Kalki 2898 AD: ‘ఆదిపురుష్‌’ విషయంలో జరిగిన తప్పు ‘కల్కి’కి జరగకూడదని..

Kalki 2898 AD: ప్రభాస్‌, దీపిక పదుకొణె, కమల్‌హాసన్‌, అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్న ‘కల్కి’ గ్లింప్స్‌నకు సంబంధించిన అభిప్రాయాలను దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ సమీక్షిస్తున్నారు.

Published : 31 Jul 2023 16:49 IST

హైదరాబాద్‌: ప్రభాస్‌ (Prabhas) కథానాయకుడిగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). దీపిక పదుకొణె (Deepika Padukone) కథానాయిక. ఇటీవల కామికాన్‌ వేదికగా విడుదల చేసిన ఫస్ట్‌ గ్లింప్స్‌నకు విశేష ఆదరణ లభించింది.  హాలీవుడ్‌ స్థాయిలో విజువల్స్‌ ఉన్నాయని అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. అదే సమయంలో ప్రభాస్‌ ‘కల్కి’ పోస్టర్‌పై చాలా మంది పెదవి విరిచారు. ప్రభాస్‌ స్టిల్‌ మరీ ఫొటోషాప్‌లో చేసినట్లు ఉందని విమర్శలు వచ్చాయి. ఈ వ్యవహారాన్ని ‘కల్కి’టీమ్‌ కాస్త సీరియస్‌గా తీసుకుంది. గ్లింప్స్‌నకు సంబంధించిన విజువల్‌ ఎఫెక్ట్స్‌ (వీఎఫ్‌ఎక్స్‌) ఎలా ఉన్నాయి? అన్న దానిపై అభిప్రాయసేకరణ కోరుతోంది.

ఈ క్రమంలో చిత్ర నిర్మాతల్లో ఒకరైన ప్రియాంక దత్‌ ఓ ఫొటోను షేర్‌ చేశారు. అందులో నాగ్‌ అశ్విన్‌ ఏదో చూస్తూ కనిపిస్తుండగా, ఫొటోపై ‘టీజర్‌ వీఎఫ్‌ఎక్స్‌ రివ్యూస్‌’ అని క్యాప్షన్‌ ఇచ్చారు. ‘కల్కి’ గ్లింప్స్‌పై వివిధ వర్గాల నుంచి వచ్చిన అభిప్రాయాలను నాగ్‌ అశ్విన్‌ నోట్‌ చేసుకుంటూ కనిపించారు. ప్రస్తుతం ఈ ఫొటో సామాజిక మాధ్యమాల వేదికగా వైరల్‌ అవుతోంది. ముఖ్యంగా ప్రభాస్‌ ఫ్యాన్స్‌ నాగ్‌ అశ్విన్‌ చేస్తున్న పనికి మెచ్చుకుంటున్నారు. ‘మా సూచనలు, సలహాలను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నందుకు థ్యాంక్స్‌ నాగ్‌ అశ్విన్‌’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ‘ఆది పురుష్‌ టీజర్‌పై విమర్శలు రావడంతో ఎలాగో దాన్ని ఆల్ట్రేషన్‌ చేశారు. దర్శక, నిర్మాతలు నిరంతరం సమీక్ష చేసుకుంటూ సాగితే మంచి సినిమాలు వస్తాయి’ అని మరొకరు కామెంట్‌ చేశారు. ‘ప్రేక్షకుల అభిప్రాయాలను గౌరవిస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఓంరౌత్‌ పనికి నేను నిజంగా షాకయ్యా’ అని  మరొకరు పేర్కొన్నారు.

ఈ వారం థియేటర్‌/ఓటీటీ చిత్రాలివే!

‘ఆది పురుష్‌’ టీజర్‌ చూసి, ‘ఇదేం సినిమా.. ఇవేం వీఎఫ్‌ఎక్స్‌’అంటూ అభిమానులు, సినీ ప్రేమికులు ఓంరౌత్‌ ఆయన టీమ్‌ను ఏకిపారేశారు. కార్టూన్‌ సినిమాలాగా ఉందంటూ విమర్శలు గుప్పించారు. దీంతో చిత్ర బృందం సినిమా విడుదలను వాయిదా వేసి, వీఎఫ్‌ఎక్స్‌ షాట్‌లకు మెరుగులు దిద్దింది. వందల కోట్లు ఖర్చు చేసి, సానపట్టినా ‘ఆది పురుష్‌’ బాక్సాఫీస్‌ వద్ద మెరవలేదు. దీంతో ప్రభాస్‌ అభిమానులు ‘సలార్‌’, ‘కల్కి’లపైనే తమ ఆశలన్నీ పెట్టుకున్నారు. ఈ క్రమంలో నాగ్‌ అశ్విన్‌ అభిప్రాయ సేకరణ చేసి, తప్పులు ఉంటే దిద్దుకునేందుకు చేస్తున్న ప్రయత్నాన్ని అభినందిస్తున్నారు. ఇక ‘కల్కి 2898 ఏడీ’ విషయానికొస్తే, సీనియర్‌ నటుడు కమల్‌హాసన్‌ ఇందులో ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అమితాబ్‌ బచ్చన్‌, పశుపతి, దిశా పటానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వనీదత్‌ నిర్మిస్తున్నారు. సంతోష్‌ నారాయణన్‌ సంగీతం అందిస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని