Ramayan: బుల్లితెర ప్రేక్షకుల కోసం మరోసారి ‘రామాయణ్‌’..

 రామానంద్‌ సాగర్‌ తెరకెక్కించిన రామాయణ్‌ (Ramayan) సీరియల్‌ మరోసారి అలరించేందుకు సిద్ధమైంది.

Published : 31 Jan 2024 02:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రామాయణం ఆధారంగా ఎన్ని ధారావాహికలు, సినిమాలు వచ్చినప్పటికీ ఆ పేరు చెప్పగానే ప్రేక్షకులకు గుర్తొచ్చేది మాత్రం రామానంద్‌ సాగర్‌ తెరకెక్కించిన ‘రామాయణ్‌’ సీరియలే. రికార్డు స్థాయిలో వ్యూస్‌ను సొంతం చేసుకున్న ఆ సీరియల్‌ ఇప్పుడు మరోసారి అలరించేందుకు సిద్ధమైంది. ఈవిషయాన్ని దూరదర్శన్‌ తన అధికారిక సోషల్ మీడియాలో పోస్ట్‌ చేసింది. ‘రాముడు మరోసారి మీ ముందుకు వస్తున్నాడు. దేశవ్యాప్తంగా అత్యంత ప్రేక్షకాదరణ పొందిన ‘రామాయణ్‌’ త్వరలోనే దూరదర్శన్‌లో ప్రసారం కానుంది’ అని పేర్కొంది. దీంతో బుల్లితెర ప్రేక్షకులు ఆనందిస్తున్నారు. ఇందులో రాముడిగా అరుణ్ గోవిల్ (Arun Govil) - సీతగా దీపికా చిక్లియా నటించారు. లక్ష్మణుడి పాత్రలో సునీల్‌ లహ్రీ (Sunil Lahri) తన నటనతో అందరినీ ఆకర్షించారు.

ఈ వారం థియేటర్‌లో చిన్న చిత్రాలదే హవా.. మరి ఓటీటీలో..?

‘రామాయణ్‌’ సీరియల్‌ రీ టెలికాస్ట్‌ అవడం ఇది రెండోసారి. 1987 జనవరి 25 నుంచి 1988 జులై 31 వరకు ప్రతి ఆదివారం ఉదయం 9:30 గం.లకు దూరదర్శన్‌లో ఈ సీరియల్‌ ప్రసారమైంది. ఆ తర్వాత కొవిడ్‌ సమయంలో దీన్ని రీ టెలికాస్ట్‌ చేశారు. లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైన ప్రజల కోసం ఈ ధారావాహికను పునః ప్రసారం చేయాలని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ నిర్ణయించింది. దీంతో 2020లో మార్చి 28 నుంచి ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో దీన్ని ప్రసారం చేశారు. ఇది అత్యంత ప్రేక్షకాదరణతో పాటు ఎన్నో రికార్డులను కూడా సొంతం చేసుకుంది. మొదటిసారి టెలికాస్ట్‌ అయినప్పుడే ఎక్కువమంది వీక్షించిన సీరియల్‌గా లిమ్కా బుక్‌ రికార్డుల్లో చోటు దక్కించుకుంది. ఆతర్వాత 2020 ఏప్రిల్‌ 16న 7.7 కోట్ల వ్యూస్‌తో ప్రపంచ రికార్డును నమోదు చేసింది. ఇప్పుడు మరోసారి ఏ రికార్డును సొంతం చేసుకుంటుందో వేచిచూడాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని