Kangana Ranaut: రూ.60 కోట్లు పెట్టి తీస్తే, రూ.6కోట్లు కూడా రాలేదు!

Kangana Ranaut: కంగనా రనౌత్‌ నటించిన తాజా చిత్రం ‘తేజస్‌’ బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన మేర రాణించలేకపోతోంది.

Published : 31 Oct 2023 19:37 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: బాలీవుడ్‌ కథానాయిక కంగనా రనౌత్‌ (Kangana Ranaut) కెరీర్‌లో పరాజయాల పరంపర కొనసాగుతోంది. ‘మణికర్ణిక’ తర్వాత ఆమె నటించిన ఏ చిత్రమూ బాక్సాఫీస్‌ వద్ద సరైన విజయాన్ని అందుకోలేకపోయింది. గత నెలలో విడుదలైన ‘చంద్రముఖి2’ ఫ్లాప్‌ను మూటకట్టుకోగా, తాజాగా సర్వేష్‌ మేరావ్‌ దర్శకత్వంలో వచ్చిన ‘తేజస్‌’ అయితే, అట్టర్‌ఫ్లాప్‌ అయింది. అందుకు ఆ సినిమాకు వస్తున్న వసూళ్లే నిదర్శనం. రూ.60 కోట్ల బడ్జెట్‌ పెట్టి తీస్తే, రూ.6 కోట్లు కూడా వసూలు కాలేదంటే, బాక్సాఫీస్‌ వద్ద ‘తేజస్‌’ టాక్‌ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సోమవారం కలెక్షన్స్‌ చూసి, ట్రేడ్‌ వర్గాలే నోరెళ్ల బెడుతున్నాయి. మొత్తంగా చూసుకుంటే రూ.50లక్షలు కూడా రాలేదట.

గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘తేజస్‌’ (Tejas) ఘోరమైన ఓపెనింగ్స్‌ను తెచ్చుకుంది. మొదటి రోజు దేశవ్యాప్తంగా కలెక్షన్స్‌ రూ.1.25కోట్లు వసూలు చేయగా, సోమవారం వచ్చిన కలెక్షన్స్‌తో కలిపి మొత్తం వసూళ్లు రూ.4.25 కోట్లుగా ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల బాలీవుడ్‌ విడుదలైన చిత్రాల్లో అతి తక్కువ కలెక్షన్స్‌ వచ్చిన సినిమాల జాబితాలో ఇప్పుడు ‘తేజస్‌’ కూడా నిలిచింది. శని, ఆదివారాల్లో చాలా థియేటర్‌లలో 10-12 మంది మాత్రమే కనిపించారట. సోమవారం పలు థియేటర్‌లు ఏకంగా షోలనే రద్దు చేశాయి. బిహార్‌కు చెందిన సినిమా పంపిణీదారు విషేక్‌ చౌహాన్‌ మాట్లాడుతూ.. ఈ ఏడాది విడుదలైన సినిమాల్లో జీరో టికెట్‌ సేల్స్‌ కారణంగా షో రద్దైన చిత్రంగా ‘తేజస్‌’ నిలిచిందన్నారు.

ట్విటర్‌ వేదికగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ, తన సినిమాలను విమర్శించిన వాళ్లపై మండిపడుతూ వార్తల్లో నిలుస్తూ వచ్చారు కంగన. 2015లో వచ్చిన ‘తను వెడ్స్‌ మను’ ఘన విజయాన్ని అందుకోగా, ఆ తర్వాత వచ్చిన ‘మణికర్ణిక’ ఆమెకు వసూళ్లతో పాటు మంచి పేరునూ తెచ్చింది. ఈ సినిమా ఆ సమయంలో ఆమె వ్యవహరించిన తీరుపై విమర్శలు సైతం వెల్లువెత్తాయి. అయితే, ‘మణికర్ణిక’లో ఆమె నటనకు ఫిదా అయిన ప్రేక్షకులు వాటిని అస్సలు పట్టించుకోలేదు. ఆ తర్వాత ఆమె నటించిన ‘జడ్జిమెంట్‌ హై క్యా’, ‘పంగా’, ‘తలైవి’, ‘ధాకడ్‌’ సహా ఇటీవల ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ‘చంద్రముఖి2’ కూడా విజయం సాధించలేదు. గత చిత్రం ‘ధాకడ్‌’ కూడా రూ.2.58 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు ‘తేజస్‌’ది కూడా అదే పరిస్థితి. ఇప్పుడు కంగనా ఆశలన్నీ ‘ఎమర్జెన్సీ’ (Emergency) పైనే. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పాత్రను కంగనా పోషిస్తున్నారు. భారతదేశం ఎమర్జెన్సీ సమయంలో చోటు చేసుకున్న సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని