OTT Movies: బొమ్మ మీది.. స్ట్రీమింగ్ వేదిక మాది.. ఇప్పుడిదే ట్రెండ్!
OTT Movies: కరోనా తర్వాత వినోద రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికాయి ఓటీటీ వేదికలు. ఒకప్పుడు చిత్ర పరిశ్రమలో ఏదైనా సినిమా మొదలు పెడితే, విడుదల తేదీ ఎప్పుడు? అనేవారు. కానీ, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది? అని అడుగుతున్నారు.
OTT Movies: పెళ్లి చూపుల్లో రెండు కుటుంబాలూ ఓకే అనుకుంటే, అప్పటికప్పుడే అబ్బాయి కుటుంబం అమ్మాయికి చీర పెట్టి ‘పిల్ల మాది’ అనిపించుకుంటారు. ఇప్పుడు ఓటీటీ వేదికలు ఇదే పంథాను అవలంబిస్తున్నాయి. నిర్మాణ దశలో ఉండగానే అందుకు సంబంధించిన డీల్స్ పూర్తి చేసి ‘సినిమా మాది’ అనిపించుకోవడమే కాదు, అధికారికంగా ప్రకటిస్తున్నాయి. ప్రస్తుతం ఇదే ట్రెండ్ నడుస్తోంది.
వరుస సినిమాలు ప్రకటించిన నెట్‌ఫ్లిక్స్
అంతర్జాతీయ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ భారత్‌లో బలమైన పునాదులు వేసే దిశగా అడుగులు వేస్తోంది. తొలినాళ్లలో ఇతర ఓటీటీ సంస్థలతో పోలిస్తే, నెట్‌ఫ్లిక్స్‌కు చందాదారులు చాలా తక్కువ. అందుకు కారణంగా దాని సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లే. దీనికితోడు భారతీయ సినిమాలు కూడా తక్కువే. ఆ సమస్యలను అధిగమించేందుకు నెట్‌ఫ్లిక్స్ పావులు కదుపుతోంది. ఇటీవల సబ్‌స్క్రిప్షన్ ధరలను మరింత తగ్గించి, యువతకు చేరువయ్యేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. మరోవైపు తన సినిమాల బ్యాంకును కూడా పెంచుకుంటోంది. ముఖ్యంగా దక్షిణాది చిత్ర పరిశ్రమలపై దృష్టి సారించింది. ఇందులో భాగంగానే నిర్మాణ దశలో ఉన్న తెలుగు, తమిళ చిత్రాల ఓటీటీ రైట్స్‌ను కొనుగోలు చేస్తోంది. తాజాగా భారీ అంచనాల మధ్య మొదలైన విజయ్-లోకేశ్ కనగరాజ్ మూవీ ఓటీటీ రైట్స్‌ను సొంతం చేసుకున్నట్లు ప్రకటించింది. పూజా కార్యక్రమం నిర్వహించిన మరుసటి రోజే ఈ ప్రకటన రావడం గమనార్హం.
ఈ ఏడాది నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయ్యే తెలుగు సినిమాలు
చిన్నా, పెద్దా తేడా లేకుండా వీలైనని ఎక్కువ చిత్రాల హక్కులు దక్కించుకోవడం ద్వారా తమ చందాదారులను పెంచుకునేందుకు నెట్‌ఫ్లిక్స్ ప్రయత్నిస్తోంది. తెలుగులో మంచి అంచనాలు ఉన్న చిరంజీవి ‘భోళా శంకర్’, మహేశ్-త్రివిక్రమ్‌ల మూవీ(ఎస్‌ఎస్‌ఎంబీ28), నాని, కీర్తిసురేశ్‌ల ‘దసరా’, కల్యాణ్ రామ్ ‘అమిగోస్’, అనుష్క-నవీన్ పొలిశెట్టి మూవీ, సిద్ధు జొన్నల గడ్డ ’డీజే టిల్లు స్క్వేర్’, సాయిధరమ్ తేజ్ ‘విరూపాక్ష’, వరుణ్‌తేజ్-ప్రవీణ్ సత్తారు మూవీ, వైష్ణవ్‌తేజ్-శ్రీలీల చిత్రం, సందీప్ కిషన్ ‘బడ్డీ’, కార్తికేయ గుమ్మకొండ కొత్త చిత్రం, ‘బుట్ట బొమ్మ’ తదితర చిత్రాల హక్కులను దక్కించుకున్నట్లు ముందుగానే ప్రటించింది.
మరోవైపు తమిళ చిత్రాల జాబితా కూడా చాంతాడంత ఉంది. అజిత్ 62వ చిత్రం, విష్ణు విశాల్ ‘ఆర్యన్’, ‘చంద్రముఖి2’, జయం రవి-నయనతార మూవీ, కార్తి ‘జపాన్’, లారెన్స్-ఎస్‌జే సూర్యల ‘జిగర్తాండ డబుల్ ఎక్స్’, ఉదయనిధి స్టాలిన్-కీర్తి సురేశ్‌ల ‘మామాన్నన్’, విక్రమ్ ‘తంగలాన్’, ధనుష్ ‘సార్’, కీర్తి సురేశ్ ‘రివాల్వర్ రీటా’ ఇలా పెద్ద జాబితానే ఉంది. మరోవైపు వెబ్‌సిరీస్‌ల విషయంలోనూ కాస్త దూకుడుగానే ఉంది. వివిధ ఆంగ్ల వెబ్‌సిరీస్‌లను దక్షిణాది భాషా ప్రేక్షకుల కోసం డబ్బింగ్ చేసి ఆడియోను అందుబాటులో ఉంచుతోంది. ఇక వెంకటేశ్-రానా ‘రానా నాయుడు’ వంటి సిరీస్‌లను నిర్మిస్తోంది.
ఆహా కూడా స్పీడ్ పెంచింది
తెలుగు ఓటీటీ ఆహా కూడా తన సినిమాల బ్యాంక్‌ను పెంచుకుంటోంది. ఈ ఏడాది థియేటర్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న పలు చిత్రాల ఓటీటీ రైట్స్‌ను ఆహా దక్కించుకుంది. సంక్రాంతి నుంచి ఉగాది వరకూ సినిమాల సందడి అంటూ ఆయా చిత్రాల జాబితాను తాజాగా ప్రకటించింది. వీటితో పాటు, ఆహా సొంతంగా నిర్మిస్తున్న వెబ్‌సిరీస్‌లు, రియాల్టీ షోలు కూడా ఉన్నాయి. సినిమాల విషయానికొస్తే, మైఖేల్ (సందీప్ కిషన్ హీరో), వినరో భాగ్యము విష్ణు కథ (కిరణ్ అబ్బవరం హీరో), కల్యాణం కమనీయం (సంతోశ్ శోభన్ హీరో) తదితర చిత్రాలు ఉండగా, ఇంటింటి రామాయణం, సత్తిగాని రెండెకరాలు, పాపం పసివాడు, న్యూసెన్స్, బాలుగాని టాకీస్, గీతా సుబ్రహ్మణం 3, బీఎఫ్‌ఎఫ్ 2 తదితర కార్యక్రమాలు ఉన్నాయి.
అటు సినిమాలు.. ఇటు సొంత వెబ్‌సిరీస్‌లు..
నెట్‌ఫ్లిక్స్‌కు దీటుగా సొంత వెబ్‌సిరీస్‌లతో తమ చందాదారులను అలరించేందుకు అమెజాన్, డిస్నీ+హాట్‌స్టార్, సోనీలివ్, జీ5 ఓటీటీలు సన్నాహాలు చేస్తున్నాయి. రాజ్, డీకే ద్వయం రూపొందిస్తున్న ‘ఫర్జీ’, ‘సిటాడెల్’, ‘ఫ్యామిలీమెన్3’ ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సమయంలో మంచి హిట్ చిత్రాలను కొనుగోలు చేస్తూ మూవీ బ్యాంక్‌ను మరింత పెంచుకుంటోంది ప్రైమ్ వీడియో. అదనపు ఆదాయ మార్గంగా, కొత్త సినిమా విడుదలైతే కొన్నిరోజుల పాటు అద్దె ప్రాతిపదికన సినిమాలను అందిస్తోంది. ఇక డిస్నీ+హాట్ స్టార్ కూడా వెడ్డింగ్ స్పెషల్స్‌తో సందడి చేస్తోంది. హాలీవుడ్ వెబ్‌సిరీస్ ‘ది నైట్ మేనేజర్’తో పాటు దక్షిణాది వారి కోసం ‘ఝాన్సీ’, యాంగర్ టేల్స్ తదితర వెబ్‌సిరీస్‌లను అందుబాటులోకి తెచ్చింది. ఇక బాలీవుడ్, హాలీవుడ్ మూవీలను ప్రాంతీయ భాషల్లో డబ్ చేసి విడుదల చేస్తోంది. జీ5 దృష్టి ఎక్కువగా సీరియళ్లపై ఉండగా, అది కూడా పాపులర్ చిత్రాలను కొనుగోలు చేయడానికి భారీ ఖర్చు చేస్తోంది. గతేడాది విడుదలైన ‘ఆర్‌ఆర్ఆర్’, ‘కార్తికేయ2’, ‘విక్రమ్’, ‘కశ్మీర్ ఫైల్స్’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో తన చందాదారులను బాగానే పెంచుకుంది. ఈ ఏడాది కూడా కొత్త సినిమాల కోసం గట్టి ప్రయత్నాలే చేస్తోంది. కొన్ని హాలీవుడ్‌యాక్షన్ మూవీలను తెలుగులో డబ్ చేసి ఉచితంగా అందిస్తోంది.
నిర్మాణ దశలో ఉండగానే ఫలానా సినిమా ఓటీటీ రైట్స్ మేము దక్కించుకున్నామంటూ ప్రకటించడంపైనా ప్రస్తుతం చర్చ నడుస్తోంది. ఇలా ముందుగానే ప్రకటిస్తే, ఎలాగూ ఆ ఓటీటీలో వస్తుంది కదా! నెమ్మదిగా చూద్దాం అనే వారూ లేకపోరని సినీ విశ్లేషకులు అంటున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
క్షణికావేశంలో ఆలుమగల బలవన్మరణం
-
Ap-top-news News
శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు
-
World News
Pizza: ఇప్పుడు తినండి.. మరణానంతరం చెల్లించండి.. ఓ పిజ్జా కంపెనీ వింత ఆఫర్!
-
India News
Stalin: బుల్లెట్ రైలులో సీఎం స్టాలిన్.. రెండున్నర గంటల్లో 500కి.మీల ప్రయాణం!
-
World News
Graduation Day: విద్యార్థులకు బిలియనీర్ సర్ప్రైజ్ గిఫ్ట్.. కారణమిదే!
-
Movies News
The Kerala Story: వాళ్ల కామెంట్స్‌కు కారణమదే.. కమల్‌హాసన్ వ్యాఖ్యలపై దర్శకుడు రియాక్షన్