‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘పుష్ప’ చూడలేదు.. ఎందుకంటే: సీనియర్‌ నటుడు వ్యాఖ్యలు

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR), ‘పుష్ప’ (Pushpa) చిత్రాలను తాను చూడలేదని బాలీవుడ్‌ ప్రముఖ నటుడు తెలిపారు. ఆ సినిమాలు చూడటం వల్ల థ్రిల్‌ తప్ప ప్రేక్షకులు ఏం లభిస్తుందని ఆయన ప్రశ్నించారు.

Published : 27 Sep 2023 14:55 IST

ముంబయి: భారతీయ చలన చిత్ర పరిశ్రమలో బిగ్గెస్ట్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్స్‌గా ఇటీవల పేరు తెచ్చుకున్న చిత్రాలు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ‘పుష్ప ది రైజ్‌’. ఈ రెండు చిత్రాలను ఉద్దేశిస్తూ బాలీవుడ్‌కు చెందిన ఓ సీనియర్‌ నటుడు వ్యాఖ్యలు చేశారు. తాను ఇప్పటివరకూ ఆ చిత్రాలు చూడలేదని అన్నారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలపై వరుస కథనాలు ప్రచురితమవుతున్నాయి. ఇంతకీ ఆ నటుడు ఎవరంటే..?

బాలీవుడ్‌లో తెరకెక్కిన ఎన్నో చిత్రాల్లో విభిన్నమైన పాత్రలు పోషించి సీనియర్‌ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు నసీరుద్దీన్ షా (Naseeruddin Shah). తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. సినిమాల్లో హీరోయిజాన్ని మరింత ఎక్కువగా చూపించడం ఇటీవల ఎక్కువగా కనిపిస్తోందన్నారు. ‘‘పురుషుల ఆత్మన్యూనతా భావం ఎక్కువైన కారణంగా ఈ మధ్యకాలంలో హీరోయిజాన్ని ఎలివేట్‌ చేసే చిత్రాలు ఎక్కువగా వస్తున్నాయి. అమెరికాలోని మార్వెల్‌ యూనివర్స్‌ చిత్రాలు సైతం ఇదే తరహాలోనివే. అదే పరిస్థితి భారత్‌లోనూ కనిపిస్తోంది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘పుష్ప ది రైజ్‌’ చిత్రాలను ఇప్పటివరకూ నేను చూడలేదు. ఇలాంటి సినిమాలు చూసి థ్రిల్‌ కాకుండా ప్రేక్షకులు ఏం పొందుతారో నాకు తెలియదు. మణిరత్నం తెరకెక్కించిన ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ చూశా. ఆయన గొప్ప దర్శకుడు. ఎలాంటి అజెండాలు లేకుండా సినిమాలు చేస్తారు’’ అని ఆయన తెలిపారు.

2018 Movie: భారత్‌ నుంచి ఆస్కార్‌ అధికారిక ఎంట్రీ మలయాళ బ్లాక్‌బస్టర్‌ ‘2018’!

‘నిషాంత్‌’ అనే చిత్రంతో మొదటి సారి నసీరుద్దీన్‌ నటుడిగా వెండితెరపై మెరిశారు. అనంతరం ఆయన ‘చక్ర’, ‘బజార్‌’, ‘హోళీ’, ‘మిర్చ్‌ మసాలా’, ‘కర్మ’, ‘సర్‌’, ‘హిమ్మత్‌’, ‘బొంబాయి బాయ్స్‌’ వంటి ఎన్నో సినిమాల్లో నసీరుద్దీన్‌ కీలకపాత్రలు పోషించారు. ఆయన కేవలం హిందీలోనే కాకుండా కన్నడ, మలయాళం, బెంగాళీ సినిమాల్లోనూ నటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు