NTR: ‘నాటు నాటు’లో డ్యాన్స్‌ కంటే.. అదే కష్టంగా అనిపించింది: ఎన్టీఆర్‌

ఆస్కార్‌ వేడుక కోసం అమెరికా వెళ్లిన ఎన్టీఆర్‌ (NTR) తాజాగా మరో విదేశీ ఛానల్‌కు  ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘నాటు నాటు’ (Naatu Naatu) పాట కోసం రోజుకు మూడు గంటలు ప్రాక్టీస్‌ చేసినట్లు తెలిపారు.

Published : 12 Mar 2023 11:59 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మరికొన్ని గంటల్లో జరగనున్న ఆస్కార్‌ వేడుక కోసం యావత్‌ సినీ ప్రపంచం ఆసక్తిగా ఎదరుచూస్తోంది. అంతర్జాతీయ వేదికపై తెలుగు సినిమా సత్తా చాటాలని కొన్ని కోట్లమంది కోరుకుంటున్నారు. ఇక ఈ వేడుక కోసం అమెరికా వెళ్లిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) టీం వరుస ఇంటర్వ్యూలతో సందడి చేస్తోంది. తాజాగా ఎన్టీఆర్‌ (NTR) ఓ హాలీవుడ్‌ ఛానల్‌తో మాట్లాడారు. ‘నాటు నాటు’ (Naatu Naatu) పాట రిహార్సల్స్‌ గురించి మాట్లాడారు.

‘‘నాటు నాటు’లో మేము చేసిన డ్యాన్స్‌ కంటే మేమిద్దరం ఒకే సింక్‌లో చేయడం చాలా కష్టంగా అనిపించింది. నేను, చరణ్‌ (Ram charan) ఆ పాట కోసం రోజుకు 3 గంటలు ప్రాక్టీస్‌ చేసే వాళ్లం. అలాగే షూటింగ్‌ సమయంలో, షూటింగ్‌కు ముందు ఎన్నోసార్లు రిహార్సల్స్‌ చేశాం. నా కాళ్లు ఇంకా నొప్పులు పుడుతూనే ఉన్నాయి.  ఆ పాట షూటింగ్‌ సమయంలో రాజమౌళి (Rajamouli) మా ఇద్దరి మూమెంట్‌ ఒకేలా ఉండాలని ఎన్నో టేక్‌లు తీసుకున్నారు. ఇంతలా ప్రేక్షకులు గమనిస్తారా..? అని అనుకున్నాను. కానీ పాట విడుదలయ్యాక ప్రతి ఒక్కరూ మా ఇద్దరి డ్యాన్స్‌ సింక్‌ గురించే మాట్లాడుకున్నారు. అప్పుడు అర్థమైంది ప్రేక్షకులకు ఏం కావాలో రాజమౌళికి తెలుసు అని’’ అంటూ జక్కనపై ప్రశంసలు కురిపించారు.

‘‘ఆర్‌ఆర్ఆర్‌’  పూర్తిగా స్నేహానికి సంబంధించిన సినిమా. సినీ రంగంలోనే పెద్ద పండగగా భావించే ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్‌లో ఈ చిత్రం ఓ భాగమైంది. ఇక ఇంతకు మించి  ఒక నటుడిగా నేనేం అడుగగలను.  ఈ వేడుక కోసం నేను ఎంతగానో ఎదురుచూస్తున్నాను. ఓ నటుడిగా కాకుండా ఓ భారతీయుడిగా ఆ వేడుకకు హాజరవుతాను. నా వస్త్రధారణలోనూ భారతీయత కనిపించేలా ప్రయత్నిస్తాను’’ అని ఎన్టీఆర్‌ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని