Yash: దూరంగా ఉంటాను.. తన పుట్టినరోజుపై యశ్‌ పోస్ట్‌..

హీరో యశ్‌ (yash) తన పుట్టినరోజు నాడు అందుబాటులో ఉండడం లేదంటూ పోస్ట్‌ పెట్టారు. అభిమానుల శుభాకాంక్షలు తనకెంతో ప్రత్యేకమైనవని తెలిపారు.

Published : 05 Jan 2024 14:31 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: స్టార్‌ హీరో యశ్‌ (Yash) తన కొత్త సినిమాను ప్రకటించి నెలరోజులైంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని అప్పుడు చెప్పారు. దీంతో జనవరి 8న యశ్‌ పుట్టినరోజున దీని గురించి చెబుతారని అందరూ ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తన బర్త్‌డేపై యశ్‌ పోస్ట్‌ చేశారు.

‘‘మీరంతా నా పుట్టినరోజు కోసం ఎదురుచూస్తున్నారని నాకు తెలుసు. నన్ను వ్యక్తిగతంగా కలిసి విషెస్‌ చెప్పాలని అభిమానులంతా ఆశపడుతున్నారు. నన్ను నమ్మండి.. మీతో కలిసి సమయాన్ని గడపడం నాకు అత్యంత విలువైన వాటిలో ఒకటి. కానీ, మనమంతా మరో రోజు కలుద్దాం. జనవరి 8న నేను అందుబాటులో ఉండను. ప్రత్యక్షంగా మిమ్మల్ని కలవలేకపోయినా.. మీ అందరి శుభాకాంక్షలు నా హృదయానికి చేరతాయి. అవి నాకు ఎప్పటికీ ప్రత్యేకమైనవే. నాతోనే ఉంటాయి’’ అని రాసుకొచ్చారు.

ఇక యశ్‌ కొత్త చిత్రానికి ‘టాక్సిక్‌’ (Toxic) అనే పేరును ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఏ ఫెయిరీ టేల్‌ ఫర్‌ గ్రోన్‌ అప్స్‌.. అన్నది ఉపశీర్షిక. మలయాళ దర్శకురాలు గీతూ మోహన్‌ దాస్‌ దీన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో సాయిపల్లవి కథానాయికగా కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే ఇందులో బాలీవుడ్‌ హీరోయిన్ కరీనా కపూర్‌ కీలకపాత్రలో కనిపించనున్నట్లు కూడా టాక్‌. ‘కేజీయఫ్‌’ చిత్రాల తర్వాత యశ్‌ నుంచి వస్తున్న సినిమా కావడంతో దీనిపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని