Mahesh babu: రాజమౌళితో కంటే ముందు ఆ దర్శకుడితో మహేశ్‌ సినిమా!

రాజమౌళి-మహేశ్‌ బాబు (Mahesh babu) కాంబినేషన్‌లో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే. దీని కంటే ముందు మహేశ్‌ మరో దర్శకుడితో సినిమా చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Published : 27 Sep 2023 14:46 IST

హైదరాబాద్‌: టాలీవుడ్‌ ప్రేక్షకులు ఎదురుచూస్తున్న చిత్రాల్లో మహేశ్‌ బాబు నటిస్తోన్న ‘గుంటూరు కారం’ ఒకటి. ఇది సంక్రాంతి కానుకగా 2024 జనవరి 12న విడుదల కానుంది. దీని తర్వాత రాజమౌళితో (Rajamouli) మహేశ్‌ బాబు సినిమా చేయనున్నారు. అయితే, ఈ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కడానికి చాలా సమయం పట్టేలా కనిపిస్తోంది. దీంతో ‘గుంటూరు కారం’ తర్వాత మహేశ్‌ ఏ సినిమా చేస్తారా అని అందరిలో ఆసక్తి నెలకొంది. తాజాగా దీనికి సంబంధించి ఓ వార్త బయటకు వచ్చింది. రాజమౌళి సినిమాకు సంబంధించి ప్రస్తుతం స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతోంది. మొదట దీన్ని ఈ ఏడాది చివర్లో ప్రారంభించనున్నారని వార్తలు వచ్చాయి. అయితే, ఇంకా ప్రీ ప్రొడక్షన్‌ పనులు పూర్తి కాలేదట. వీటికి మరో ఆరు నెలల సమయం పట్టొచ్చని అంచనా వేస్తున్నారు. దీని కంటే ముందు మహేశ్‌ మరో సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీలో వేగంగా షూటింగ్‌ పూర్తి చేసే దర్శకుడుగా పేరున్న అనిల్‌ రావిపూడితో  (Anil Ravipudi) ఆయన సినిమా చేయాలని భావిస్తున్నారట. 

హాలీవుడ్‌ స్టంట్‌ డైరెక్టర్‌తో యశ్‌.. సంబరపడుతోన్న అభిమానులు..

అనిల్‌ రావిపూడి ప్రస్తుతం బాలకృష్ణతో ‘భగవంత్‌ కేసరి’ తీస్తున్నారు. ఇప్పటికే పనులన్నీ పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబర్‌ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇది విడుదలైయ్యాక ఆయన మహేశ్‌తో (Mahesh babu) ఓ స్టోరీ గురించి చర్చించనున్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇదే నిజమైతే రాజమౌళి కంటే ముందు మహేశ్‌ బాబు-అనిల్‌ రావిపూడి సినిమా రావొచ్చు. ఇక గతంలో వీళ్లిద్దరి కాంబోలో ‘సరిలేరు నీకెవ్వరు’ వచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) ఫస్ట్‌ సింగిల్‌ దసరా కంటే ముందే విడుదల చేస్తామని నిర్మాత నాగవంశీ చెప్పారు. అలాగే ఈ చిత్రం కచ్చితంగా విజయం సాధిస్తుందని రాజమౌళి సినిమాల వసూళ్లకు దగ్గరగా దీనికి కూడా కలెక్షన్లు వస్తాయని ఆయన మరోసారి చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని