Pareshan movie review: రివ్యూ: పరేషాన్.. రానా సమర్పణలో వచ్చిన చిత్రం మెప్పించిందా?

Pareshan movie review: రానా సమర్పణలో తిరువీర్‌ కీలక పాత్రలో నటించిన ‘పరేషాన్‌’ మూవీ ఎలా ఉందంటే?

Updated : 02 Jun 2023 16:27 IST

Pareshan movie review; చిత్రం: పరేషాన్‌; నటీనటులు: తిరువీర్, పావని కరణం, మురళీధర్ గౌడ్, బన్ని అభిరన్, అంజి వల్గుమాన్, సాయిప్రసన్న, అర్జున్ కృష్ణ, శృతి రియాన్, బుడ్డరఖాన్ రవి, రాజు బెడిగెల, పద్మ, వసంత తదితరులు; నిర్మాత: సిద్దార్థ్ రాళ్లపల్లి; సమర్పణ: రానా దగ్గుబాటి; సంగీతం: యశ్వంత్ నాగ్; ఛాయాగ్రహణం: వాసు పెండమ్; రచన-దర్శకత్వం: రూపక్ రొనాల్డ్‌సన్‌; విడుదల తేదీ: 02-06-2023

‘మసూద’తో మంచి విజయాన్ని అందుకొని నటుడిగా వరుస అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారు తిరువీర్‌.  ఆ జాబితాలో తాజాగా వచ్చిన చిత్రమే ‘పరేషాన్’. లాక్ డౌన్ సమయంలో దర్శకుడు రూపక్ రొనాల్డ్‌సన్‌ రూపొందించిన ఈ చిత్రం ఎట్టకేలకు రానా దగ్గుబాటి కంటపడింది. తన దవడలు నొప్పిపుట్టించేలా నవ్వించిందని రానా ప్రశంసించారు. ‘కేరాఫ్ కంచెరపాలెం’ తరహాలో పరేషాన్ టీమ్‌ను ప్రోత్సహించేందుకు తన సమర్పణలో విడుదల చేసేందుకు ముందుకొచ్చారు. అలాగే తెలంగాణ యాసలో టీజర్ నుంచి ట్రైలర్ వరకు ఎంతో ఆసక్తిని రేకెత్తించింది. (Pareshan movie review) ఇటీవల కాలంలో ప్రాంతీయ కథలకు మంచి ఆదరణ లభిస్తుండటంతో ఎలాంటి పరేషాన్ లేకుండానే ఈ పరేషాన్ థియేటర్ లో విడుదలైంది. రానా నమ్మిన ఈ సినిమా ప్రేక్షకులను నవ్వించిందా? లేక పరేషాన్ చేసిందా?

కథేంటంటే: మంచిర్యాలలో సింగరేణి ఉద్యోగి సమర్పణ్( మురళీధర్ గౌడ్). బొగ్గుబావిలో పనిచేసుకుంటూ సమయం దొరికితే క్రైస్తవ ప్రార్థన సభల్లో అనువాదం చేస్తుంటాడు. అతని కొడుకు ఐజాక్ (తిరువీర్). స్నేహితులతో కలిసి జులాయిగా తిరుగుతుంటాడు. బావి పనిలో పెట్టిస్తేనైనా తన కొడుకు బాగుపడతాడని తన ఉద్యోగం కొడుక్కి వచ్చేలా చేయడం కోసం ప్రయత్నాలు చేస్తుంటాడు సమర్పణ్. ఈ క్రమంలో కొడుకు ఉద్యోగం కోసం భార్య గాజులు, బంగారాన్ని అమ్మి డబ్బు జమచేస్తాడు. ఆ డబ్బును మధ్యవర్తికి ఇవ్వమని తల్లి ఐజాక్‌కు ఇస్తుంది. ఇంతలో తన స్నేహితుల్లో ఇద్దరికి ఆపద వస్తుంది. ఆ డబ్బును వాళ్లకిచ్చి ఆ ఆపద నుంచి గట్టెక్కిస్తాడు ఐజాక్‌. అప్పుడే ఊళ్లో జరిగిన ఓ పెళ్లి బారాత్ లో శిరీష(పావని)ని చూసి ఇష్టపడతాడు. (Pareshan movie review in telugu)శిరీష కూడా ఐజాక్ ను ప్రేమిస్తుంది. ఓ రోజు శారీరకంగా ఒక్కటవుతారు. వారం తిరగకుండానే శిరీషకు వాంతులవుతాయి. తాను గర్భం దాల్చినట్లు ఐజాక్‌కు చెప్పడంతో ఇద్దరూ పరేషాన్‌ అవుతారు. ఊళ్లో ఉన్న ఆస్పత్రులకు వెళ్తే అసలు విషయం బయటపడుతుందని భయపడతారు. హైదరాబాద్ వెళ్లి ఆస్పత్రిలో చూపిస్తానని స్నేహితుడి బండి అమ్మి డబ్బు తీసుకుంటాడు ఐజాక్. అదే రోజు రాత్రి ఐజాక్ జేబులోని డబ్బు, పక్కనే ఉన్న స్నేహితుడు సత్తి కనిపించకుండా పోతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? డబ్బుతో పారిపోయిన సత్తి దొరికాడా?శిరీష, ఐజాక్‌ల పరిస్థితి ఏమైంది? అనేది తెరపై చూడాల్సిందే.

ఎలా ఉందంటే: తెలుగు సినిమా కంటే ఇప్పుడు తెలంగాణ సినిమా మాట ఎక్కువగా వినిపిస్తోంది. మొన్న జాతిరత్నాలు, డీజే టిల్లు.. నిన్న బలగం, దసరా, మేమ్ ఫేమస్.. నేడు పరేషాన్. ఇలా  తెలంగాణ ప్రాంతీయ కథలన్నీ తెలుగు తెరపై ప్రాణం పోసుకుంటున్నాయి. మరెన్నో కథలకు ఊతమిస్తున్నాయి. తెలంగాణ ప్రజల అస్థిత్వాన్ని, వారి ఆరాటం, పోరాటాన్ని కొన్ని చిత్రాలు చాటితే మరికొన్ని సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలకు అద్దంపడుతున్నాయి. ఇంకొన్ని వినోదాన్ని పంచుతూ బాక్సాఫీసు వద్ద తెలంగాణ బ్రాండ్ సినిమాగా ముద్రపడేలా చేస్తున్నాయి. (Pareshan movie review) అందులో ఒకటే ఈ పరేషాన్. ఆద్యంతం నవ్వులు పంచుతూ సాగే ఈ కథ మంచిర్యాల పరిసర ప్రాంతాల్లో జరుగుతుంటుంది. కొడుకును ప్రయోజకుడ్ని చేయాలనే తండ్రి తపనతో కథ ప్రారంభమవుతుంది. తెలంగాణ పల్లె వాతావరణం, స్నేహితుల ముచ్చట్లు, వారి జీవన విధానాన్ని కొట్టొచ్చినట్లు తీర్చిదిద్దాడు దర్శకుడు రూపక్. (Pareshan movie review) ప్రథమార్ధంలో ఐజాక్ స్నేహితులకు డబ్బు ఇచ్చి ఇబ్బందులో పడటం, శిరీషతో ప్రేమ వ్యవహారం మరిన్ని చిక్కుల్లోకి నెట్టేయడం, పొరుగూరి పోరగాళ్లతో కొట్లాటలు, మందు ముచ్చట్లతో నవ్వుల్లో ముంచెత్తుతుంది. ఎప్పుడైతే శిరీష విషయం తెలిసి ఐజాక్ హైరానాకు గురవుతాడో అప్పుడే అసలు కథ మొదలవుతుంది.

డబ్బులు తీసుకెళ్లిన సత్తి కోసం వెతకడం, ఆ వెతుకులాటలో స్నేహితులతో వాగ్వాదం తదితర సన్నివేశాలు భావోద్వేగంగా సాగుతూనే నవ్వులు పూయిస్తాయి. సత్తి కుడిచేతి బొటనవేలు తెగిపోయిన సన్నివేశాలు, ఐజాక్ బ్యాండ్ డ్రెస్ సన్నివేశాలు, ఐజాక్‌ను తండ్రి కొట్టే సన్నివేశాలు, టైగర్ శీను పెళ్లిలో గొడవ...పరేషాన్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ప్రథమార్ధంలో కథ నవ్వులతో ముంచెత్తినా ద్వితీయార్ధంలోనే అసలు కథ సాగుతుంటుంది. (Pareshan movie review) అయితే స్నేహితులతో కలిసి మద్యం సేవించే సన్నివేశాలు పదే పదే కనిపిస్తుండటం ప్రేక్షకులను సహనానికి పరీక్షపెడతాయి. తెలంగాణ పోరగాళ్లంతా తాగుడుకు బానిసలవుతున్నారా అనే సంకేతాలు వ్యక్తమయ్యేలా చేస్తాయి. అప్పు తీర్చడానికి డబ్బుల్లేకపోయినా తాగడానికి మాత్రం వచ్చాయా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంటుంది. భావోద్వేగ సన్నివేశాల్లో హాస్యం జోడించడంతో అక్కడక్కడ తేలిపోయాయి. క్రైస్తవ మత ప్రార్థనలు, వారి పాటలు సన్నివేశాలకు తగ్గట్లుగా వినోదాన్ని పంచుతాయి.

ఎవరెలా చేశారంటే: తిరువీర్ మరోసారి వైవిధ్యమైన పాత్రలో కనిపించారు. మసూదలో అమయాకత్వంతో భయపెడితే ఇందులో అదే అమాయకత్వంతో కూడిన పాత్రతో నవ్వించాడు. కొన్నికొన్ని సన్నివేశాల్లో తిరువీర్ నటన మెప్పించేలా ఉంది. (Pareshan movie review) ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోతానని ఐజాక్ పాత్రతో నిరూపించుకున్నాడు. ఇక శిరీషగా నటించిన పావని నటన ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. అమాయకంగా కనిపిస్తూ ఏడుస్తూ నవ్విస్తుంది. సమర్పణ్  పాత్రలో మురళీధర్ గౌడ్ మరోసారి మెరుపులు మెరిపించారు. క్రైస్తవ మత ప్రార్థన సన్నివేశాలతోపాటు కొడుకును మందలించే సన్నివేశాల్లో జీవించేశారు. ఐజాక్ స్నేహితులుగా పాషా, టైగర్ శీను, ఆర్జీవీ, సత్తి, మైదాక్ పాత్రల్లో నటించిన వారంతా చక్కగా నటించారు.(Pareshan movie review) కొత్త వాళ్లైనా ఎక్కడా బెదురు లేకుండా చాలా సహజంగా నటిస్తూ నవ్వుల్లో ముంచెత్తారు. ఇక దర్శకుడు రూపక్ రొనాల్డ్‌సన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. చిన్న కథే అయినా దానికి సమపాళ్లలో వినోదాన్ని జోడించి శభాష్ అనిపించుకున్నాడు. రచన పరంగా మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది అనిపించింది. సినిమాటోగ్రాఫర్ వాసు... తెలంగాణ ఆత్మను చక్కగా ఒడిసిపట్టి తన కెమెరాలో బంధించాడు. యశ్వంత్ నాగ్ అందించిన సంగీతం పరేషాన్ కు బలంగా నిలిచింది.  ‘సౌ సారా..’, ‘ముసి ముసి నవ్వుల మంజుల’ పాటలు జోష్‌ నింపగా నేపథ్య సంగీతం చక్కగా ఇమిడిపోయింది. తెలంగాణ యాస, భాషతో కూడిన సంభాషణలు కావల్సినంత పండాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి.

  • బలాలు
  • + వినోదాత్మక కథ,
  • + తిరువీర్, పావని, మురళీధర్ గౌడ్‌ల నటన
  • + హాస్య సన్నివేశాలను తీర్చిదిద్దిన విధానం
  • బలహీనతలు
  • - అతిగా మద్యం సేవించే సన్నివేశాలు
  • - భావోద్వేగ సన్నివేశాల్లోనూ కామెడీ జోడించడం.
  • చివరిగా: వాళ్లు పరేషాన్‌ పడి.. ప్రేక్షకుల్ని నవ్వించారు!

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని