చిరంజీవికి ధన్యవాదాలు: పరుచూరి గోపాలకృష్ణ

తెలుగు చిత్రసీమలో పరుచూరి బ్రదర్స్‌కు ప్రత్యేకమైన స్థానం ఉంది. వారిలో ఒకరైన పరుచూరి గోపాలకృష్ణ రచయితగా, నటుడిగా రాణించారు. ఆయన ‘పరుచూరి పలుకులు’ పేరుతో  చిత్ర విశేషాలతో పాటు, అప్పట్లో జరిగిన ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంటారు.

Updated : 23 Apr 2021 20:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్: కరోనా క్రైసిస్‌ ఛారిటీ(సీసీసీ) ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలోని కార్మికులకు కరోనా వ్యాక్సిన్‌ వేయించడానికి సంకల్పించిన నటుడు చిరంజీవికి ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ధన్యవాదాలు చెప్పారు. ఈ సందర్భంగా చిరంజీవితో ఉన్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. శ్రీరాముడు అందరికీ ఆదర్శమని ఆయన లక్షణాలు చిరంజీవిలోనూ ఉన్నాయని అన్నారు.

‘‘కరోనా మహమ్మారి రెండోసారి విజృంభిస్తున్న వేళ తెలుగు చిత్ర పరిశ్రమలోని సినీ కార్మికులకు, సినీ జర్నలిస్టులకు కరోనా క్రైసిస్ ఛారిటీ (CCC) తరపున ఉచితంగా వాక్సినేషన్ వేయించే సదుపాయం కల్పించారు. ఇందుకోసం చిరంజీవి స్వయంగా వీడియో చేసి, పిలుపునివ్వడం సంతోషంగా ఉంది. గతంలో (2020) కరోనా మహమ్మారి విజృంభించినప్పుడు సీసీసీ (కరోనా క్రైసిస్‌ ఛారిటీ) పేరిట రెండు పర్యాయాలు కార్మికులకు నిత్యావసర సరకులను అందించారు. చిరంజీవి ఛారిటబుల్‌ ట్రస్ట్  ద్వారా కూడా సేవలు అందించి తన గొప్ప మనసు చాటుకున్నారు. మెగాస్టార్‌ను 1978-1979 మధ్య కాలంలో ‘బడాయి బసవయ్య’ అనే  సినిమా అప్పుడు చూసినట్లు జ్ఞాపకం. అప్పుడు ఆయన పైజామా లాల్చి వేసుకొని నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇప్పటికీ అదే రూపం నాకు కనిపిస్తోంది. నేను చూసిన ఇతనేనా ఇప్పుడింతా గొప్పవాడు అయ్యాడు అనిపిస్తోంది. ఈ మధ్య ఆయనతో మాట్లాడాలని చిన్న మెస్సేజ్‌ పెట్టా. వెంటనే ఆయన స్పందించి.. మొదట మా అన్నయ్యకు, తర్వాత నాకూ వెంటనే ఫోన్‌ చేశారు. మా యోగక్షేమాలు అడిగారు. ఓ సారి లలిత కళాతోరణంలో మా గురించి మాట్లాడుతూ..‘‘ఈ తెలుగు సినిమా చరిత్ర గురించి కొన్ని వేల పేజీలు రాస్తే అందులో పరుచూరి బ్రదర్స్‌కి రెండు పేజీలు కేటాయించాల్సిందే ’’ అని మాట్లాడారు. ఆయన అన్న ఆ మాట ఇప్పటికీ నా హృదయంలో అలా నిలిచిపోయింది. చిరంజీవి ఎప్పటికీ ఆదర్శమే’’ అని పరుచూరి గోపాలకృష్ణ చెప్పుకొచ్చారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని