Sai Pallavi: రాముడిగా రణ్‌బీర్‌.. సీతగా సాయిపల్లవి ఫిక్స్‌!

అల్లు అరవింద్‌ (Allu Aravind) నిర్మాతగా నితేశ్‌ తివారీ దర్శకత్వంలో రామాయణం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తారాగణానికి సంబంధించిన వార్త సినీప్రియుల్ని ఆకట్టుకుంటోంది.

Published : 04 Oct 2023 15:37 IST

ముంబయి: రామాయణాన్ని తెరకెక్కించేందుకు బాలీవుడ్‌కు చెందిన నితేశ్‌ తివారీ ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజులుగా దీనిపై ఎన్నో వార్తలు వస్తున్నాయి. తాజాగా మరోసారి ఈ సినిమాకు సంబంధించి కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. ఇందులోని తారాగణానికి సంబంధించిన వార్తలు ఇప్పుడు సినీప్రియులను ఆసక్తి కలిగిస్తున్నాయి.

నితేశ్‌ తివారీ (Nitesh Tiwari) దర్శకత్వంలో రానున్న ఈ సినిమాలో రాముడి పాత్రలో రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) ఖాయమయ్యారని గతంలోనే వార్తలు వచ్చాయి. ఇందులో సీత పాత్ర కోసం అలియా భట్ (Alia Bhatt)ను తీసుకున్నట్లు కూడా అప్పట్లో టాక్‌ వినిపిచింది. ఆమెకు లుక్‌ టెస్ట్‌ కూడా చేశారని అన్నారు. కానీ, ఇప్పుడు ఈ పాత్ర కోసం సాయి పల్లవి (Sai Pallavi)పేరు తెరపైకి వచ్చింది. సీత పాత్రకు సాయి పల్లవి అయితేనే సరిపోతుందని భావించిన మేకర్స్‌ ఆమెను సంప్రదించారట. ఈ ప్రాజెక్ట్‌కు ఆమె గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆమెకు లుక్‌ టెస్ట్‌ చేయనున్నట్లు సమాచారం. అలాగే ఈ సినిమా షూటింగ్‌ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభం కానుందట. దీన్ని రెండు భాగాల్లో తీసుకురానున్నారు. మొదటి షెడ్యూల్లోనే రణ్‌బీర్‌, సాయి పల్లవిలకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి నుంచి ఆగస్టు వరకు మొదటి భాగం షూటింగ్‌ నిర్వహించనున్నారట. ఇక ఈ సినిమా వీఎఫ్ఎక్స్‌ ఎఫెక్ట్‌ల కోసం నితేశ్‌ తివారీ టీమ్‌ డీఎన్‌ఈజీ (DNEG) కంపెనీను సంప్రదించినట్లు తెలుస్తోంది. 

‘ఆ దేవుడే నన్ను ఎంచుకున్నారు’..: ఖుష్బూ

అలాగే ఈ సినిమాలో కీలకమైన రావణుడి పాత్ర యశ్‌ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. రెండో భాగంలో యశ్‌కు సంబంధించిన సన్నివేశాలు తెరకెక్కించనున్నారట. దీని కోసం శ్రీలంకలో భారీ సెట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. నితేశ్‌ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను అల్లు అరవింద్‌, మధు మంతెన సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని