Jailer movie: రజనీ మేనియా.. బెంగళూరు, చెన్నైలలో పలు ఆఫీస్‌లకు సెలవు

రజనీకాంత్‌ కథానాయకుడిగా నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ తెరకెక్కించిన ‘జైలర్‌’ మూవీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో సినిమా విడుదల రోజున పలు ఆఫీస్‌లు సెలవు ప్రకటించాయి.

Updated : 08 Aug 2023 17:04 IST

Jailer Movie: ప్రపంచవ్యాప్తంగా అశేష అభిమానులను సొంతం చేసుకున్న స్టార్‌ హీరో రజనీకాంత్‌ (Rajinikanth). ఆయన సినిమా వస్తుందంటే భాషతో సంబంధం లేకుండా సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు.  నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో ఆయన కథానాయకుడిగా రూపొందిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘జైలర్‌’ (Jailer). అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సామాజిక మాధ్యమాల వేదికగా రజనీ సినిమా ముచ్చట్లు తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌ చూస్తే, పాత రజనీకాంత్‌ను గుర్తు చేస్తోంది. మరోవైపు ఇప్పటికే ‘జైలర్‌’కు భారీ  బుకింగ్స్‌ జరుగుతున్నాయి. బుక్ మై షో గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా జైలర్‌ మూవీ చూసేందుకు 2.90లక్షల టికెట్స్‌ బుక్‌ అయ్యాయి. ‘గదర్‌ 2’ 56 వేలు, భోళా శంకర్‌ 17 వేలు, ఓఎంజీ2- 9 వేలు ముందస్తు బుకింగ్స్‌ అయ్యాయి.  ఈ క్రమంలో బెంగళూరు, చెన్నైలలో పలు ఆఫీస్‌లు సినిమా విడుదల రోజు సెలవు ప్రకటించాయి. ఇందుకు సంబంధించిన నోటఫికేషన్లు సామాజిక మాధ్యమాల వేదికగా వైరల్‌ అవుతున్నాయి.

రజనీకాంత్‌ సినిమా చూసేందుకు ఆయన అభిమానులు ఏదో ఒక సాకు చెప్పి సెలవు పెట్టేస్తుంటారు. గతంలో ఇలాంటి సంఘటనలు జరగడంతో వివిధ ఆఫీస్‌లు ఆగస్టు 10న సెలవు ప్రకటించాయి. ఇందుకు సంబంధించిన ప్రకటనను హెచ్‌ఆర్‌ డిపార్ట్‌మెంట్‌ ఆయా ఉద్యోగులకు పంపాయి. యూఎన్‌వో ఆక్వా ఇచ్చిన ప్రకటన సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. ‘జైలర్‌’విడుదలకు మరొక్క రోజే సమయం ఉండటంతో మరిన్ని కార్యాలయాలు సెలవులు ప్రకటించే అవకాశం ఉంది.

రజనీ అత్యధిక వసూలు సాధించిన టాప్‌-7 మూవీలివే!

రజనీకాంత్‌ సినిమా అంటే వసూళ్లు సునామీ సృష్టించాల్సిందే. ఏ మాత్రం పాజిటివ్‌ టాక్‌ వచ్చినా, దాన్ని ఆపటం ఎవరితరం కాదు. రజనీ కెరీర్‌లో అత్యధికంగా 2.ఓ రూ.800 కోట్లు (గ్రాస్‌) వసూలు చేసింది. ఆ తర్వాత రోబో (రూ.290 కోట్లు), కబాలి (రూ.286 కోట్లు), పేట (రూ.230 కోట్లు), దర్బార్‌ (రూ.200 కోట్లు) వసూళ్లు సాధించాయి. ఇప్పుడు ‘జైలర్‌’ ఆ రికార్డులను తిరగ రాస్తుందో లేదో చూడాలి. జైలర్‌లో తమన్నా, జాకీ ష్రాఫ్‌, మోహన్‌లాల్‌, శివరాజ్‌కుమార్‌ కీలక పాత్రలు పోషించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని