Naresh: రమ్య విషయంలో అప్పట్లోనే భయపడి నోటీస్‌ ఇచ్చా: నరేశ్‌

తన భార్య రమ్య రఘుపతికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలతో తనకు ఎలాంటి సంబంధం లేదని నటుడు నరేశ్‌ స్పష్టం చేశారు. రంభ ఉన్నతి అరోమా ప్రైవేటు లిమిటెడ్‌ పేరుతో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు ...

Updated : 23 Feb 2022 12:08 IST

నాకెలాంటి సంబంధం లేదు.. మాకు ఇవ్వడమే తెలుసు.. తీసుకోవడం కాదు

హైదరాబాద్‌: రమ్య రఘుపతికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలతో తనకు ఎలాంటి సంబంధం లేదని నటుడు నరేశ్‌ స్పష్టం చేశారు. రంభ ఉన్నతి అరోమా ప్రైవేటు లిమిటెడ్‌ పేరుతో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు రమ్య తమ నుంచి అప్పులు తీసుకుందని.. కానీ వాటిని తిరిగి చెల్లించడం లేదంటూ పలువురు బాధితులు మంగళవారం ఉదయం పోలీసుల్ని ఆశ్రయించారు. ఈ క్రమంలో నరేశ్‌కు సైతం బాధితుల నుంచి ఫోన్‌కాల్స్‌ వస్తోన్న తరుణంలో ఆయన ఓ ప్రత్యేక వీడియో విడుదల చేశారు. ఈ మొత్తం వ్యవహారంతో తనకెలాంటి సంబంధం లేదని, ఏడేళ్ల నుంచే తానూ, రమ్య దూరంగా ఉంటున్నామని పేర్కొన్నారు.

‘‘రమ్య రఘుపతి ఆర్థిక లావాదేవీలకు సంబంధించి మీడియాలో వార్తలు రావడంతో బంధుమిత్రులు, మీడియా మిత్రుల నుంచి నాకు వరుస ఫోన్స్‌ కాల్స్‌ వస్తున్నాయి. వారందరికీ ఈ విషయంపై స్పష్టత ఇచ్చేందుకే మీ ముందుకు వచ్చాను. ఈ మొత్తం వ్యవహారంలో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఇలా జరిగిందనే విషయం కూడా రెండు రోజుల ముందు వరకూ నాకు తెలియదు. మా వివాహమై తొమ్మిదేళ్లయ్యింది. రమ్య ఈ విధంగా అప్పులు చేస్తోందని తెలిసి.. భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయని ఊహించి 7 ఏళ్ల నుంచి ఆమెకు దూరంగా ఉన్నాను. మేమిద్దరం ఆనాటి నుంచి విడివిడిగా ఉంటున్నాం. మా జీవితాలు మేము జీవిస్తున్నాం. ప్రస్తుతం మా ఇద్దరికీ ఎలాంటి సంబంధం లేదు. ఇటీవల ఆమెపై ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కొన్ని వార్తలు రావడంతో నాకెంతో భయం వేసింది. దాంతో మూడు నెలల క్రితమే పత్రికల్లో నేను ఓ పబ్లిక్‌ నోటీస్‌ కూడా ఇచ్చాను. ఆర్థికపరమైన, ఏ ఇతర అంశాల్లోనూ రమ్యతో నాకు కానీ, నా బంధువులకు కానీ ఎలాంటి సంబంధం లేదని ఆ నోటీస్‌లో పేర్కొన్నాను. గత రెండు మూడు రోజులుగా పలువురు బాధితులు పోలీసుల్ని ఆశ్రయిస్తున్నారు. దాంతో పోలీసుల నుంచి నాకు ఫోన్స్‌ వచ్చాయి. ఈ వ్యవహారం గురించి నాకు తెలియదని, కాకపోతే ఈ విషయంలో నాకు చేతనైనంత సాయం చేస్తానని పోలీసులకు చెప్పాను. కాబట్టి మరోసారి చెబుతున్నా..  నాకూ, నా కుటుంబానికి ఈ విషయంలో ఎలాంటి సంబంధం లేదు. ఇలాంటి ఫైనాన్స్‌ విషయాల్లో మా కుటుంబం ఎప్పుడూ భాగం కాలేదు. ఎందుకంటే మా కుటుంబానికి ఇవ్వడం మాత్రమే తెలుసు. తీసుకోవడం తెలీదు. ఎవర్నీ బాధ పెట్టడం మాకు ఇష్టం లేదు’’ అని నరేశ్‌ పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని