Prabhas: ఇండస్ట్రీకి వచ్చాకే దాని ప్రాధాన్యం తెలిసింది: ప్రభాస్‌

తన విద్యాభ్యాసం, నట ప్రస్థానం గురించి ప్రభాస్‌ పలు సందర్భాల్లో పంచుకున్న విశేషాలు మీకోసం.. ఆదివారం ప్రభాస్‌ పుట్టినరోజు.

Updated : 23 Oct 2022 09:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆయన.. ‘జగమంత కుటుంబం నాది’ అని అంటే ప్రేక్షకులు భావోద్వేగానికి లోనయ్యారు. ‘వీలైతే ప్రేమిద్దాం డ్యూడ్‌’ అని చెబితే అందరూ ఫాలో అయ్యారు. ఆయన ‘ఒక్క అడుగు’ అంటూ హీరోయిజాన్ని చూపిస్తే అంతా విజిల్స్‌ వేశారు. ‘అమరేంద్ర బాహుబలి అను నేను’ అని ప్రమాణ స్వీకారం చేస్తే ఉప్పొంగిపోయారు. ‘ఆదిపురుష్‌’ అవతారంలో ‘నేనొస్తున్నా’ అని మాటివ్వడంతో  ఎప్పుడొస్తాడా? అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇన్ని విశేషాలున్న ఆ కటౌట్‌ ప్రభాస్‌దికాక (Prabhas) ఇంకెవరిది? ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక కథనం.. (Happy Birthday Prabhas)

ఆ రోజులను ఆస్వాదించలేకపోయా

ప్రభాస్‌ తన పాఠశాల రోజులను ఆస్వాదించలేకపోయానని ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. స్కూల్‌ డేస్‌ని గుర్తుచేసుకుంటూ.. ‘‘నేను ర్యాంకర్‌ను కాదు. యావరేజ్‌ స్టూడెంట్‌ని. ఎక్కువ సేపు తరగతి గదిలో కూర్చోవటం నాకు ఇబ్బందిగా అనిపించేంది. డ్రిల్‌ పీరియడ్‌ కోసం వేయి కళ్లతో ఎదురుచూసేవాణ్ని. క్లాస్‌ల నుంచి తప్పించుకునేందుకే ఆటలు ఆడాలనుకునేవాణ్ని తప్ప, నేనేం స్పోర్ట్స్‌ పర్సన్‌ని కాదు. బాస్కెట్‌ బాల్‌, వాలీబాల్‌ నా ఫేవరెట్‌ గేమ్స్‌. తొమ్మిది, పదో తరగతి హాస్టల్‌లో ఉండి చదువుకున్నా. అప్పుడు బాగా ఎంజాయ్‌ చేశా. అప్పటి మా సోషల్‌ టీచర్‌ నన్ను బాగా ఎంకరేజ్‌ చేశారు. నా స్నేహితులు నన్ను గజినీలా చూసేవారు. మతిమరుపు ఉండటం వల్ల పెన్ను మర్చిపోయి పరీక్షలకు హాజరయ్యేవాణ్ని. పుస్తకం ఓ చోట పెట్టి దాన్ని మరో చోట వెతికేవాణ్ని. ఈ వియషంలో ఇప్పుడు కాస్త మెరుగుపడ్డా’’ అని ప్రభాస్‌ చెప్పారు.

ఆ మాటకు షాక్‌ అయ్యారు

డిగ్రీ పూర్తయ్యాకా తానేం కావాలనుకుంటున్నారో ప్రభాస్‌కు స్పష్టత లేదు. సినిమాల్లోకి వచ్చే ఆసక్తి లేదు కాబట్టి పీజీ చేద్దామనుకున్నారు. కానీ, ఎందుకో ఓరోజు హీరో అవ్వాలనిపించిందట. తన సినీ రంగ ప్రవేశం గురించి వివరిస్తూ.. ‘‘నేను హీరోని అవుతారా’ అని అంటే నా స్నేహితుడు ‘నువ్వు హీరో ఏంట్రా బాబూ’ అంటూ నవ్వాడు. కుటుంబ సభ్యులు షాక్‌ అయ్యారు. చివరకు సత్యానంద్‌గారి దగ్గర శిక్షణకు పంపించారు. ఆయన దగ్గర నటనలో మూడు నెలలు ట్రైనింగ్‌ తీసుకున్నా. ఫైట్స్‌, డ్యాన్స్‌లో శిక్షణ తీసుకుందామనుకున్నా.. కుదర్లేదు. నిర్మాత అశోక్‌కుమార్‌ నన్ను హీరోగా పరిచయం చేయాలనుకుని నాన్న, పెద్దనాన్నను కలిశారు. ఆయన చెప్పిన కథ నచ్చటంతో ఇద్దరూ ఓకే చెప్పారు. ‘అప్పుడే నేను హీరో ఏంటి?’ అనే భయంతో కొంత సమయం కావాలని అడిగా. ‘ఇది మంచి అవకాశం. తొలి చిత్రమే మాస్‌ లవ్‌స్టోరీ చేయటం కెరీర్‌కు ప్లస్‌ అవుతుంది’ అని నాన్న, పెద్దనాన్న నచ్చజెప్పారు’’ అని ప్రభాస్‌ తెలిపారు.

ఫ్యాషన్‌ కోసం ఇటలీ వెళ్లి..

అలా అనుకోకుండానే ముఖానికి రంగేసుకుని ప్రభాస్‌ నటించిన తొలి చిత్రం ‘ఈశ్వర్‌’. సినిమా చూసిన తన తండ్రి  ‘బాగుందిరా’ అని చెప్పిన ఒకే ఒక మాటే ఎంతో ప్రోత్సాహాన్నిచ్చిందంటారు ప్రభాస్‌. ఆ తర్వాత ప్రభాస్‌ సృష్టించిన ప్రభంజనం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు కదా. రొటీన్‌కు భిన్నంగా ప్రభాస్‌ తనను తాను కొత్తగా ఆవిష్కరించుకున్న చిత్రం ‘బుజ్జిగాడు’. దీనికోసం ఫ్యాషన్‌ డిజైనర్‌ అయిన తన స్నేహితుడితో కలిసి మిలాన్‌ (ఇటలీ) వెళ్లి అక్కడి ఫ్యాషన్‌ మెలకువలు నేర్చుకున్నారట.

హైటు మాట..

‘‘నాకు 19 ఏళ్లు వచ్చే వరకూ ఎత్తు ప్రాముఖ్యతేంటో తెలియలేదు. మా ఇంట్లో అందరూ ఆరడుగుల పైనే ఉంటారు కాబట్టి ఎప్పుడూ అదో పెద్ద విషయంలా అనిపించలేదు. కానీ, హైట్‌కు ఎంత ప్రాధాన్యం ఉందో పరిశ్రమకు వచ్చాకే అర్థమైంది’’ అంటారు ప్రభాస్‌.

అందుకే డార్లింగ్‌ అనే పిలుపు..

ప్రభాస్‌కు డార్లింగ్‌ అనే పదానికి విడదీయలేని సంబంధం ఉంది. ప్రభాస్‌ అందరినీ డార్లింగ్‌ అని పిలుస్తుంటంతో అది ఓ బ్రాండ్‌గా మారింది. ‘చాలామంది సాధారణంగా ఎవరినైనా పిలవాల్సివస్తే ‘భయ్యా, బ్రదర్‌, బ్రో, అన్నా’ అని పిలుస్తుంటారు. నాకు అలా పిలవాలంటే ఇబ్బంది. అందుకే డార్లింగ్‌ అని పిలుస్తా. ‘బుజ్జిగాడు’ సినిమాతో దర్శకుడు పూరీ జగన్నాథ్‌ దాన్ని మరింత పాపులర్‌ చేశారు’ అని ప్రభాస్‌ ఓ సందర్భంలో తెలిపారు.

పుట్టినరోజు శుభాకాంక్షలతోపాటు దీపావళి విషెస్‌ అందుకో డార్లింగ్‌ (Happy Birthday Darling). దీపావళి అంటే ప్రభాస్‌కు మహా ఇష్టం. ‘‘దీపావళి రోజు మేం చేసే సెలబ్రేషన్స్‌ చూస్తే కొత్తవాళ్లు భయపడతారు. మేం కాల్చే టపాసులు చూసి టెర్రరిస్టులా ఉన్నామంటుంటారు’’ అని ప్రభాస్ ఓ సందర్భంలో వివరించారు. ఈ ఏడాది నవంబరు 11తో నటుడిగా 20 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్న ప్రభాస్‌ ఇష్టాలివీ..

* ప్రభాస్‌ నటుడు కాకపోయుంటే..? హోటల్‌ రంగంలో స్థిరపడేవారు.

* ఇష్టమైన పాట: ‘వర్షం’లోని ‘మెల్లగా కరగనీ రెండు మనసుల దూరం’.

* నటులు: షారుఖ్‌ఖాన్‌, సల్మాన్‌ఖాన్‌, రాబర్ట్‌ డి నిరో, జయసుధ, శ్రియ, త్రిషలకు ప్రభాస్‌ అభిమాని.

* సినిమా: ‘త్రీ ఇడియట్స్‌’, ‘మున్నాభాయ్‌ ఎంబీబీఎస్‌’, ‘పోకిరి’, ‘ఇడియట్‌’, రాజేంద్ర ప్రసాద్‌ హీరోగా తెరకెక్కిన చిత్రాలు.

* కలిసి పనిచేయాలనుకునే దర్శకుడు: రాజ్‌కుమార్‌ హిరానీ.

* ప్రదేశం: లండన్‌, దుబాయ్‌, ప్యారిస్‌, శ్రీశైలం.

* ప్రభాస్‌ ఖాళీ సమయంలో పుస్తకాలు చదువుతారు. స్నేహితులను కలిసి ముచ్చటిస్తారు.

* ప్రముఖ మ్యూజియం మేడమ్‌ టుసాడ్స్‌లో క్యారెక్టర్‌తో చేసిన మైనపు విగ్రహం కలిగిన తొలి దక్షిణాది స్టార్‌గా ప్రభాస్‌ గుర్తింపు పొందారు.

* స్టార్‌డమ్‌ సొంతం చేసుకుని ఎన్నో ఏళ్లయినా ప్రభాస్‌ ప్రకటనలకు కాస్త దూరంగా ఉన్నారు. 2015లో తొలిసారి ఓ కారు ప్రచారంలో భాగంగా వాణిజ్య ప్రకటనలో నటించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని