Bheemla Nayak: ‘భీమ్లానాయక్‌’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ కేటీఆర్‌ ఆసక్తికర ట్వీట్‌

‘భీమ్లానాయక్‌’ ప్రీరిలీజ్‌ వేడుకలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని తెలంగాణ రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. పవన్‌, రానా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానున్న తరుణంలో...

Updated : 24 Feb 2022 22:50 IST

నా సోదరుల కోసం కాస్త విరామం..

హైదరాబాద్‌: ‘భీమ్లానాయక్‌’ ప్రీరిలీజ్‌ వేడుకలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని తెలంగాణ రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. పవన్‌, రానా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానున్న తరుణంలో బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లో ముందస్తు విడుదల వేడుకలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకలపై తాజాగా కేటీఆర్‌ ఓ ఆసక్తికర ట్వీట్‌ చేశారు. ‘‘రొటీన్‌ లైఫ్‌ నుంచి కాస్త విరామం తీసుకుని ‘భీమ్లానాయక్‌’ విడుదల సందర్భంగా నా సోదరులు పవన్‌కల్యాణ్‌, రానా, తమన్‌, సాగర్‌లను అభినందించడానికి వెళ్లడం ఆనందంగా ఉంది. ఈ వేడుకలో పద్మశ్రీ మొగిలయ్య, శివమణి వంటి అద్భుతమైన సంగీతకారుల్ని కలవడం సంతోషంగా ఉంది’’ అని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. కేటీఆర్‌ ట్వీట్‌పై తమన్‌ స్పందిస్తూ.. తమ కార్యక్రమానికి విచ్చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

ఆమె పాటకు పవన్‌, రానా ఫిదా..!

ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో భాగంగా పలువురు సింగర్స్‌ ‘భీమ్లానాయక్‌’లోని పాటల్ని లైవ్‌లో ఆలపించి అభిమానుల్ని ఆనందపరిచారు. ఇందులో భాగంగా, జానపద గాయకురాలు దుర్గవ్వ, సాహితి చాగంటిలు ‘అడవి తల్లి’ పాట ఆలపించగా.. ఆ పాట వినగానే పవన్‌, రానా భావోద్వేగానికి గురయ్యారు. వాళ్లతోపాటు రానా కూడా పాట పాడగా.. పవన్‌కల్యాణ్‌ పాటను ఆస్వాదిస్తూ కనిపించారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.

మన దేవుడికి జై..!

‘భీమ్లానాయక్‌’ ప్రీరిలీజ్‌ వేడుకలో బండ్ల గణేశ్‌ మాట్లాడితే చూడాలని చాలా మంది అభిమానులు ఎదురుచూశారు. కరోనా పరిస్థితులు, ఇతర కారణాల రీత్యా ‘భీమ్లానాయక్‌’ ఈవెంట్‌లో ముఖ్య అతిథులు మినహాయించి బయటవారు ఎవరూ హాజరు కాలేదు. అలా, బండ్ల గణేశ్‌ సైతం ఈ ఈవెంట్‌కు దూరంగా ఉన్నారు. దీంతో ‘రావాలి బండ్లన్న కావాలి బండ్లన్న’ అంటూ పలువురు అభిమానులు ఈవెంట్‌లో కేకలు వేశారు. ఆ వీడియో నెట్టింట దర్శనమివ్వగా బండ్లగణేశ్‌ స్పందిస్తూ.. ‘‘మీరు నాపై చూపించిన అభిమానానికి ధన్యవాదాలు. మన దేవుడు పవన్‌కల్యాణ్‌కి జై’ అని ట్వీట్‌ చేశారు.

అరచేతితో సూర్యకాంతిని ఆపలేరు: రఘురామ కృష్ణరాజు

‘భీమ్లానాయక్‌’ విడుదల నేపథ్యంలో రాష్ట్రంలోని థియేటర్లపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆంక్షలు విధించడం పట్ల వైకాపా ఎంపీ రఘురామ కృష్ణరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘సినిమా టికెట్‌ ధరలు, థియేటర్ల విషయంలో రాష్ట్రంలో ఇప్పటికే పలు నిబంధనలు ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ ప్రత్యేకంగా బెదిరింపు నోటీసులు విడుదల చేయాల్సిన అవసరం ఏముంది? ప్రభుత్వం ఇకనైనా ఇటువంటి చర్యలు మానుకోవాలి. అరచేతితో సూర్యకాంతిని ఆపలేరు! నేను ‘భీమ్లానాయక్‌’తో ఉన్నా’’ అని ట్వీట్‌ చేశారు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని