నటనలో జీవించిందెవరు?

ఆస్కార్‌ సంబరాలు మొదలయ్యాయి. నామినేషన్ల జాబితా ప్రకటించినప్పటి నుంచి పురస్కారాలు ఎవర్ని వరిస్తాయో అనే ఆత్రుత ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానుల్లో ఉంది. ఈసారి ఉత్తమ నటుడి పురస్కారం కోసం గట్టిపోటీ నెలకొంది....

Updated : 08 Apr 2021 14:06 IST

ఆస్కార్‌ రేసులో నటులు

ఆస్కార్‌ సంబరాలు మొదలయ్యాయి. నామినేషన్ల జాబితా ప్రకటించినప్పటి నుంచి పురస్కారాలు ఎవర్ని వరిస్తాయో అనే ఆత్రుత ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానుల్లో ఉంది. ఈసారి ఉత్తమ నటుడి పురస్కారం కోసం గట్టిపోటీ నెలకొంది. నామినేషన్లు పొందిన ఐదుగురు నటుల్లో ఒకరు మరణానంతరం పొందారు. ఈ నేపథ్యంలో ఉత్తమ నటుడుగా ఎవరు నిలుస్తారో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరి ఆ ఐదుగురు ఎవరు? వాళ్లకు సంబంధించిన విశేషాలేంటో చదివేద్దాం.

శబ్దమే జీవితం.. శబ్దమే శాపం

‘ది రోడ్‌ టు గున్టానమో’, షిఫ్టీ, ఫోర్‌ లయన్స్, త్రిష్న, త్రీ మనోర్స్, ది రెలెక్టుంట్‌ ఫండమెంటలిస్ట్‌ తదితర చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న బ్రిటిష్‌ నటుడు రిజ్‌ అహ్మద్‌. ఇప్పుడు ఆయన ఉత్తమ నటుడిగా ‘సౌండ్‌ ఆఫ్‌ మెటల్‌’ చిత్రానికి ఆస్కార్‌ నామినేషన్‌ దక్కించుకున్నారు. ఈ చిత్రంలో రాక్‌ డ్రమ్మర్‌ రూబెన్‌ స్టోన్‌ పాత్రలో నటించారు రిజ్‌. తన ప్రేయసి లూతో కలిసి ప్రదర్శనలు ఇస్తుంటాడు రూబెన్‌. అతడు అనుకోని పరిస్థితుల్లో వినికిడి తనాన్ని కోల్పోతాడు. వైద్యం తీసుకున్నా 30 శాతమే వినికిడి ఉంటుంది. పెద్ద శబ్దాలకు దూరంగా ఉంటేనే తదుపరి వైద్యం కొనసాగించగలం అని వైద్యుడు సలహా ఇచ్చినా తన ప్రదర్శనలను కొనసాగిస్తాడు. మరి ఆ తర్వాత ఏమైంది. అనేది మిగిలిన కథాంశం. శబ్దమే తన జీవితంగా బతికే వ్యక్తికి శబ్దాలు వినకూడని పరిస్థితి వస్తే ఎలా ఉంటుందో అద్భుతంగా పలికించాడు రిజ్‌. ఆయన మంచి నటుడే కాదు మంచి ర్యాప్‌ గాయకుడు కూడా. ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. ముస్లింలకు సంబంధించిన పలు సమస్యలపై కూడా పోరాడుతున్నారు రిజ్‌. ‘సౌండ్‌ ఆఫ్‌ మెటల్‌’ చిత్రంలోని నటనకు ఉత్తమ నటుడిగా ఇప్పటికే పలు అంతర్జాతీయ పురస్కారాలను గెలుచుకున్నారు రిజ్‌.

మూడేళ్ల తర్వాత మళ్లీ

మరోసారి ఆస్కార్‌ ఉత్తమ నటుడి బరిలో నిలిచారు ప్రముఖ హాలీవుడ్‌ నటుడు గ్యారీ ఓల్డ్‌మ్యాన్‌. ‘డార్కెస్ట్‌ అవర్‌’ చిత్రంలోని నటనకు 2018లో ఉత్తమ నటుడిగా ఆస్కార్‌ గెలుచుకున్నారు గ్యారీ. మళ్లీ మూడేళ్ల విరామం తర్వాత ‘మాంక్‌’ చిత్రంలోని నటనకు ఉత్తమ నటుడిగా 93వ ఆస్కార్‌ నామినేషన్‌ అందుకున్నారు గ్యారీ. ప్రముఖ స్క్రీన్‌ రైటర్‌ హెర్మన్‌ జె.మ్యాన్‌కివిక్‌ కథతో తెరకెక్కిన చిత్రమిది. అందులో హెర్మన్‌ పాత్రలో గ్యారీ నటన ఆకట్టుకుంటుంది. ‘టూ రొమాన్స్‌’, ‘ది ఫిప్త్‌ ఎలిమెంట్‌’, ‘ఎయిర్‌ ఫోర్స్‌ వన్‌’, ‘ది కంటెండర్‌’ తదితర చిత్రాల్లో విలన్‌గా నటించి మెప్పించారు 63 ఏళ్ల గ్యారీ. ఈయన మంచి నటుడే కాదు దర్శకుడు, నిర్మాత, గాయకుడు కూడా.

83 ఏళ్ల వయసులో..

83 ఏళ్ల వయసులో ఆస్కార్‌ నామినేషన్‌ దక్కించుకున్న నటుడు ఆంథోని హాప్కిన్స్‌. 1992లో ‘ది సైలెన్స్‌ ఆఫ్‌ ది లాంబ్స్‌’ చిత్రంలోని నటనకు ఉత్తమ నటుడిగా ఆస్కార్‌ అందుకున్నారు ఆంథోని. ఆ తర్వాత పలు సార్లు ఉత్తమ నటుడు, ఉత్తమ సహాయ నటుడు విభాగాల్లో నామినేషన్లు దక్కించుకున్నా పురస్కారం దక్కలేదు. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత ఉత్తమ నటుడి రేసులో నిలిచారు ఆంథోని. ‘ది ఫాదర్‌’ చిత్రంలో జ్ఞాపకశక్తిని కోల్పోయిన వృద్ధుడి పాత్రలో ఆంథోని నటన ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. ‘ది ఫాదర్‌’లోని నటనకు పలు అంతర్జాతీయ పురస్కారాలకు సంబంధించిన నామినేషన్లు కూడా ఆంథోని దక్కించుకున్నారు. ‘ది లయన్‌ ఇన్‌ ది వింటర్‌’, ‘హన్నీబాల్‌’, ‘రెడ్‌ డ్రాగన్‌’, ‘ది   ఎలిఫెంట్‌ మ్యాన్‌’, ‘84 ఛార్జింగ్‌ క్రాస్‌ రోడ్‌’, ‘థోర్‌’, ‘నిక్సన్‌’ లాంటి విజయవంతమైన చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుతెచ్చుకున్నారు ఆంథోని హాప్కిన్స్‌.

మరణానంతరం బోస్‌మ్యాన్‌కు నామినేషన్‌

మరణానంతరం ఆస్కార్‌ నామినేషన్‌ దక్కించుకున్న నటుడు చాడ్విక్‌ బోస్‌మ్యాన్‌. గత ఏడాది కోలెన్‌ క్యాన్సర్‌తో చనిపోయారు బోస్‌మ్యాన్‌. ‘బ్లాక్‌ పాంథర్‌’గా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల్ని అలరించారు బోస్‌మ్యాన్‌. ఆయన నటించిన చివరి చిత్రం ‘మా రైనీస్‌ బ్లాక్‌ బాటమ్‌’ చిత్రంలోని నటనకు ఆయనకు ఆస్కార్‌ నామినేషన్‌ దక్కింది. బోస్‌మ్యాన్‌ 2020 ఆగస్టు 28న కన్నుమూస్తే అదే ఏడాది నవంబరు 25న ‘మా రైనీస్‌..’ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. అమెరికన్‌ ఆఫ్రికన్ల జానపద సంగీతమైన బ్లూస్‌ నేపథ్యంగా సాగే చిత్రమిది. ఇందులో మా రెనీస్‌ బృందంలో వాయిద్యకళాకారుడు లీవీగా బోస్‌మ్యాన్‌ నటన ఆకట్టుకుంటుంది. నల్ల జాతీయులపై 1920 ప్రాంతంలో సాగిన వివక్షను కూడా ఈ కథలో చూపించారు. వెండితెరపై బోస్‌మ్యాన్‌కు ఇది చివరి చిత్రమే అయినా చిరస్థాయిగా  ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయేలా నటించాడంటూ అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకున్నారు. ఈ చిత్రంలోని నటనకు ఆస్కార్‌ నామినేషన్‌తో పాటు పలు అంతర్జాతీయ పురస్కారాలు గెలుచుకున్నారు బోస్‌మ్యాన్‌.

భావోద్వేగాలు పండించిన జాకబ్‌

ఉత్తమ నటుడిగా నామినేషన్‌ అందుకున్న కొరియన్‌ అమెరికన్‌ నటుడు స్టీవెన్‌ యన్‌. ‘మినారీ’ చిత్రంలోని జాకబ్‌ పాత్రలో ఒదిగిపోయాడు. ఆ నటనకే ఈ నామినేషన్‌ దక్కింది. అమెరికాలోని ఓ మారుమూల ప్రాంతానికి వెళ్లి వ్యవసాయం చేయాలనుకున్న ఓ కుటుంబం కథ ఇది. ఆ క్రమంలో వాళ్లకు ఎదురైన పరిస్థితులు, సవాళ్లు..వీటన్నింటినీ ఆకట్టుకునేలా చూపించారు దర్శకుడు లీ ఐజాక్‌ చుంగ్‌. ఈ చిత్రంలోని నటనకు ఆస్కార్‌తో పాటు పలు అంతర్జాతీయ పురస్కారాలకు చెందిన నామినేషన్లను దక్కించుకున్నారు స్టీవెన్‌ యన్‌. పంటలే కాదు తెరపై చక్కటి భావోద్వేగాలు పలికించారు స్టీవెన్‌. ‘ఐ ఆరిజన్స్‌’, ‘ఓక్జా’, ‘మేహెమ్‌’, ‘సారీ టు బ్రదర్‌ యు’ తదితర చిత్రాలతో గుర్తింపుతెచ్చుకున్నారాయన. ‘ది వాకింగ్‌ డెడ్‌’ లాంటి టెలివిజన్‌ సిరీస్‌ల్లోనూ ఆయన నటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని