Paruchuri Gopala Krishna: ఫస్టాఫ్‌లో ఈ మార్పులు చేసి ఉంటే ‘కస్టడీ’ మరోలా ఉండేది: పరుచూరి

నాగచైతన్య (Naga Chaitanya) - కృతిశెట్టి (Krithi Shetty) నటించిన ‘కస్టడీ’ (Custody) సినిమాపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ (Paruchuri Gopala Krishna)

Updated : 02 Jul 2023 15:40 IST

హైదరాబాద్‌: నాగచైతన్య (Naga Chaitanya) - కృతిశెట్టి (Krithi Shetty) ప్రధాన పాత్రల్లో వెంకట్‌ ప్రభు తెరకెక్కించిన చిత్రం ‘కస్టడీ’ (Custody). పోలీస్‌ కానిస్టేబుల్‌ కథతో రూపుదిద్దుకున్న ఈ సినిమా వేసవి కానుకగా మే నెలలో విడుదలై మిశ్రమ స్పందనలకే పరిమితమైంది. తాజాగా ఈ చిత్రాన్ని వీక్షించిన సీనియర్‌ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ (Paruchuri Gopala Krishna) తన అభిప్రాయాన్ని వెల్లడించారు. అక్కినేని హీరోలు అనగానే ప్రేక్షకులు ప్రేమకథను కోరుకుంటారని.. అదే ఈసినిమాలో కొంత కొరవడిందని చెప్పారు.

‘‘కస్టడీ’ కథాబీజం అద్భుతంగా ఉంది. న్యాయాన్ని నిలబెట్టడానికి పెద్ద అధికారులు అవసరం లేదు.. కేవలం ఒక చిన్న కానిస్టేబుల్‌ చాలు అనే అద్భుతమైన లైన్‌తో వెంకట్‌ప్రభు ఈ సినిమా రూపొందించారు. కథనం ఒక దశ వరకు బాగుంది. మంచి విజయాన్ని అందుకునే లక్షణాలు ఈ సినిమాలో ఉన్నాయనిపించింది. ఒక స్టేజ్‌ దాటిన తర్వాత యాక్షన్‌ పార్ట్‌ కథనాన్ని డామినేట్‌ చేసినట్టుగా ఉంది. అలాగే, తమిళ ప్రేక్షకులకు అనుగుణంగా ఈ కథ సాగిన భావన కలిగింది.

సెకండాఫ్‌లో డ్యూటీని అమితంగా ప్రేమించే హీరో అన్నయ్య చనిపోయినట్టు చూపించారు. ఆ సీన్లు హృదయ విదారకంగా ఉంటాయి. అన్నయ్య చావుకు కారణమైన వాడి జోలి (అరవింద్‌ స్వామి)కి హీరో వెళ్తాడు. ఈ సినిమాలో అరవింద్‌ స్వామి లుక్‌ కొత్తగా ఉంటుంది. అద్భుతంగా నటించాడు. దర్శక రచయితలు ఎంతో జాగ్రత్త తీసుకుని ఆ పాత్రను క్రియేట్‌ చేశారు. ప్రేక్షకుల్లో ఆయనకు ఎలాంటి వ్యతిరేకత రాకుండా.. అతడు దుర్మార్గుడిగా ఎలా మారాడు.. అనే సీన్స్‌ను తీర్చిదిద్దారు. అయితే, స్క్రీన్‌పై అరవింద్‌ స్వామిని చూస్తే ప్రేక్షకులకు ఒక లవర్‌బాయ్‌ గుర్తుకు వస్తాడు. ఆ పాత్రలో ఆయన కాకుండా మరొకరు ఎవరైనా చేసి ఉంటే.. సెకండాఫ్‌ కథనం కొంచెం బెటర్‌గా ఉండేది. 

ఇక, అక్కినేని కుటుంబం అనగానే చక్కటి ప్రేమకథను ప్రేక్షకులు ఊహించుకుంటారు. వాళ్లు మాస్‌ సినిమాలు చేసినప్పటికీ.. ఆయా సినిమాల్లో లవ్‌ యాంగిల్‌ ఎక్కువగా ఉండేది. అదే ఆ సినిమాను కాపాడేది. ఈ సినిమాలో అదే కొరవడింది. ఈ సినిమాలో పాత్రల చిత్రీకరణ, నటుల ఎంపిక.. అన్నీ చక్కగానే కుదిరాయి. నాగచైతన్య బాడీ లాంగ్వేజ్‌కు కావాల్సినటువంటి ప్రేమకథ మిస్‌ అయ్యినట్టు అనిపించింది. వెన్నెల కిషోర్‌తో హీరోయిన్‌ పెళ్లి అని చూపించి.. ఆ సీన్స్‌ అన్నీ కామెడీగా నడిపించారు. అవి అనవసరమైన లెంగ్త్‌ క్రియేట్‌ చేసినట్టు అనిపించింది. అలా, కాకుండా ఫస్టాఫ్‌ మొత్తం చై-కృతిశెట్టిలపై బ్యూటీఫుల్‌ లవ్‌సీన్స్‌ క్రియేట్‌ చేసి.. సడెన్‌గా ఒక సమస్యను సృష్టించి ఉంటే సినిమా రిజల్ట్‌ మరో విధంగా ఉండేది. ట్రైన్‌ సీక్వెన్స్‌ అద్భుతంగా చూపించారు’’ అని పరుచూరి వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని