MAA Election: నాగబాబు మాటలు బాధించాయి

‘‘గడిచిన నాలుగేళ్ల కాలాన్ని చూసుకుంటే ‘మా’ మసకబారిపోయింది’’ అంటూ శుక్రవారం జరిగిన

Updated : 26 Jun 2021 15:58 IST

‘మా’ రాజకీయ వ్యవస్థ కాదు
వారిని చూసి షాకయ్యా
‘మా’ అధ్యక్షుడు నరేష్‌ మీడియా సమావేశం

హైదరాబాద్‌: ‘‘మా’ మసకబారిపోయింది’’ అంటూ నటుడు నాగబాబు చేసిన వ్యాఖ్యలు ఎంతో బాధించాయని మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు నరేశ్‌ అన్నారు. నాగబాబు తనకి మంచి మిత్రుడని.. ‘మా’ చేపట్టిన అన్ని అభివృద్ధి కార్యక్రమాల గురించి సినీ పెద్దలందరికీ ఎప్పటికప్పుడు సమాచారం అందించామని నరేశ్‌ తెలిపారు. తన ప్యానల్‌ని పరిచయం చేస్తూ తాజాగా నటుడు ప్రకాశ్‌రాజ్‌ ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి కౌంటర్‌గా శనివారం ఉదయం నరేశ్‌ మీడియా ముందుకు వచ్చారు. తాను అధ్యక్షుడిగా ‘మా’ ఇప్పటివరకూ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.

జీవితంలో అధ్యక్షుడివి కాలేవు అన్నారు..

‘నాకు కథలు చెప్పడం అలవాటు లేదు. కాగితాలతో రావడం అలవాటు. ఎవర్నో ధూషించడానికో, ఎవరిపైనో కాలు దువ్వడానికో ఈ సమావేశం పెట్టలేదు. ‘మా’ అధ్యక్షుడిగా పోటీ చేయమని నన్ను ఎవ్వరూ అడగలేదు. నాకెంతో ఆప్తురాలైన సీనియర్‌ నటి జయసుధకు అండగా ఉండాలని.. ‘మా’లో మార్పు తీసుకురావాలని ఎన్నికలకు వెళ్లాను. కానీ గడిచిన ఎన్నికల్లో ఆమె ఓడిపోయారు. ఆవిషయం నన్ను ఎంతో బాధించింది. నువ్వు జీవితంలో అధ్యక్షుడివి కాలేవు అన్నారు. కానీ, ప్రెసిడెంట్‌ అయి ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టాను.’

‘నరేశ్‌ అంటే ఏమిటో చెప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే నేను సినిమా వాడిని. సినిమా బిడ్డను. సినీ పరిశ్రమకు ఎలాంటి సమస్య వచ్చినా మా కుటుంబం ఎప్పుడూ ముందు ఉంటుంది’

ఎవరు వచ్చినా స్వాగతిస్తాం..

‘ప్రకాశ్‌రాజ్‌ నాకు మంచి మిత్రుడు. ఎప్పుడో మూడు నెలల క్రితమే నాకు ఫోన్‌ చేసి ఈ ఏడాది ఎన్నికల్లో తాను పోటీ చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. తెలుగు సినిమాల్లో నటించేవాళ్లు ఎవరైనా పోటీ చేయవచ్చని చెప్పాను. మంచు విష్ణు.. ఇండస్ట్రీ బిడ్డ.. కష్టనష్టాలు చూడకుండా సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఆయన కూడా ఈ ఏడాది ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు చెప్పారు. ఎవరు వచ్చినా స్వాగతిస్తాం. ‘మా’ రాజకీయ వ్యవస్థ కాదు. చిరంజీవి, కృష్ణంరాజు, కృష్ణ వంటి ఎంతోమంది సినీ పెద్దలు.. మెట్టు మెట్టు పేర్చి దీనిని స్థాపించారు. ఇప్పటివరకూ ఉన్న అధ్యక్షులందరూ ‘మా’ అభివృద్ధి కోసమే ఎంతో కష్టపడి పనిచేశారు’

మేమంతా షాకయ్యాం..

‘శుక్రవారం ప్రకాశ్‌రాజ్.. తన ప్యానల్‌ సభ్యులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మీటింగ్‌ పెట్టడాన్ని నేను తప్పుపట్టడం లేదు. కానీ, ప్రస్తుతం జనరల్‌ బాడీలో ఉన్న సభ్యులే తమ పదవీ కాలం ముగియక ముందే ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌లో చేరి.. నిన్న జరిగిన సమావేశంలో కనిపించడం చూసి మేమంతా షాకయ్యాం. అదే సమావేశంలో నటుడు నాగబాబు మాట్లాడుతూ.. ‘మా’ మసకబారిపోయిందని వ్యాఖ్యలు చేశారు. ఆయన నాకు ఆప్తమిత్రుడు. నేను అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాను. ప్రతి విషయాన్ని సినీ పెద్దలందరికీ ఎప్పటికప్పుడు తెలియజేశాను. అలాంటిది నాగబాబు.. ‘మా’ మసకబారిపోయిందని వ్యాఖ్యానించడం తప్పు. లోకల్‌ నాన్‌లోకల్‌ అని మేము అనలేదు. ఇప్పుడు కూడా ఎన్నిక ఏకగ్రీవం కావాలని మేము కోరుకుంటున్నాం’

సెప్టెంబర్‌లోనే ఎన్నికలు..
‘‘ఎన్నికల గురించి సమాచారం అడుగుతూ ఏప్రిల్‌ 9న ‘మా’కు ప్రకాశ్‌రాజ్‌ ఓ లేఖ రాశారు. దానికి మేము ఏప్రిల్‌ 12న సమాధానం కూడా ఇచ్చాం. ‘మా’ అధ్యక్ష ఎన్నిక సెప్టెంబర్‌ టు సెప్టెంబర్‌లోనే జరగాలని కొన్నేళ్ల క్రితం ప్రముఖ రచయిత పరిచూరి గోపాలకృష్ణ ప్రతిపాదన పెట్టారు. ఆయన పెట్టిన ప్రతిపాదనకు అందరూ ఓకే అన్నారు. ఆ క్రమంలోనే ‘మా’ ఎన్నికలు జరుగుతున్నాయి. నిన్న జరిగిన సమావేశంలో ‘మా’లో ఉన్న సభ్యుల సంఖ్య చెప్పడంలో ప్రకాశ్‌రాజ్‌ తడబడ్డారు. ఆయన దగ్గర సరైన డేటా లేదు. ‘మా’లో మేము ఇప్పటివరకూ చేసిన పనుల గురించి చెప్పడం కోసమే డేటాతో సహా వచ్చాను’

‘మా’పై నమ్మకం లేకపోతే ఎలా చేరతారు?
‘‘మా’లో మొత్తం 914 మంది జీవితకాల సభ్యులు ‌, 29 మంది అసోసియేట్‌ సభ్యులు, 18 మంది సీనియర్‌ సిటిజన్స్‌ ఉన్నారు. మునుపెన్నడూ లేని విధంగా ఇంటింటికీ వెళ్లి సర్వే చేసి సుమారు 728 మంది సభ్యులకు రూ.3 లక్షలతో జీవిత బీమా చేయించాం. ఇప్పటివరకూ మృతిచెందిన 16 మంది సినీ ఆర్టిస్టుల కుటుంబాలకు రూ.50 లక్షలు అందజేశాం. 314 మంది సభ్యులకు ఆరోగ్య బీమా చేయించాం. రూ.3 వేలు ఉన్న పింఛన్‌ను రూ.6 వేలకు పెంచాం. ‘మా’ సభ్యత్వ నమోదును రూ.లక్ష నుంచి రూ.90 వేలకు తగ్గించాం. కొత్తగా 87మంది సభ్యులు అసోసియేషనలో చేరారు.‘మా’పై నమ్మకం లేకపోతే ఎలా చేరతారు?. జాబ్‌ కమిటీ ద్వారా 35 మంది వృద్ధ కళాకారులకు సినిమాల్లో అవకాశం కల్పించాం. కరోనా కష్టకాలంలో ‘మా’ అసోసియేషన్‌కు రూ.30 లక్షల విరాళాలు అందాయి. అందులో జీవిత రూ.10 లక్షలు అందించారు. వాటిలో రూ.లక్షను చిరంజీవి ఏర్పాటు చేసిన సీసీసీకి పంపిచాం. మేము చేసిన పనికి చిరు ఫోన్‌ చేసి అభినందించారు. అలాగే, నేను జాయింట్‌ సెక్రటరీగా ఉన్నప్పుడు అసోసియేషన్‌లో నిధులు తక్కువగా ఉన్నాయని చెప్పగానే మా అమ్మ విజయనిర్మల రూ.5 లక్షలు విరాళం ఇచ్చారు. ఆ తర్వాత కూడా విరాళాలు అందించారు. ఇలా ఆమె మొత్తం రూ.30 లక్షలు ఇచ్చారు. అసోసియేషన్‌లో నేను 20 ఏళ్లుగా సభ్యుడిగా ఉన్నప్పటికీ ఎలాంటి పదవీ ఆశించలేదు. కావాలంటే మేమంతా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మేము పదవుల కోసం ఆశపడడం లేదు. సాయం అడిగిన ప్రతి ఒక్కరికీ నా వంతు సాయం చేస్తూనే ఉన్నాను. కానీ, ఇప్పుడు మేము చేసిన పనుల్ని తక్కువగా చేసి మమ్మల్ని ఎందుకు హింసిస్తున్నారు. మేము హింసకు లొంగం. కృష్ణంరాజుగారికి ఫోన్‌ చేసి ప్రెస్‌మీట్‌ పెడుతున్నట్లు చెప్పాను. ‘‘మా’ ఒక దిగ్గజం. వంద ఏనుగుల బలం ఇందులో ఉంది. ‘మా’ని కూల్చడం ఎవరికీ సాధ్యం కాదు’ అని కృష్ణంరాజు చెప్పమన్నారు’’ అని నరేశ్‌ వివరించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని