Leo: ‘లియో’ మిశ్రమ స్పందనలు.. లోకేశ్‌ కనగరాజ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..!

‘లియో’ (LEO) చిత్రానికి ప్రేక్షకుల నుంచి వస్తోన్న మిశ్రమ స్పందనలపై లోకేశ్‌ కనగరాజ్‌ స్పందించారు.  

Published : 23 Oct 2023 10:14 IST

హైదరాబాద్‌: విజయ్‌ (Vijay) - లోకేశ్‌ కనగరాజ్‌ (Lokesh Kanagaraj) కాంబినేషన్‌లో తెరకెక్కిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘లియో’ (LEO). ఎన్నో అంచనాల మధ్య గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లోకేశ్‌ తెరకెక్కించిన గత చిత్రం ‘విక్రమ్‌’తో పోలుస్తూ లియోపై పలువురు కామెంట్స్ చేస్తున్నారు. కథా, కథనం బాగున్నప్పటికీ తాము ఊహించిన స్థాయిలో ఈ చిత్రం లేదంటున్నారు.

నెటిజన్ల నుంచి వస్తోన్న మిశ్రమ స్పందనలపై తాజాగా లోకేశ్‌ కనగరాజ్‌ స్పందించారు. తమ చిత్రానికి మంచి రెస్పాన్స్‌ వచ్చినందుకు ఆనందంగా ఉందన్నారు. ప్రేక్షకుల అభిప్రాయం కోసం మరి కొన్ని రోజులు తాను ఎదురుచూస్తానని.. వాళ్ల నుంచి వచ్చే కామెంట్స్‌ను విశ్లేషించుకొంటానన్నారు. తదుపరి చిత్రంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటానన్నారు. వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్‌ నుంచి రజనీకాంత్‌ సినిమా పనులు మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు.

Social Look: రకుల్‌ బార్బీ లుక్‌.. చీరలో కృతి సొగసులు..!

‘మాస్టర్‌’ తర్వాత లోకేశ్‌ - విజయ్‌ కాంబినేషన్‌లో సిద్ధమైన చిత్రమిది. లోకేశ్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌లో భాగంగా దీనిని తీర్చిదిద్దారు. త్రిష కథానాయిక. సంజయ్‌ దత్‌, అర్జున్‌ సర్జా కీలక పాత్రలు పోషించారు. తొలిరోజు ఈ చిత్రం సుమారు రూ.140 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

క‌థేంటంటే: పార్తి అలియాస్ పార్తిబ‌న్ (విజయ్‌) హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని థియోగ్‌లో స్థిర‌ప‌డిన తెలుగువాడు. ఓ కేఫ్ న‌డుపుకొంటూ 20ఏళ్లుగా అక్క‌డే కుటుంబంతో క‌లిసి జీవనం సాగిస్తుంటాడు. అత‌ని భార్య స‌త్య (త్రిష). వీరిది ప్రేమ వివాహం. వీరి ప్రేమ‌కు గుర్తుగా ఓ బాబు.. పాప.  హాయిగా.. సంతోషంగా సాగిపోతున్న‌ పార్తి జీవితం ఓ క్రిమిన‌ల్‌ ముఠా వ‌ల్ల‌ త‌ల‌కిందుల‌వుతుంది. ఒక రోజు రాత్రి త‌న కేఫ్‌లోకి వ‌చ్చి డ‌బ్బులు దోచుకెళ్లే ప్ర‌య‌త్నం చేసిన ఆ ముఠాను అక్క‌డిక్క‌డే కాల్చి చంపేస్తాడు పార్తి. దీంతో పోలీసులు అత‌న్ని అరెస్టు చేస్తారు. అయితే త‌ను ఆత్మ‌ర‌క్ష‌ణ కోస‌మే వాళ్ల‌ను చంపిన‌ట్లు కోర్టులో తేల‌డంతో నిర్దోషిగా విడుద‌ల‌వుతాడు. కానీ, ఓ వార్తా ప‌త్రిక‌లో అత‌ని ఫొటో చూసిన ఆంటోని దాస్‌ (సంజ‌య్ ద‌త్‌) గ్యాంగ్ పార్తిని వెతికి ప‌ట్టుకొని.. చంపేందుకు హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌కు బ‌య‌లుదేరుతుంది. దీనికి కార‌ణం 20ఏళ్ల క్రితం క‌నిపించ‌కుండా పోయిన ఆంటోని కొడుకు లియోలా పార్తిబ‌న్ ఉండ‌ట‌మే. మ‌రి ఈ లియో ఎవ‌రు? అత‌ను.. పార్తిబ‌న్ ఒక్క‌డేనా? లేక ఇద్ద‌రా? సొంత కొడుకునే చంపాల‌ని ఇటు లియో తండ్రి ఆంటోని, అత‌ని అన్న హెరాల్డ్ దాస్ (అర్జున్‌) ఎందుకు ప్ర‌య‌త్నిస్తుంటారు? వీళ్ల‌కు లియోకూ ఉన్న వైరం ఏంటి? పార్తి గ‌త‌మేంటి? ఆంటోని గ్యాంగ్ నుంచి త‌న కుటుంబాన్ని కాపాడుకునేందుకు ఏం చేశాడు? అన్న‌ది తెర‌పై చూసి తెలుసుకోవాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని