Upasana: ‘ఉపాసన.. పిల్లలెప్పుడు’.. అని అడుగుతున్నారు.. సద్గురు సమాధానం

సినీ తారల విషయంలో కొందరు అత్యుత్సాహం చూపుతుంటారు. పరిధులు దాటి వారి వ్యక్తిగత జీవితం గురించి ప్రశ్నిస్తుంటారు. ఆయా ప్రముఖులు సమాధానం చెప్పినా మళ్లీ మళ్లీ అడుగుతుంటారు. ఇలాంటి పరిస్థితి ఎదురైనా వారిలో ప్రముఖ నటుడు రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన ఒకరు. 

Updated : 05 Jul 2022 15:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖుల విషయంలో కొందరు అత్యుత్సాహం చూపుతుంటారు. పరిధులు దాటి వారి వ్యక్తిగత జీవితం గురించి ప్రశ్నిస్తుంటారు. ఆయా వ్యక్తులు సమాధానం చెప్పినా మళ్లీ మళ్లీ అడుగుతుంటారు. ఇలాంటి పరిస్థితి ఎదురైన వారిలో ప్రముఖ నటుడు రామ్‌చరణ్‌ (Ram Charan) సతీమణి ఉపాసన (Upasana) ఒకరు. పిల్లల గురించి ఎవరెన్నిసార్లు అడిగినా ఉపాసన స్పందించేవారు కాదు. అలాంటిది ఆమె ఓ వేదికపై ఈ విషయాన్ని ప్రస్తావించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇషా ఫౌండేషన్‌ స్థాపకులు, ఆధ్యాత్మిక గురువు జగ్గీవాసుదేవ్‌ (Sadhguru) కార్యక్రమంలో ఉపాసన ఇటీవల పాల్గొన్నారు. ఆయనతో ఎన్నో విషయాలపై చర్చించిన ఉపాసన వ్యక్తిగతంగా తాను ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని వివరించారు.

‘‘మా పెళ్లై పదేళ్లయింది. నా వైవాహిక జీవితం చాలా చాలా ఆనందంగా ఉంది. నా జీవితం, నా కుటుంబాన్ని నేనెంతో ప్రేమిస్తున్నా. ఇదిలా ఉంటే కొంతమంది అదే పనిగా నా RRR (రిలేషన్‌షిప్‌, రీప్రొడ్యూస్‌, రోల్‌ ఇన్‌ మై లైఫ్‌) గురించి ప్రశ్నిస్తుంటారు ఎందుకు?. ఈ పరిస్థితి నా ఒక్కదానికే కాదు ఎందరో మహిళలకు ఎదురవుతోంది’’ అని ఉపాసన.. సద్గురుని సమాధానం కోరారు. ‘‘రిలేషన్‌పిష్‌.. అది వ్యక్తిగత అంశం కాబట్టి దాని గురించి నేనేం చెప్పలేను. రీప్రొడక్షన్‌ విషయానికొస్తే.. పిల్లలు కనకుండా ఉంటే నేను అవార్డు ఇస్తా. ఆరోగ్యం, సంతాన సామర్థ్యం ఉన్నా పిల్లలు కనకూడదని నిర్ణయించుకున్న వారికి అవార్డు ఇస్తానని నేనిప్పటికే ప్రకటించా. ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లలు కనకపోవడమే గొప్ప సేవ చేసినట్టు. ఒకవేళ మీరు పులి అయితే పిల్లలు కనమని చెప్పేవాడ్ని. ఎందుకంటే ఆ జాతి అంతరించిపోతోంది కాబట్టి. ఇదేమీ అంతరించిపోయే జంతుజాలం గురించి చెప్పే ఉపన్యాసం కాదు. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ అద్భుతమే. రాబోయే 30- 35 సంవత్సరాల్లో ప్రపంచ జనాభా 10 బిలియన్లకు చేరువయ్యే అవకాశం ఉంది. అప్పుడు ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయి. ఉండటానికి కూడా చోటు సరిపోదు. పర్యావరణ విపత్తు సంభవించవచ్చు. మనసు పెట్టి ఆలోచిస్తే జనాభా తగ్గించటం అనేది సాధ్యపడుతుంది. బుర్రకు పని చెప్పకపోతే స్త్రీ/పురుష జననేంద్రియాలు మరింత యాక్టివ్‌గా పనిచేస్తాయి. దీని వల్ల ఈ ప్రపంచంలోకి మరింత మంది మనుషుల అడుగులు పడతాయి. ఒకానొక దశ దాటిని తర్వాత మనం కాలు కూడా కదలలేని పరిస్థితి ఎదురవుతుంది. అలాంటి అవకాశం ఇవ్వకూడదంటే రెండో ఆప్షన్‌గా అవార్డులు ప్రదానం చేయడమే’’ అని సద్గురు వివరించారు. ‘‘మా అమ్మ, అత్తయ్య నుంచి మీకు కాల్‌ వస్తుంది’’ అని సద్గురుతో ఉపాసన నవ్వుతూ చెప్పారు. 2012 జూన్‌ 14న చరణ్‌, ఉపాసన వివాహ బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని