Mansoor Ali Khan: త్రిషపై వ్యాఖ్యలు.. సారీ చెప్పనన్న మన్సూర్‌ అలీఖాన్‌

తానేంటో తమిళనాటు ప్రజలకు తెలుసని, వారి మద్దతు తనకు ఉందని నటుడు మన్సూర్‌ అలీఖాన్‌ పేర్కొన్నారు. త్రిషకు తాను సారీ చెప్పనని అన్నారు.

Published : 21 Nov 2023 22:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: హీరోయిన్‌ త్రిష (Trisha) గురించి తాను తప్పుగా ఏం మాట్లాడలేదని, అందుకే క్షమాపణ చెప్పనని నటుడు మన్సూర్‌ అలీఖాన్‌ (Mansoor Ali Khan) అన్నారు. తానేంటో తమిళనాడు ప్రజలకు తెలుసని, వారి మద్దతు తనకు ఉందని పేర్కొన్నారు. త్రిషపై ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. మన్సూర్‌ అనుచితంగా మాట్లాడారంటూ దక్షిణ భారత చలన చిత్ర నటీనటుల అసోసియేషన్‌ (నడిగర్ సంఘం‌) ఆయన్ను పాక్షికంగా నిషేధించింది. తన తప్పు తెలుసుకుని త్రిషకు క్షమాపణ చెబితే బ్యాన్‌ తొలగించనున్నట్లు పేర్కొంది. దీనిపై స్పందించిన మన్సూర్‌ చెన్నైలో మంగళవారం ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘నడిగర్‌ సంఘం తప్పు చేసింది. ఇలాంటి సంఘటన జరిగినప్పుడు వారు వివరణ అడగాలి. విచారణ జరపాలి. కానీ, వారు అవేం చేయలేదు. నాకు వ్యతిరేకంగా ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను వెనక్కి తీసుకునేందుకు నడిగర్‌ సంఘానికి నేను నాలుగు గంటలు సమయమిస్తున్నా. నేను సారీ చెప్పాలన్నారు. నేను క్షమాపణ చెప్పే వ్యక్తిలా కనిపిస్తున్నానా? నాకు తమిళనాడు ప్రజల సపోర్ట్‌ ఉంది’’ అని అన్నారు. ‘సినిమాల్లో హత్య చేస్తే నిజంగానే చేసినట్లా? సినిమాల్లో రేప్‌ చేస్తే నిజంగానే చేసినట్లా?’ అని సమర్థించుకున్నారు.

పెద్దోళ్లు అలా అన్నారు.. కుర్రాళ్లు సీక్వెల్‌ అడుగుతున్నారు: వెంకటేశ్‌

అసలేం జరిగిందంటే..?

మన్సూర్‌ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..  గతంలో తాను ఎన్నో రేప్‌ సీన్లలో నటించానని.. ‘లియో’లో అవకాశం వచ్చినప్పుడు త్రిషతో కూడా అలాంటి సన్నివేశం ఉంటుందని అనుకున్నట్లు చెప్పారు. ఆ సన్నివేశం లేకపోవడంతో బాధగా అనిపించిందన్నారు. సంబంధిత వీడియో త్రిష దృష్టికి వెళ్లగా ఆమె సోషల్‌ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారి వల్లే అందరికీ చెడ్డపేరు వస్తుందని పేర్కొన్నారు. ‘లియో’ దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌, ప్రముఖ హీరో చిరంజీవి, నితిన్‌, రోజా, రాధిక, గాయని చిన్మయి తదితరులు మన్సూర్‌ వ్యాఖ్యలను ఖండించారు. త్రిషకు తమ మద్దతు ఉంటుందని తెలిపారు. మరోవైపు, మన్సూర్‌ వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్‌ సీరియస్‌గా తీసుకుంది. ఈ విషయాన్ని సుమోటోగా స్వీకరించి.. మన్సూర్‌పై కేసు నమోదు చేయాలని తమిళనాడు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. మహిళల గురించి ఈ విధంగా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తే సహించేదిలేదని తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని