‘ఉప్పెన’కు రాకపోవడానికి కారణమదే: నాగబాబు

మెగా కాంపౌండ్‌ నుంచి ఎవరైనా కొత్త హీరో ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారంటే అతన్ని సపోర్ట్‌ చేయడానికి కుటుంబమంతా కలిసి ప్రీరిలీజ్‌, ఆడియో వేడుకలకు రావడం ఎన్నో సందర్భాల్లో తెలుగు ప్రేక్షకులు చూశారు....

Published : 20 Feb 2021 11:52 IST

హైదరాబాద్‌: మెగా కాంపౌండ్‌ నుంచి ఎవరైనా కొత్త హీరో ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారంటే అతన్ని సపోర్ట్‌ చేయడానికి కుటుంబమంతా కలిసి ప్రీరిలీజ్‌, ఆడియో వేడుకలకు రావడం ఎన్నో సందర్భాల్లో తెలుగు ప్రేక్షకులు చూశారు. అయితే, కొన్నిరోజుల క్రితం జరిగిన ‘ఉప్పెన’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు మెగాస్టార్‌ చిరంజీవి మాత్రమే ముఖ్య అతిథిగా హాజరై నటీనటులు, చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. చిత్రబృందంపై ప్రశంసల జల్లు కురిపించారు. ప్రీరిలీజ్‌ వేడుకకు తమ కుటుంబానికి చెందిన హీరోలు హాజరు కాకపోవడానికి గల కారణాన్ని నాగబాబు వెల్లడించారు.

‘‘ఉప్పెన’ ప్రీరిలీజ్‌ వేడుకకు మా కుటుంబమంతా రాకపోవడానికి ప్రత్యేకమైన కారణమంటూ ఏమీ లేదు. వైష్ణవ్‌ని సోలోగానే ప్రెజెంట్‌ చేయాలని మేము అనుకున్నాం. అందుకే మా ఫ్యామిలీ నుంచి అన్నయ్య తప్ప మరెవరూ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు రాలేదు. ఆఖరికి వైష్ణవ్‌ తేజ్‌ సోదరుడు సాయిధరమ్‌ తేజ్‌ కూడా ఆ వేడుకల్లో భాగం కాలేదు. మా అందరికీ మార్గదర్శి అన్నయ్యే కాబట్టి ఆయనే ఆ ఫంక్షన్‌కు ముఖ్యఅతిథిగా వెళ్లారు’ అని నాగబాబు ఇటీవల వివరించారు. ‘ఉప్పెన’ విడుదలయ్యాక ప్రమోషన్స్‌లో భాగంగా బయటకు వచ్చిన మెగా కజిన్స్‌ స్పెషల్‌ చిట్‌చాట్‌ వీడియో ప్రేక్షకులను అలరించింది. ఇటీవల జరిగిన ఈ సినిమా విజయోత్సవ వేడుకల్లో రామ్‌చరణ్‌ సందడి చేసిన విషయం తెలిసిందే.

ఇక, సినిమా విషయానికి వస్తే ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫిబ్రవరి 12న ‘ఉప్పెన’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వైష్ణవ్‌ తేజ్‌, కృతిశెట్టి జంటగా నటించిన ఈ చిత్రాన్ని బుచ్చిబాబు తెరకెక్కించారు. ఫీల్‌గుడ్‌ లవ్‌ స్టోరీగా విడుదలైన ఈ సినిమా మంచి వసూళ్లను రాబట్టి  బాక్సాఫీస్‌ వద్ద దూసుకెళ్తోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని