Rajamouli: ఆమిర్‌ఖాన్‌‌.. మా అగ్రిమెంట్‌ని బ్రేక్‌ చేశారు: రాజమౌళి

ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రెస్‌మీట్‌

Updated : 07 Apr 2022 14:27 IST

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ @ వెయ్యి కోట్లు.. టీమ్‌ ప్రెస్‌మీట్‌

ముంబయి‌: తమ మధ్య ఉన్న అగ్రిమెంట్‌ను బాలీవుడ్‌ నటుడు ఆమిర్‌ఖాన్‌ బ్రేక్‌ చేశారని ప్రముఖ దర్శకుడు రాజమౌళి అన్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ప్రపంచవ్యాప్తంగా రూ.వెయ్యి కోట్లు రాబట్టిన నేపథ్యంలో బుధవారం ముంబయిలో సక్సెస్‌ పార్టీ ఏర్పాటు చేశారు. బాలీవుడ్‌ నటుడు ఆమిర్‌ఖాన్‌, కరణ్‌ జోహార్‌ తదితరులు ఈ పార్టీలో పాల్గొని.. రాజమౌళి వర్కింగ్‌ స్టైల్‌ని కొనియాడారు. ఇంతటి అద్భుతమైన చిత్రాన్ని తెరకెక్కించిన టీమ్‌ మొత్తానికి అభినందనలు తెలిపారు. ఇందులో భాగంగా ఆమిర్‌ మాట్లాడుతూ.. ‘‘సినిమా విడుదలకు ముందు చిత్రబృందం ఎంతటి ఒత్తిడికి గురవుతుందో నాకు తెలుసు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ విడుదలై ఇంతటి ఘన విజయం సాధించిన తర్వాత రాజమౌళి గారు, ఆయన టీమ్‌ మొత్తం ఎంతో ఆనందంగా ఉంది. రాజమౌళి.. ఇలాగే అద్భుతమైన విజయాలు అందుకోవాలని, మంచి సినిమాలతో మమ్మల్ని ఎప్పుడూ ఎంటర్‌టైన్‌ చేయాలని కోరుకుంటున్నా’’ అని ఆమిర్‌ తెలిపారు. ‘‘ఆమిర్‌ఖాన్‌, నాకు మధ్య ఒక ఒప్పందం ఉంది. కేవలం పేర్లు పెట్టి మాత్రమే పిలుచుకోవాలని, సర్‌, గారు, అనే పదాలు ఉపయోగించుకోకూడదని ఇటీవల మా మధ్య ఓ అగ్రిమెంట్‌ పెట్టుకున్నాం. ఆయన్ని సర్‌ అని కాకుండా ‘ఏకే’ పిలవడానికి నేను ఇబ్బందిపడ్డాను. ఆమిర్‌ ఒత్తిడి చేయడంతోనే నేను ఆయన్ని ‘ఏకే’ అని పిలువగలిగాను. కానీ, ఇప్పుడు ఆయన మా మధ్య ఉన్న అగ్రిమెంట్‌ను బ్రేక్‌ చేసి నన్ను రాజాజీ అని పిలుస్తున్నారు(నవ్వులు)’’ అని రాజమౌళి అన్నారు. ఈ సక్సెస్‌మీట్‌లో చిత్రబృందం పంచుకున్న విశేషాలివే..

ఒక సినిమా కోసం మూడు లేదా నాలుగేళ్లు కేటాయించాల్సి వస్తే ఒకేనా?

తారక్‌, చరణ్‌: తప్పకుండా మంచి కథ ఉండి, స్క్రిప్ట్‌ డిమాండ్‌ చేస్తే కచ్చితంగా అంతకాలం సమయం ఇస్తాం.

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత స్టార్‌డమ్‌ మరింత పెరిగిందనుకుంటున్నారా?  

చరణ్‌: నా దృష్టిలో స్టార్‌డమ్‌ అంటే ఉదయాన్నే 5 గంటలకు నిద్రలేవడం, 7 గంటలకల్లా సెట్‌లోకి అడుగుపెట్టడం, 7.30కి ఫస్ట్‌ షాట్ కంప్లీట్‌ చేయడం, సాయంత్రం ఇంటికి వచ్చాక ఫ్యామిలీతో సమయం గడపటం, జిమ్‌, డిన్నర్‌, నిద్ర.. దీన్నే ప్రతి రోజూ ఫాలో కావడం. ప్రతిరోజూ ఇదే పనిచేయడం బోరింగ్‌గా ఉండొచ్చు. కానీ, ఒక నటుడిగా మనమెప్పుడూ క్రమశిక్షణతో ఉండాలి. అదే మనకు స్టార్‌డమ్‌ తెచ్చిపెడుతుంది. అలా వచ్చిన స్టార్‌డమ్‌ని మరలా క్రమశిక్షణతోనే కాపాడుకోవాలి.

తారక్‌: చరణ్‌ ఏదైతే చెప్పాడో అది పూర్తిగా నిజం.

ఈ సినిమాలో మీకు బాగా నచ్చిన సన్నివేశాలు?

చరణ్‌: ఇంటర్వెల్‌ పార్ట్‌ నాకు బాగా ఇష్టం. రామ్‌-భీమ్‌ల మధ్య వచ్చే మనస్పర్థలు.. ఆ తర్వాత వచ్చే ఎపిసోడ్‌ నాకెంతో నచ్చేశాయి.

తారక్‌: నాకు కూడా అదే సీన్లు ఇష్టం.

రాజమౌళి సర్‌.. మిమ్మల్ని అత్యద్భుతమైన స్టోరీ టెల్లర్‌ అని పిలవచ్చా?

రాజమౌళి: మీకు నా సినిమాలు నచ్చినంత వరకూ మీరు నన్ను ఎలా పిలిచినా ఆనందిస్తాను.

‘బాహుబలి’, లేదా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’.. ఏ సినిమా మీ హృదయానికి దగ్గరైంది?

రాజమౌళి: ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం చాలా కష్టం. ప్రస్తుతం నేను ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కి ఎంతో దగ్గరయ్యాను. ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రాలను పోల్చి చూసినా, నా ఫిల్మోగ్రఫీ మొత్తంలో నాకిష్టమైన చిత్రాన్ని చెప్పమని కోరినా ప్రస్తుతానికి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ అనే చెబుతా. ఎందుకంటే నేను భావోద్వేగ పరంగా ఆ చిత్రానికి కనెక్ట్‌ అయిపోయాను. సుమారు 8 నెలల తర్వాత మీరు నన్ను ఇదే ప్రశ్న అడిగితే అప్పుడు నేను సరైన సమాధానం చెప్పగలనేమో. 

కొరటాల శివ ప్రాజెక్ట్‌ గురించి ఏమైనా చెప్పగలరు?

తారక్‌: నా తదుపరి ప్రాజెక్ట్‌ కొరటాల శివతోనే. ఆ ప్రాజెక్ట్‌ గురించి ఇప్పుడే ఏం చెప్పలేను. త్వరలోనే వివరాలు చెబుతా

రామ్‌చరణ్‌కు ఎక్కువ ప్రశంసలు లభిస్తున్నాయి కదా?
రామ్‌చరణ్‌: ఆ మాటను నేను ఏకీభవించను. ఒక్కక్షణం కూడా నేను దాన్ని నమ్మను. మేమిద్దరం చాలా బాగా నటించాం. ఎన్టీఆర్‌ అద్భుతంగా చేశాడు. ఇప్పటివరకూ ఏ చిత్రానికి చేయనంత ఎంజాయ్‌మెంట్‌ ఈ సినిమా చేసేటప్పుడు ఫీలయ్యాను. తారక్‌తో నా ప్రయాణాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఈ అవకాశాన్ని కల్పించిన రాజమౌళికి థ్యాంక్స్‌.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని