Dil Raju: పదవి ముఖ్యం కాదు.. ఇండస్ట్రీ ఒకే తాటిపైకి రావాలి: దిల్‌రాజు

ఈ నెల 30న జరగనున్న తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఎన్నికల నేపథ్యంలో.. అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న ప్రముఖ నిర్మాత దిల్‌ రాజ్‌ ఓ ప్రకటన విడుదల చేశారు.

Published : 27 Jul 2023 21:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఒకరిపై నిందలు వేయడం తనకు రాదని ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు (Dil Raju) అన్నారు. పదవి ముఖ్యంకాదని, తెలుగు చలన చిత్ర పరిశ్రమను ఒకే తాటిపైకి తీసుకురావాలన్నదే తన లక్ష్యమన్నారు. ఈ నెల 30న తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ (Telugu Film Chamber Of Commerce) ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తన ప్యానల్‌ సభ్యుల వివరాలు వెల్లడించిన ఆయన తానెందుకు అధ్యక్షుడిగా ఎన్నికల్లో పోటీ చేయాల్సి వస్తుందో తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.

‘‘ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎలక్షన్స్ జరిగే సమయంలో యలమంచి రవిచంద్ వచ్చి ‘మీరు ఎన్నికలో పాల్గొనాలి’ అని అడిగాడు. ‘ఎందుకు రావాలి’ అని ఆయన్ను అడిగితే.. కౌన్సిల్ బాగుండాలి, అభివృద్ధి జరగాలి, ఆర్థికంగా చితికిపోయిన నిర్మాతలకు సహాయం చేయాలని అన్నారు. మీ సమస్యలను మీరు పరిష్కరించుకోగలరు కాబట్టి కౌన్సిల్ వెల్ఫేర్‌ కోసం ముందుకు రావాలన్నారు. వెల్ఫేర్ కోసమైతే అవసరమైన ఫండ్స్ ఇస్తామని చెప్పా. తర్వాత, ‘మీరు వచ్చి కౌన్సిల్‌లో కలిసి పోవాలి. గిల్డ్‌నీ కలపాలి’ అన్నారు. కౌన్సిల్ బై లా ఛేంజ్‌ అయిన వెంటనే గిల్డ్‌ని కౌన్సిల్‌లో కలుపుతాం, లేని పక్షంలో కలపం అని చెప్పా. ‘‘ఇన్సూరెన్స్ కార్డ్ విషయంలో నిర్మాతలు చాలా ఇబ్బంది పడుతున్నారు. దాని షరిష్కారం కోసమైనా మీరు ఎన్నికల్లో పోటీ చేయాలి’’ అని అడిగారు. దానికి అంగీకరించా. అప్పుడు మీరు గెలిపించారు’’

తమిళ చిత్రపరిశ్రమకు పవన్‌ విజ్ఞప్తి.. ఆ వార్తలు నిజం కాదు: నాజర్‌

‘‘ఈ క్రమంలో ఇన్సూరెన్స్‌ కార్డ్ తీసుకురావడానికి అన్ని కంపెనీలతో మాట్లాడాం. ఏది తక్కువకు వస్తుందో తెలుసుకొని ఇంప్లిమెంట్‌ చేసేందుకు ఆలస్యమైంది. అయినా నాలుగు లక్షల ఇన్సూరెన్స్ కార్డులు తీసుకు వచ్చాం. ఇంతకు ముందు ఉన్న దానికన్నా పెన్షన్‌ ఎక్కవ ఇచ్చాం. మిగిలిన హామీలు నెరవేర్చేందుకు కొంత ఫండ్‌ అవరసం ఉంది. ఆలస్యమైనా ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తాం’’

‘‘ఇప్పుడు ఛాంబర్‌ ఎన్నికల సమయం ఆసన్నమైంది. ప్రెస్‌మీట్‌లు పెట్టి, ఒకరినొకరు నిందించుకోవడం మాకు ఇష్టం ఉండదు. మాకు పదవి ముఖ్యం కాదు. ఈ విషయం ప్రతి సభ్యుడికీ తెలుసు. కౌన్సిల్‌ ఎన్నికల్లో పోటీకి మమ్నల్ని ఆహ్వానిస్తే ఎలా పనిచేశామో ఇప్పుడు అలానే చేయాలనుకుంటున్నాం. కానీ, గతంలో జరిగిన షూటింగ్‌ బంద్‌ విషయాన్ని హైలైట్‌ చేసి చూపిస్తున్నారు. కొంత ఒత్తిడి వల్ల అప్పుడు మేం సినిమాల చిత్రీకరణ ఆపలేని పరిస్థితి వచ్చింది. UFO, QUBE సిస్టమ్‌ల సమస్య ఎప్పటి నుంచో ఉంది. ఒక్క రోజులో మార్పు తీసుకురావడం కష్టం. అయినా పరిష్కార మార్గాలను అన్వేషిస్తున్నాం’’

‘‘ఇప్పుడు ఉన్న మా ప్యానల్‌లో రెగ్యులర్‌గా పెద్ద సినిమాలు చేసే ప్రొడ్యూసర్స్ 70%, రెగ్యులర్‌గా చిన్న సినిమాలు నిర్మిస్తున్న ప్రొడ్యూసర్స్ 30% ఉన్నారు. మోహన్ వడ్లపట్ల, బెక్కం వేణుగోపాల్, వై. రాజీవ్ రెడ్డి, సతీష్ వేగేశ్న, నక్కా రాహుల్ యాదవ్, మోహన్ గౌడ్, పి.ఎల్.కె రెడ్డి, జె. సాంబశివ రావ్, పద్మిణి నాగుల పల్లి తదితరులున్నారు. మా ప్యానల్‌ని గెలిపించండి. చదలవాడ శ్రీనివాస రావు గిల్డ్‌ని కౌన్సిల్‌లో కలపమని అడిగారు. ఆయనకు మాట ఇస్తున్నా.. కౌన్సిల్ బై లా మారిన వెంటనే కౌన్సిల్‌లో గిల్డ్‌ని కలుపుతాం. ఫిల్మ్ ఛాంబర్‌కి సంబంధించిన అన్ని సెక్టార్‌లను అభివృద్ధి చేసి, ఇండస్ట్రీ మొత్తాన్ని ఒకే  గొడుగు కిందకి తీసుకురావాలనేదే మా ప్రయత్నం. ఛాంబర్ సభ్యుల సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తాం’’ అని నిర్మాతలకు దిల్‌ రాజు హామీ ఇచ్చారు. హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్‌ హౌసింగ్‌ సొసైటీ బిల్గిండ్‌ ఫస్ట్ ఫ్లోర్‌లో ఆదివారం ఉదయం 8గం.ల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ ఎన్నికలు జరగనున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని