వాళ్లు చాలా అందంగా ఉంటారు.. నీకు ఏమైంది?

బరువు కారణంగా ఒకానొక సమయంలో తాను ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నానని ప్రముఖ నటి మేనక పెద్ద కుమార్తె, కీర్తి సురేశ్‌ సోదరి రేవతి తెలిపారు. ఒకానొక సమయంలో భారీకాయంతో అభద్రతభావానికి గురైన రేవతి యోగాతో...

Published : 17 Feb 2021 14:51 IST

ఎంతోమంది నన్ను ఎగతాళి చేశారు: రేవతి

హైదరాబాద్‌: బరువు కారణంగా ఒకానొక సమయంలో తాను ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నానని ప్రముఖ నటి మేనక పెద్ద కుమార్తె, కీర్తి సురేశ్‌ సోదరి రేవతి తెలిపారు. ఒకానొక సమయంలో భారీకాయంతో అభద్రతభావానికి గురైన రేవతి యోగాతో బరువు తగ్గానని.. మానసికంగా దృఢంగా మారానని వెల్లడించారు. తరచూ సాధారణమైన ఫొటోలు, పోస్టులతో నెట్టింట్లో యాక్టివ్‌గా ఉండే రేవతి తాజాగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు.

‘శరీర బరువు కారణంగా ఎన్నో సంవత్సరాల నుంచి నేను మానసికంగా పోరాటం చేశాను. అందం, శరీరాకృతి విషయంలో అమ్మ, సోదరితో పోలుస్తూ చాలామంది నన్ను ఎగతాళి చేసేవాళ్లు. బరువు కారణంగా టీనేజీలో ఉన్నప్పుడు అభద్రతాభావానికి గురయ్యాను. అమ్మ, చెల్లి మాదిరిగా అందంగా లేనని నాలో నేను నచ్చచెప్పుకునేదాన్ని. నాకు ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నాయా అని ఆలోచించేదాన్ని. ఒకానొక సమయంలో నా భర్త నాకు ప్రపోజ్‌ చేయగానే.. ‘అసలు ఇతను నాలో ఏం చూసి ప్రేమిస్తున్నాడో’ అని షాక్‌ అయ్యాను. ఓరోజు ఓ పెద్దావిడ.. ‘మీ అమ్మ, చెల్లి చాలా అందంగా ఉంటారు. నీకు ఏమైంది?’ అని అడిగింది. నాకెంతో బాధగా అనిపించింది. చివరికి నేను యోగాతో బరువు తగ్గాను. యోగా వల్ల నాలో ఉన్న బలాన్ని తెలుసుకోగలిగాను. ఈ మొత్తం ప్రయాణంలో అమ్మ, కీర్తి నన్ను ప్రోత్సాహిస్తూనే ఉన్నారు.’ అని రేవతి వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని