట్‌ (వెబ్‌సిరీస్‌) జనవరి 13

* డాగ్‌ గాన్‌ (హాలీవుడ్‌) జనవరి 13

* ట్రయల్‌ బై ఫైర్‌ (హిందీ) జనవరి 13

* స్కై రోజో (స్పానిష్‌) జనవరి 13

* కుంగ్‌ఫూ పాండా: ది డ్రాగన్‌ నైట్‌ (వెబ్‌సిరీస్‌) జనవరి 12

* వరలరు ముఖ్యం (తమిళ్‌) జనవరి 15


లయన్స్‌ గేట్‌ ప్లే

* లంబోర్గిని:ద మ్యాన్‌బిహైండ్‌ ద లెజెండ్‌ (హాలీవుడ్)జనవరి 13


వూట్‌

* విక్రమ్‌ వేద (హిందీ) జనవరి 9

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని