Oscar Awards 2022: కల.. కళతో నిజమైన వేళ

గుండెలు ఉప్పొంగే క్షణాలవి. ఏళ్ల నిరీక్షణకు తెరపడే సమయమది. కలను.. కళతో నిజం చేసుకొన్న వేడుకది. ప్రపంచంలోని సినిమా వాళ్లు కళ్లప్పగించి చూసే వేదికది. అదిరిపోయే లైటింగే చిన్నబోయేలా మెరిసే మోములు... కళ్లు చెదిరే అలంకరణే తలవంచే అందాలు... ముత్యాల హారాలే ముడుచుపోయేలా నవ్వులు...

Published : 29 Mar 2022 05:53 IST

గుండెలు ఉప్పొంగే క్షణాలవి. ఏళ్ల నిరీక్షణకు తెరపడే సమయమది. కలను.. కళతో నిజం చేసుకొన్న వేడుకది. ప్రపంచంలోని సినిమా వాళ్లు కళ్లప్పగించి చూసే వేదికది. అదిరిపోయే లైటింగే చిన్నబోయేలా మెరిసే మోములు... కళ్లు చెదిరే అలంకరణే తలవంచే అందాలు... ముత్యాల హారాలే ముడుచుపోయేలా నవ్వులు.... ఇదంతా దేనిగురించి అంటారా? 94వ ఆస్కార్‌ పురస్కార వేడుక గురించి కాకపోతే.. ఇంకేంటి?
ప్రపంచ చలనచిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మకంగా చెప్పుకొనే అకాడమీ అవార్డుల(ఆస్కార్‌) ప్రదానోత్సవం ఆదివారం(భారతదేశంలో సోమవారం తెల్లవారుజామున) రాత్రి ఘనంగా జరిగింది. కరోనా పరిస్థితులతో  రెండేళ్లుగా సందడిలేని ఈ వేడుక ఈ ఏడాది పూర్వ వైభవాన్ని సంతరించుకుంది. లాస్‌ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో జరిగిన 94వ అకాడమీ అవార్డుల వేడుకలో వివిధ విభాగాల్లో ‘డ్యూన్‌’ చిత్రం హవా కొనసాగింది.


అప్పుడు తగ్గి... ఇప్పుడు నెగ్గి

‘‘ఓడిపోతే ఆగిపోకూడదు.. గెలిచే వరకూ  పోరాటడుతూనే ఉండాలి’’ అనే సూత్రం ఈ సారి ఉత్తమ నటుడిగా ఆస్కార్‌ గెలిచిన విల్‌స్మిత్‌కు సరిగ్గా సరిపోతుంది. రెండు సార్లు ‘ఆస్కార్‌’ను సాధించలేకపోయిన హాలీవుడ్‌ నటుడు విల్‌స్మిత్‌ మూడో ప్రయత్నంలో విజయం అందుకున్నాడు. భారతీయ సినీ అభిమానులకు సుపరిచితుడైన ఆయన ఎందరికో స్ఫూర్తిగా నిలిచాడు. ఎందరో జీవితాల్ని తెరపైకి తీసుకొచ్చిన ఈ ఉత్తమ నటుడి గురించి తెలుసుకుందాం.  
* ‘బ్యాడ్‌ బాయ్స్‌’, ‘మెన్‌ ఇన్‌ బ్లాక్‌’, ‘ఐ యామ్‌ లెజెండ్‌’, ‘ఎనిమీ ఆఫ్‌ ది స్టేట్‌’ వంటి విభిన్న తరహా కథలతో అలరించిన స్మిత్‌ నటించిన తొలి బయోపిక్‌ ‘అలీ’. ఈ చిత్రం ప్రముఖ బాక్సర్‌ మహ్మద్‌ అలీ జీవితాధారంగా తెరకెక్కింది. అలీ పాత్రలో ఒదిగిపోయి, విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఈ సినిమాతోనే ఉత్తమ నటుడిగా తొలిసారి ఆస్కార్‌కు, గ్లోబల్‌ గోల్డ్‌ అవార్డ్‌కు నామినేట్‌ అయ్యాడు. అతడు నటించిన రెండో బయోపిక్‌ ‘ది పర్షుట్‌ ఆఫ్‌ హ్యాపీనెస్‌’. అమెరికన్‌ బిజినెస్‌మ్యాన్‌, మోటివేషన్‌ స్పీకర్‌ క్రిస్‌ గార్డ్‌నర్‌ జీవితకథాంశాలతో ఈ సినిమా రూపొందింది. తండ్రీకొడుకుల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో స్మిత్‌ భావోద్వేగాలు చూస్తే కళ్లు చెమ్మగిల్లాల్సిందే. అంతగా హృదయాల్ని హత్తుకున్నాడు కాబట్టే ఉత్తమ నటుడిగా రెండోసారి ఆస్కార్‌ నామినేషన్‌కు ఎంపికయ్యాడు. నైజీరియన్‌- అమెరికన్‌ ఫిజిషియన్‌ బెన్నెత్‌ ఒమలు జీవితాధారంగా తెరకెక్కిన ‘కన్‌క్యూషన్‌’ సినిమాకు ఉత్తమ నటుడిగా గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డ్‌కు నామినేట్‌ అయ్యాడు స్మిత్‌. ఇలా.. పలు ప్రతిష్ఠాత్మక అవార్డులకు  నామినేట్‌ అయి విజేతగా నిలవకపోయినా స్మిత్‌ ఎప్పుడూ నిరాశ పడలేదు. ‘ప్రయత్నిస్తే ఎప్పటికైనా అనుకున్న ఫలితం వస్తుంద’నే నమ్మకంతోనే మరొకరి జీవిత కథను తెరపైకి తీసుకొచ్చాడు. ఉత్తమ నటుడిగా స్మిత్‌కు ఆస్కార్‌ను అందించిన ఆ చిత్రమే ‘కింగ్‌ రిచర్డ్‌’. ప్రముఖ టెన్నిస్‌ క్రీడాకారిణులు వీనస్‌, సెరీనా విలియమ్స్‌ తండ్రి, కోచ్‌ రిచర్డ్‌ విలియమ్స్‌ జీవిత కథతో రూపొందింది. వీనస్‌, సెరీనాలను టెన్నిస్‌ క్రీడాకారిణులుగా తయారు  చేయడంలో రిచర్డ్‌ ఎలా కృషి చేశారు? అన్నది ఇందులో భావోద్వేగభరితంగా చూపించారు. టైటిల్‌ పాత్రలో విల్‌స్మిత్‌ జీవించిన తీరు ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ప్రపంచమంతా తన గురించి మాట్లాడుకునేలా చేసింది.
బాలీవుడ్‌ చిత్రం ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2’ (హిందీ)లో స్మిత్‌ అతిథిగా సందడి చేసిన సంగతి తెలిసిందే.


మూడో దర్శకురాలు

ఉత్తమ దర్శకత్వ విభాగంలో ఆస్కార్‌ అందుకున్న మూడో మహిళ జేన్‌ క్యాంపియన్‌. కత్రియన్‌ బిగెలో, క్లోయి ఝవోల తర్వాత ఆమె ఈ అవార్డ్‌ అందుకొన్నారు. న్యూజిలాండ్‌కు జేన్‌ దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘స్వీటీ’. తర్వాత ఈమె రూపొందించిన ‘పియానో’  చిత్రానికి ఉత్తమ స్క్రీన్‌ప్లే  విభాగంలో ఆస్కార్‌ గెలిచారు. ఇప్పుడు ‘ది పవర్‌ ఆఫ్‌ డాగ్‌’తో ఉత్తమ దర్శకురాలిగా నిలిచారు.


వ్యాఖ్యాతను ఎందుకు కొట్టాడంటే...

అకాడమీ అవార్డుల(ఆస్కార్‌) ప్రదానోత్సవంలో ఓ అనూహ్య ఘటన జరిగింది. అమెరికాకు చెందిన ప్రముఖ కమెడియన్‌ క్రిస్‌ రాక్‌ అకాడమీ అవార్డుల వేడుకకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఉత్తమ డాక్యుమెంటరీ అవార్డు ప్రకటించడానికి ముందు ఆయన వీక్షకుల్ని నవ్వుల్లో ముంచెత్తేందుకు ఓ కామెడీ ట్రాక్‌ను చెప్పుకొచ్చారు. అందులో ప్రముఖ నటుడు విల్‌ స్మిత్‌ సతీమణి జాడా పింకెట్‌ ప్రస్తావనను తీసుకొచ్చారు. జుట్టు పూర్తిగా తొలగించుకొని వేడుకకు హాజరైన ఆమెను ‘జీ.ఐ.జేన్‌’ చిత్రంలో ‘డెమి మూర్‌’ ప్రదర్శించిన పాత్రతో పోల్చారు. ఈ చిత్రంలో ఆమె పూర్తిగా గుండుతో కనిపించడం గమనార్హం. జీ.ఐ.జేన్‌ సీక్వెల్‌లో కనిపించనున్నారా?అంటూ హాస్యాన్ని పండించే ప్రయత్నం చేశారు. పింకెట్‌ ‘అలోపేసియా’ అనే అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్యతో బాధపడుతున్న వారిలో జుట్టు ఊడిపోతుంటుంది. అప్పటి వరకు క్రిస్‌ జోక్‌లకు నవ్వుతూ కనిపించిన స్మిత్‌.. ఒక్కసారిగా లేచి వేదికపైకి నడుచుకుంటూ వెళ్లారు. వేడుక జరుగుతున్న డాల్బీ థియేటర్‌లో నిశ్శబ్దం ఆవరించింది. స్మిత్‌ ఆగ్రహాన్ని పసిగట్టలేకపోయిన క్రిస్‌ అతను  దగ్గరకు వచ్చే వరకు నవ్వుతూ అక్కడే నిలబడ్డారు. అక్కడి వరకు వెళ్లిన స్మిత్‌.. క్రిస్‌ చెంప ఛెళ్లుమనిపించి వెనుదిరిగారు. ‘నా భార్య పేరు నీ నోటి నుంచి రావొద్దు’ అంటూ రెండుసార్లు గట్టిగా హెచ్చరించారు. ఈ ఘటన
జరిగిన 40 నిమిషాల తర్వాత ‘ఉత్తమ నటుడి’గా అవార్డు అందుకునేందుకు విల్‌ స్మిత్‌ వేదికపైకి వచ్చారు. జరిగిన ఉదంతంపై స్పందిస్తూ అకాడమీ, సహచర నామినీలకు క్షమాపణలు చెప్పారు. అవార్డు అందుకుంటున్న సమయంలో స్మిత్‌ కన్నీటిపర్యంతం కావడం గమనార్హం.


పదేళ్ల నిరీక్షణ ఫలించింది

‘ది ఐస్‌ ఆఫ్‌ టెమీ ఫేయ్‌’ చిత్రానికి ఉత్తమ నటిగా ఆస్కార్‌ అందుకున్న జెస్సికా చాస్టెయిన్‌... ఈ క్షణం కోసం పదేళ్లు నిరీక్షించింది. అమెరికాకు చెందిన 45 ఏళ్ల జెస్సికా నటిగా, నిర్మాతగా 20 ఏళ్లుగా సినిమా రంగంలో ఉంది. స్త్రీవాద చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. 2011లో ‘ద హెల్ప్‌’, 2012లో ‘జీరో డార్క్‌ థర్టీ’ సినిమాలకు ఆస్కార్‌ బరిలో నిలిచినా అవార్డు అందలేదు. టీవీలో మతప్రచారకురాలిగా పేరొందిన టెమ్మీ ఫేయ్‌ బేకర్‌ జీవితకథే ‘ది ఐస్‌ ఆఫ్‌ టెమ్మీ ఫేయ్‌’. సినిమాలో టెమ్మీ 30 ఏళ్ల జీవితాన్ని చూపారు. దానికి తగ్గట్టు మేకప్‌, ప్రోస్థెటిక్స్‌ వేసుకుని అద్భుతంగా నటించింది జెస్సికా. ఈ సినిమాకే ఉత్తమ మేకప్‌, హెయిర్‌స్టైలింగ్‌ విభాగాల్లో ఆస్కార్‌ అవార్డులూ రావడం విశేషం. ఈ సినిమాకి ఈమె నిర్మాత.



మనకు నిరాశే

ఈ 94వ ఆస్కార్‌ చలన చిత్రోత్సవాల్లో సూర్య నటించిన ‘జై భీమ్‌’ చిత్రం ఉత్తమ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ విభాగంలో పోటీకి వెళ్లింది. ఈ సినిమా తుది జాబితాలో చోటు సంపాదించలేకపోయింది. ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్‌ విభాగంలో మన దేశం నుంచి ఓ డాక్యుమెంటరీ నామినేషన్‌ దక్కించుకుంది. అదే రింటు థామస్‌, సుష్మిత్‌ ఘోష్‌ సంయుక్తంగా తెరకెక్కించిన ‘రైటింగ్‌ విత్‌ ఫైర్‌’. ఇదీ పురస్కారం అందుకోలేకపోయింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని