NTR: ఎన్టీఆర్‌ నటించిన ఆ సినిమాకు అభిమానులెవ్వరూ వెళ్లాలనుకోలేదు..: పరుచూరి

ఎన్టీఆర్‌ (NTR) నటించిన పలు సినిమాల తాజాగా సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడారు.

Updated : 24 May 2023 16:28 IST

హైదరాబాద్‌: నందమూరి తారక రామారావు (NTR) నటించిన కొన్ని చిత్రాల గురించి ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ (Paruchuri Gopala Krishna) మాట్లాడారు. ఒక అభిమానిగా ఆయనకెంతో ఇష్టమైన ఎన్టీఆర్‌ చిత్రాల గురించి వివరించారు. పరుచూరి పలుకుల్లో (Paruchuri Palukulu) భాగంగా ఎన్టీఆర్‌ నటించిన సాంఘిక చిత్రాలు కొన్నింటి గురించి ప్రస్తావించారు. అందులో రామారావు నటనపై ప్రశంసలు కురిపిస్తూ ఆనాటి సంఘటనలను గుర్తుచేసుకున్నారు.

‘‘ఆరోజుల్లో ఎన్టీఆర్‌, నాగేశ్వరావు ఇద్దరూ సాంఘిక చిత్రాల్లో నటించేవారు. ‘కన్యాశుల్కం’తోనే (Kanyasulkam) తానేంటో ఎన్టీఆర్‌ నిరూపించుకున్నారు. ఆ తర్వాత వచ్చిన ‘కలిసివుంటే కలదు సుఖం’లో (Kalasi Vunte Kaladu Sukham) ఆయన పోస్టర్‌ చూసి చాలా మంది అభిమానులు ఆ సినిమాకు వెళ్లాలనుకోలేదు. వాళ్లు ఎంతగానో అభిమానించే హీరోను దివ్యాంగుడి పాత్రలో చూడాలా? అనుకున్నారు. కానీ ఆ సినిమా క్లైమాక్స్‌లో ప్రేక్షకులంతా ఈలలు వేశారు. ఆ చిత్రం ఎవరైనా చూడని వాళ్లుంటే ఎన్టీఆర్‌ నటన కోసమైనా కచ్చితంగా చూడాలి.

అలాగే ఎన్టీఆర్‌ నటించిన సినిమాల్లో ‘రక్త సంబంధం’ అద్భుతంగా ఉంటుంది. అప్పటి వరకు ఆయన పక్కన హీరోయిన్‌గా చేసిన సావిత్రిగారు ‘రక్తసంబంధం’లో ఆయనకు చెల్లెలిగా చేసి మెప్పించారు. ఈ సినిమా 25 వారాలు ఆడింది. అలాగే ఎన్టీఆర్‌ కెరీర్‌లో ‘గుండమ్మకథ’ మరో అద్భుతం. ఇప్పటి సినిమాలు చూసేవారంతా ఒక్కసారి ‘గుండమ్మకథ’ చూడాలి. అందులో ఎన్టీఆర్‌ వేషధారణ ఆయన డైలాగులు అందరినీ ఆకట్టుకుంటాయి. అలాగే ‘బడిపంతులు’లో ఎన్టీఆర్‌ ముసలివాడిగా కనిపించారు. టీచర్ల కష్టాలు తెలిసిన ప్రతి ఒక్కరికీ ఈ సినిమా జీవితకాలం గుర్తుంటుంది. ఇక ‘కొండవీటి సింహం’, ‘బొబ్బిలిపులి’, ‘జస్టిస్‌ చౌదరి’ ఈ  సినిమాల్లో ఎన్టీఆర్‌లోని సంపూర్ణమైన నటుడు బయటకు వచ్చారు’’ అని పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. నందమూరి తారక రామారావు నటించిన ప్రతి సినిమాను ప్రేమిస్తానని పరుచూరి చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని