Prashanth Neel: సినిమాలు క్రికెట్‌ మ్యాచ్‌లాంటివి కావు..:ప్రశాంత్‌ నీల్‌

రెండు సినిమాల మధ్య పోటీ ఎప్పుడూ ఉండదని దర్శకుడు ప్రశాంత్ నీల్ అన్నారు. దర్శక నిర్మాతలు కూడా పోటీ ఉండాలని కోరుకోరని చెప్పారు.

Published : 31 Dec 2023 01:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ (Prabhas) హీరోగా వచ్చిన ‘సలార్‌’ ఈ ఏడాది బిగ్గెస్ట్‌ హిట్‌ల జాబితాలో చేరింది. ఈ విజయంపై ఆయన (Prashanth Neel) ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ‘డంకీ’, ‘సలార్‌’ మధ్య సోషల్‌ మీడియాలో ఫైట్‌ గురించి ఆయన మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

‘‘ఇద్దరు హీరోల సినిమాల మధ్య పోటీ పెడుతూ కొందరు అభిమానులు గొడవ పడుతుంటారు. నేను ఇలాంటివాటిని ప్రోత్సాహించను. వినడానికి కూడా ఇష్టపడను. ఈ తరహా పోకడలు సినిమా రంగానికే మంచిది కాదు. నటీనటులు అలా ఒకరితో ఒకరు పోటీ పెట్టుకోరు. వాళ్లంతా స్నేహభావంతో ఉంటారు. ఇక అందరూ అనుకుంటున్నట్లు ‘సలార్‌’, ‘డంకీ’ మధ్య నెగెటివ్‌ వాతావరణం ఉండాలని నేనెప్పుడూ కోరుకోలేదు.. ‘డంకీ’ నిర్మాతలు కూడా అలానే ఆలోచించి ఉంటారు. మేమంతా ఒక్కటే.. ప్రేక్షకులకు వినోదాన్ని పంచాలనే తపన మా అందరిలో ఉంటుంది. రెండింటి మధ్య పోటీ ఉండడానికి ఇదేం క్రికెట్‌ మ్యాచ్‌ కాదు కదా’’ అన్నారు. అలాగే ‘సలార్‌’ (Salaar) సినిమాకు తగిన ప్రచారం చేయలేదని చేసి ఉంటే ఇంకా ఎక్కువ కలెక్షన్లు వచ్చేవంటూ వస్తోన్న వార్తలపై ఆయన స్పందించారు. ‘డంకీ’తోపాటు కాకుండా సోలోగా విడుదలైతే ఇలాంటి వార్తలు వచ్చేవి కాదన్నారు. రెండు సినిమాల మధ్య పోటీ పెట్టి ఒకదాన్ని తక్కువగా చూడొద్దని హితవు పలికారు.

ఇక డిసెంబర్‌ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘సలార్‌’ భారీ విజయాన్ని అందుకొని మంచి వసూళ్లను సొంతం చేసుకుంటోంది. త్వరలోనే దీని రెండో భాగం కూడా ప్రారంభంకానుంది. ‘శౌర్యాంగ ప‌ర్వం’ పేరుతో రానున్న దాన్ని స్క్రిప్ట్‌ ఇప్పటికే సిద్ధమైంది. వచ్చే ఏడాదిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. మొదటి భాగం కంటే ఇది మరింత అద్భుతంగా ఉండనుందని చిత్రబృందం తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని