ప్రీతి జింటా చేయలేనన్నారు: విష్ణు

‘మోసగాళ్లు’లో మొదట ప్రీతిజింటానే అనుకున్నానని కాకపోతే ఆమె సున్నితంగా తిరస్కరించారని నటుడు మంచు విష్ణు తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ కుంభకోణాన్ని ఆధారంగా చేసుకుని...

Updated : 26 Feb 2021 12:19 IST

హైదరాబాద్‌: ‘మోసగాళ్లు’లో మొదట ప్రీతిజింటానే అనుకున్నానని కాకపోతే ఆమె సున్నితంగా తిరస్కరించారని నటుడు మంచు విష్ణు తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ కుంభకోణాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ‘మోసగాళ్లు’లో విష్ణు, కాజల్‌ అగర్వాల్‌ ప్రధాన పాత్రలు పోషించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను మెగాస్టార్‌ చిరంజీవి విడుదల చేశారు. ట్రైలర్‌ రిలీజ్‌ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో విష్ణు మాట్లాడుతూ.. చిత్రానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను బయటపెట్టారు.

‘‘2015లో ఓ అక్కాతమ్ముడు కలిసి గుజరాత్‌, ముంబయిల్లో ఉంటూనే.. ఒక సులభమైన ఆలోచనతో అమెరికాలో రూ.4వేల కోట్ల వరకు స్కామ్‌ చేశారు. వాళ్లు అదెలా చేశారు?ఆ డబ్బు ఎక్కడుంది? ఇంతకి వాళ్లు దొరికారా?లేదా?అన్నది ఈ చిత్ర కథాంశం. అమెరికాలో నిజంగా జరిగిన కథ ఇది. ఈ కుంభకోణం వల్ల అక్కడ కొన్ని వేల కుటుంబాలు అతలాకుతలం అయ్యాయి’’

‘‘ఈ సినిమాలో కాజల్‌ నాకు అక్క పాత్రలో నటించారు. నిజం చెప్పాలంటే ఆమె ఇందులో మెయిన్‌రోల్‌. సునీల్‌శెట్టి పోషించిన పోలీస్‌ పాత్రను మొదట్లో నేనే చేయాలనుకున్నాను. కాకపోతే కొన్ని కారణాల వల్ల అది సాధ్యం కాలేదు. అలాగే, ఈ కథ అనుకున్నప్పుడు కాజల్‌ పోషించిన పాత్ర కోసం మొదట ప్రీతిజింటాను సంప్రదించాను. లాస్‌ఏంజెల్స్‌లో ఆమెని కలిసి ‘మోసగాళ్లు’ స్క్రిప్ట్‌ చెప్పాను. కథ విన్నాక.. ‘వద్దు విష్ణు.. ‘మోసగాళ్లు’ విడుదలయ్యాక అమెరికాలో ఉన్న వాళ్లందరికీ నువ్వు విలన్‌లా కనిపిస్తావు’ అని నచ్చజెప్పడానికి ప్రయత్నించింది. వెంటనే నేను..‘లేదండి.. ఇది నిజంగా జరిగిన కథ. విలన్‌, హీరో అనేది పక్కన పెడితే మనం రియల్‌స్టోరీని ప్రేక్షకులకు చూపించాలి అనేది నా ఉద్దేశం’ అని చెప్పాను. ‘నా కుటుంబమంతా ఇక్కడే సెటిల్‌ అయ్యింది. నా భర్తకు ఈ ప్రాంతంలో ఇల్లు ఉంది. ఒకవేళ నేను ఈ కథ చేస్తే ఇక్కడివాళ్లు నన్ను ఇబ్బందులకు గురిచేస్తారు. ఏం అనుకోకు విష్ణు.. నేను ఈ సినిమా చేయలేను’ అని సున్నితంగా ఈ చిత్రాన్ని తిరస్కరించారు. దాంతో వెంటనే నేను కాజల్‌కు ఫోన్‌ చేసి ‘మోసగాళ్లు’లో నటిస్తావా? నీకు ఓకేనా?అని అడిగాను. తను ఓకే అంది. స్టార్‌ హీరోయిన్‌ అయి ఉండి.. వేరే హీరో సరసన అక్కగా నటించడమంటే మామూలు విషయం కాదు. అందుకు ఆమెకు థ్యాంక్స్‌ చెప్పాలి’’ అని విష్ణు వివరించారు.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని