Kangana Ranaut: సినిమాలు మానేయాలని ఉంది: కంగనా రనౌత్‌ షాకింగ్‌ పోస్ట్‌

ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న ట్రెండ్‌ చూస్తుంటే భయమేస్తోందని నటి కంగనా అన్నారు.  

Updated : 08 Jan 2024 19:04 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సినిమాలు మానేయాలని ఉందని పోస్ట్‌ పెట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు కంగనా రనౌత్‌. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఆమె.. ప్రతి విషయంలో నిర్మొహమాటంగా తన అభిప్రాయాలను తెలుపుతుంటారు. ఆమె ప్రధానపాత్రలో నటించిన చిత్రం ‘తేజస్‌’ అనుకున్న స్థాయిలో అలరించలేకపోయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాగుందంటూ ఓ నెటిజన్ పెట్టిన పోస్ట్‌కు ఆమె రిప్లై ఇస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

‘నా చిత్రాలపై కొందరు కావాలనే నెగెటివ్‌ ప్రచారం చేస్తుంటారు. ఈ విషయంపై నేను ఎప్పటినుంచో పోరాడుతున్నాను. ప్రస్తుతం సినిమాల్లో కనిపిస్తోన్న ట్రెండ్ భయంకరంగా ఉంది. నేను సినీ రంగంలోకి ప్రవేశించిన తొలిరోజుల్లో ఇలానే ఉండేది. దానిని మార్చాలని మహిళలకు ప్రాధాన్యమున్న సినిమాలను చేశాను. అగ్ర నిర్మాణ సంస్థలు నిర్మించిన చిత్రాలను, స్టార్‌ హీరోలు నటించిన వాటిని కూడా తప్పుపడుతూ పోరాడాను. వాళ్లమీద నాకు వ్యక్తిగతంగా కోపం లేనప్పటికీ వాళ్లు ఎంచుకున్న చిత్రాల్లోని కథల వల్ల వ్యతిరేకించాను. నేడు సినిమాల్లో మహిళలకు ఇచ్చే గౌరవం చూస్తుంటే ఎంతో బాధేస్తోంది. దీనికి సినీ పరిశ్రమ మాత్రమే కారణంకాదు.. ఇందులో ప్రేక్షకుల పాత్ర కూడా ఉంది. మహిళలను కించపరిచే సినిమాలను వాళ్లు కూడా ప్రోత్సాహిస్తున్నారు. దానికి ఇటీవల విడుదలైన ఓ చిత్రమే ఉదాహరణ. స్త్రీల కోసం జీవితాలను అంకితం చేసిన వారిని ఇది తీవ్రంగా నిరుత్సాహపరుస్తోంది. ఇలాంటి వాటి వల్ల నా కెరీర్‌ను మార్చుకోవాలనుకుంటున్నా’అని పేర్కొన్నారు. త్వరలోనే వ్యాపార రంగంలోకి అడుగుపెడుతున్నట్లు తెలిపారు. రాజకీయాలు తన దృష్టిలో వ్యాపారం కాదని అది ప్రజాసేవ అని పేర్కొన్నారు.

కంగనా రనౌత్‌ స్వీయ దర్శకత్వంలో ‘ఎమర్జెన్సీ’ విడుదలకు సిద్ధమవుతోంది. స్వతంత్ర భారతదేశంలో చీకటి రోజులుగా పిలిచే ఎమర్జెన్సీ నాటి పరిస్థితుల్ని ఆధారంగా దీన్ని తెరకెక్కించారు ఇందులో ఆమె ఇందిరా గాంధీ పాత్రలో కనిపించనున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని